
యునెటైడ్ బ్యాంక్‌కు అర్చన రాజీనామా
న్యూఢిల్లీ: యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్ అర్చనా భార్గవ తన పదవికి రాజీనామా చేశారు. మొండిబకాయిల వెల్లడికి సంబంధించి ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుపై దర్యాప్తు మొదలైన నేపథ్యంలో అర్చన రాజీనామాకు ప్రాధాన్యత ఏర్పడింది. అర్చన స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారని ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ రాజీవ్ టక్రు చెప్పారు.
ఆమె రాజీనామాను ప్రభుత్వం ఆమోదించిందని, ఈ నెల 20 నుంచి ఇది వర్తిస్తుందని తెలిపారు. రాజీనామాకు ఆరోగ్య సమస్యలను అర్చన ప్రస్తావించినట్లు తెలుస్తోంది. బ్యాంకు చైర్‌పర్సన్‌గా 2013 ఏప్రిల్ 23న అర్చన పదవీ బాధ్యతలు స్వీకరించారు. నిజానికి 2015 ఫిబ్రవరి 28న ఆమె పదవీ విరమణ చేయాల్సి ఉంది. మొండిబకాయిల వెల్లడి, రుణ ఎగవేతల ఖాతాలు, రుణ పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలలో బ్యాంకు విఫలమైన నేపథ్యంలో ప్రస్తుతం పాలనా సంబంధ దర్యాప్తు నడుస్తున్న విషయం విదితమే. బీఎస్‌ఈలో బ్యాంకు షేరు 0.4% లాభపడి రూ. 24.35 వద్ద ముగిసింది.