కొనుగోళ్ల జోరుతో లాభాలు
పడిన షేర్లకు డిమాండ్...
- సానుకూల అంతర్జాతీయ సంకేతాలు
- 311 పాయింట్ల లాభంతో 25,765కు సెన్సెక్స్
- 106 పాయింట్ల లాభపడి 7,823కు నిఫ్టీ
ఇటీవలి పతనం కారణంగా బాగా పడిపోయన షేర్లలో కొనుగోళ్లకు సానుకూల అంతర్జాతీయ సంకేతాలు తోడవడంతో స్టాక్ మార్కెట్ గురువారం లాభాల్లో ముగిసింది. దీంతో మూడు రోజుల నష్టాలకు కళ్లెం పడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 311 పాయింట్ల లాభంతో 25,765 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 106 పాయింట్ల లాభంతో 7,823 పాయింట్ల వద్ద ముగిశాయి. యూరోప్ కేంద్ర బ్యాంక్ సమావేశం నేపథ్యంలో యూరోప్ మార్కెట్లు ర్యాలీ జరపడం, ఆగస్టు నెలలో సేవల రంగంలో వృద్ధి(జూలైలో 50.8గా ఉన్న నికాయ్ సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఆగస్టులో 51.8కు పెరగడం) కూడా ప్రభావం చూపాయి. అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి.
షార్ట్‌కవరింగ్: గత కొన్ని ట్రేడింగ్ సెషన్లలో బాగా పతనమైన బ్యాంక్, ఆర్థిక సేవల, క్యాపిటల్ గూడ్స్, వాహన, లోహ షేర్లలో షార్ట్‌కవరింగ్ జరగడం విదేశీ ఇన్వెస్టర్లపై కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్)కు సంబంధించి తదుపరి చర్యలు నిలిపేయాల్సిందని ఫీల్డ్ ఆఫీసర్లకు సీబీడీటీ ఆదేశాలివ్వడం సెంటిమెంట్‌కు మరింత జోష్‌నిచ్చాయని నిపుణులంటున్నారు. బుధవారం ట్రేడింగ్‌లో అమెరికా స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగియడం, సుదీర్ఘకాల సెలవుల కారణంగా చైనా మార్కెట్ పనిచేయకపోవడంతో ప్రపంచ మార్కెట్లలో ప్రశాంతత నెలకొనడం, వృద్ధి అవకాశాలు భారత్‌కు అనుకూలంగానే ఉన్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి వెలువరించిన తాజా నివేదిక వంటి అంశాలు సానుకూల ప్రభావం చూపాయి. అంచనాలను అందుకోలేని జీడీపీ, తయారీ రంగ గణాంకాలు, ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిల్లోనే ఉండడం వంటి కారణాల వల్ల ఆర్‌బీఐ ఈ నెల 29న జరిగే తన పరపతి సమీక్షలో కీలక రేట్లను తగ్గించే అవకాశాలున్నాయన్న అంచనాలతో కొనుగోళ్లు జోరుగా జరిగాయని నిపుణులంటున్నారు.
రియల్టీ జోరు: గత రెండు నెలల్లో క్షీణిస్తూ వచ్చిన రియల్టీ షేర్లు 8 శాతం వరకూ పెరిగాయి. డీఎల్‌ఎఫ్, హెచ్‌డీఐఎల్, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, డీబీ రియల్టీ, ఒబెరాయ్ రియల్టీ5-8 శాతం రేంజ్‌లో, యూనిటెక్, గోద్రేజ్ ప్రోపర్టీస్, శోభ, డెల్టా కార్ప్, ఆషియానా, ఎన్‌బీసీసీ షేర్లు 1-4 శాతం రేంజ్‌లో పెరిగాయి.