రెండు నెలల గరిష్టస్థాయికి మార్కెట్
- ఇసీబీ ప్యాకేజీ ప్రభావం
- సెన్సెక్స్ 183 పాయింట్లు అప్
యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఇసీబీ) త్వరలో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించే సంకేతాలనివ్వడంతో శుక్రవారం ప్రపంచ మార్కెట్లన్నీ ర్యాలీ జరిపాయి. ఇదే క్రమంలో భారత్ మార్కెట్ రెండు నెలల గరిష్టస్థాయి వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 183 పాయింట్ల పెరుగుదలతో 27,471 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 44 పాయింట్ల వృద్ధితో 8,295 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. డాలరుతో రూపాయి మారకపు విలువ సైతం 64,82 స్థాయికి పుంజుకోవడంతో సెంటిమెంట్ మరింత మెరుగుపడింది. ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజపర్చడానికి మరిన్ని రేట్ల తగ్గింపులు వుంటాయంటూ ఈసీబీ ప్రెసిడెంట్ మారియో డ్రాఘి గురువారం సాయంత్రం సంకేతాలిచ్చారు. దాంతో అమెరికా మార్కెట్ పెద్ద ఎత్తున ర్యాలీ జరిపింది. ఈ ప్రభావంతో శుక్రవారం మన మార్కెట్ కూడా ఎగసింది. స్టాక్ సూచీ లు వరుసగా నాల్గవ వారం లాభాల్లో ముగిశాయి.
ఐటీసీ అప్: ఇంకా క్యూ2 ఫలితాల్ని ప్రకటించాల్సివున్న ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ షేరు 2.81 శాతం పెరిగి ఆరు నెలల గరిష్టస్థాయి రూ. 358 వద్ద ముగిసింది. రెండు ప్రధాన సూచీల్లోనూ అధిక వెయిటేజీ కలిగినందున, ఈ షేరు పెరుగుదలతో సూచీలు కూడా పైస్థాయిలో ముగియగలిగాయి.