అల్ట్రాటెక్‌.. పూర్తి బిల్డింగ్‌ సొల్యూషన్స్‌! | UltraTech cement forays into Vijayawada | Sakshi
Sakshi News home page

అల్ట్రాటెక్‌.. పూర్తి బిల్డింగ్‌ సొల్యూషన్స్‌!

Published Fri, Jul 28 2017 11:50 PM | Last Updated on Tue, Sep 5 2017 5:05 PM

అల్ట్రాటెక్‌.. పూర్తి బిల్డింగ్‌ సొల్యూషన్స్‌!

అల్ట్రాటెక్‌.. పూర్తి బిల్డింగ్‌ సొల్యూషన్స్‌!

అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ఎండీ కె.కె.మహేశ్వరి
► స్థలం కొనడం నుంచి రంగులు వేసే వరకు సేవలు
► ఈ ఏడాది సిమెంట్‌ పరిశ్రమలో 6% వృద్ధి అంచనా
► ‘రెరా’ వల్ల నష్టం స్వల్ప కాలానికే పరిమితం
►  డిమాండ్‌ను బట్టి ధరలు మారుతుంటాయి


సాక్షి,అమరావతి :  బిర్లా గ్రూపునకు చెందిన అల్ట్రాటెక్‌ సిమెంట్‌ మరింత దూకుడును పెంచింది. జేపీ సిమెంట్‌ను చేజిక్కించుకున్న ఊపుతో దక్షిణ భారతదేశ మార్కెట్‌లో వేగంగా చొచ్చుకుపోవడానికి ప్రణాళికలు రూపొందిం చుకుంటోంది. ఇందులో భాగంగా కేవలం సిమెంట్, కాంక్రీట్‌ విక్రయాలే కాకుండా సొంతింటి నిర్మాణానికి అన్ని సేవలను అందించడంపై ప్రధానంగా దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గయ్యపేటలో ఉన్న జేపీ బాలాజీ సిమెంట్‌ పరి శ్రమ ఇప్పుడు అల్ట్రాటెక్‌ చేతిలోకి రావడంతో పాటు జేపీ సిమెంట్‌  డీలర్లను అల్ట్రాటెక్‌ కుటుంబంలోకి సాదరంగా ఆహ్వా నించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ విచ్చేసిన అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ఎండీ కె.కె. మహేశ్వరితో ‘సాక్షి’ ఇంటర్వ్యూ వివరాలు...

జేపీ సిమెంట్‌ను కొనుగోలు చేసిన తర్వాత అల్ట్రాటెక్‌ భవిష్యత్తు ప్రణాళికలను వివరిస్తారా?
జేపీ సిమెంట్‌ కొనుగోలు చేసిన తర్వాత 93 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో దేశంలో అగ్రగామి సంస్థగా ఎదగడమే కాకుండా ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద కంపెనీగా నిలిచాం. ఈ లావాదేవీ తర్వాత దేశీయ సిమెంట్‌ పరిశ్రమలో అల్ట్రాటెక్‌ వాటా 20 నుంచి 24 శాతానికి పెరిగింది. అత్యంత నాణ్యత గల ప్రీమియం బ్రాండ్‌గా కొనసాగించడంపైనే ప్రధానంగా దృష్టి సారించాం. సిమెంట్‌ కంపెనీల కొనుగోళ్లు, విస్తరణ అన్నది మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతం మా ఉత్పత్తి సామర్థ్యంలో సగటు వినియోగం 70–75 శాతం వరకు ఉంది.

ఆంధ్రప్రదేశ్‌ మార్కెట్‌ విస్తరణ ప్రణాళికలు ఎలా ఉన్నాయి?
ఆంధ్రప్రదేశ్‌ మాకు అత్యంత కీలకమైన రాష్ట్రం. ఇప్పటికే తాడిపత్రిలో యూనిట్‌ ఉండగా, ఇప్పుడు జగ్గయ్యపేటలోని జేపీ బాలాజీ యూనిట్‌ కూడా మా చేతికి వచ్చింది. అదే విధంగా జేపీ డీలర్లు అందరూ అల్ట్రాటెక్‌ పరిధిలోకి వచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతీ నెలా 8 లక్షల టన్నుల సిమెంట్‌ వినియోగం అవుతోంది. గ్లోబల్‌ మార్కెట్‌ లీడర్‌గా రాష్ట్రంలో కూడా అత్యధిక వాటాను కైవసం చేసుకోవడంపైనే ప్రధానంగా దృష్టిసారిస్తాం. జమ్మూ కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు, బెంగాల్‌ నుంచి గుజరాత్‌ వరకు దేశవ్యాప్తంగా అల్ట్రాటెక్‌ విస్తరించింది.

మార్కెట్‌ లీడర్‌గా కొనసాగడానికి ఎటువంటి ప్రణాళికలను అమలు చేస్తున్నారు?
కేవలం సిమెంట్, కాంక్రీట్‌ విక్రయంపైనే కాకుండా ఇంటి స్థలం కొనుగోలు చేయడం దగ్గర నుంచి ఇంటి నిర్మాణం పూర్తి చేయడం వరకు అన్ని సేవలను అందిస్తున్నాం. ఇప్పుడు ముఖ్యంగా దక్షిణాదిలో వాస్తు ప్రభావం ఎక్కువగా ఉంది. అందుకని స్థలం కొనుగోలు, ఇంటి ప్లానింగ్‌కు సంబంధించిన వాస్తు సేవలను అందిస్తున్నాం. అలాగే మేస్త్రీలను ఎంపిక చేసుకోవడం, ఆర్కిటెక్‌ సేవలతో పాటు ఇంటి నిర్మాణానికి అవసరమైన స్టీలు, ఇటుకలు వంటి సామగ్రి కొనుగోలులో సహాయాన్ని అందిస్తున్నాం. ఇంటికి వేసే వైట్‌ సిమెంట్, రంగులు, పుట్టి కొనుగోళ్లకు సంబంధించిన సేవలను కూడా అందిస్తున్నాం. అంతేకాకుండా మేస్త్రీలు, కాంట్రాక్టర్లు, ఆర్కిటెక్‌లకు మార్కెట్లో వస్తున్న కొత్త టెక్నాలజీపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే స్థలం కొనుగోలు దగ్గర నుంచి ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు ఫుల్‌ బిల్డింగ్‌ సొల్యూషన్స్‌ను అందిస్తున్నాం.

పెద్ద నోట్ల రద్దు, రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ (రెరా) ప్రభావం సిమెంట్‌ అమ్మకాలపై ఏ విధంగా ఉంది?
ఏదైనా కొత్త చట్టం వచ్చినప్పుడు భయం అన్నది సహజంగా ఉంటుంది. అలాగే పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ వంటి సంస్కరణలు ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టినప్పుడు అందరూ ఇదే విధంగా భయపడ్డారు. కానీ అవి ఎంత ప్రయోజనాన్ని అందించాయో మనం చూశాం. శస్త్ర చికిత్స చేస్తున్నప్పుడు నొప్పి రావడం సహజం. ఆ తర్వాత ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు. ఇప్పుడు కూడా అంతే. చాలా మందితో చర్చించిన తర్వాతనే రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ను ప్రవేశపెట్టారు. ప్రారంభంలో కొన్ని సమస్యలున్నా.. త్వరలో అవి సర్దుకుంటాయి. వీటి వల్ల సిమెంట్‌ అమ్మకాలపై పెద్దగా ప్రతికూల ప్రభావం చూపలేదు.

ఈ ఏడాది అమ్మకాల్లో ఎటువంటి వృద్ధిని అంచనా వేస్తున్నారు? ధరలు పెరిగే అవకాశం ఉందా?
ఈ ఆర్థిక సంవత్సరం దేశీయ సిమెంట్‌ పరిశ్రమలో 5–6 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాం. మార్కెట్‌ లీడర్‌గా అంతకంటే ఎక్కువ వృద్ధి నమోదు అవుతుందని నమ్మకం ఉంది. ఇక ధరల విషయానికి వస్తే పూర్తిగా మార్కెట్‌ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ధరలు దిగివస్తున్నాయి. ఆ తర్వాత పెరిగే అవకాశం ఉంది. ధరలు తగ్గించకుండా సిమెంట్‌ కంపెనీలు  సిండికేట్‌ అవుతున్నాయన్న వాదనలో నిజం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement