యునెటైడ్ బ్రూవరీస్‌కు యూఎస్‌ఎల్ గుడ్‌బై | United Breweries to USL Goodbye | Sakshi
Sakshi News home page

యునెటైడ్ బ్రూవరీస్‌కు యూఎస్‌ఎల్ గుడ్‌బై

Published Wed, Jul 8 2015 12:16 AM | Last Updated on Sun, Sep 3 2017 5:04 AM

యునెటైడ్ బ్రూవరీస్‌కు యూఎస్‌ఎల్ గుడ్‌బై

యునెటైడ్ బ్రూవరీస్‌కు యూఎస్‌ఎల్ గుడ్‌బై

రూ.872 కోట్ల విలువైన వాటా విక్రయం...
 
 న్యూఢిల్లీ : విజయ్ మాల్యాకు చెందిన యునెటైడ్ బ్రూవరీస్(యూబీఎల్) నుంచి యునెటైడ్ స్పిరిట్స్(యూఎస్‌ఎల్) పూర్తిగా వైదొలిగింది. బ్రిటన్ లిక్కర్ దిగ్గజం డియాజియో ప్రస్తుతం యూఎస్‌ఎల్‌లో ప్రధాన వాటాదారుగా ఉన్న సంగతి తెలిసిందే. యూబీఎల్‌లో తనకున్న మొత్తం 3.21 శాతం వాటాను సుమారు రూ.872 కోట్లకు విక్రయించినట్లు బీఎస్‌ఈకి వెల్లడించిన సమాచారంలో యూఎస్‌ఎల్ పేర్కొంది. ఎన్‌ఎస్‌ఈలో 85 లక్షల షేర్లను బ్లాక్‌ట్రేడ్ ద్వారా విక్రయానికి పెట్టామని, ఒక్కో షేరుకి రూ.1,030 విలువ లభించినట్లు తెలిపింది. హెనికెన్ ఇంటర్నేషనల్ బీవీ అనే సంస్థ ఈ మొత్తం వాటాను కొనుగోలు చేసినట్లు యూఎస్‌ఎల్ వెల్లడించింది.

నాన్-కోర్ అసెట్స్(అప్రాధాన్య ఆస్తులు)ను వదిలించుకునే చర్యల్లో భాగంగానే ఈ వాటా అమ్మకాన్ని చేపట్టినట్లు వివరించింది. మాల్యా ప్రమోట్ చేసిన యూబీ గ్రూప్ నేతృత్వంలోని యూఎస్‌ఎల్‌లో మెజారిటీ వాటా(55 శాతం)ను 2012 నవంబర్‌లో డియాజియో చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు దాదాపు 3 బిలియన్ డాలర్లను వెచ్చించింది. కాగా, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, ఇతర యూబీ గ్రూప్ సంస్థలకు మాల్యా అక్రమంగా రూ.1,337 కోట్ల యూఎస్‌ఎల్ నిధులను పక్కదారిపట్టించారని ఆరోపిస్తూ.. కంపెనీ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాల్సిందిగా యూఎస్‌ఎల్ డిమాండ్ చేయడం విదితమే.

దీనిపై దర్యాప్తునకు కూడా ఆదేశించింది. అయితే, ఈ ఆరోపణలను తోసిపుచ్చిన మాల్యా, పదవినుంచి వైదొలిగేది లేదంటూ తేల్చిచెప్పారు కూడా. కాగా, ఈ ఉదంతం నేపథ్యంలో కంపెనీ ఖాతాలను తనిఖీ చేయడం కోసం ఐటీ, కార్పొరేట్ వ్యవహారాల శాఖలు యూఎస్‌ఎల్‌కు ఇప్పటికే నోటీసులు ఇచ్చాయి. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో యూబీఎల్ షేరు ధర 0.90 శాతం నష్టంతో రూ.1,016 వద్ద ముగిసింది. యూఎస్‌ఎల్ షేరు 1.87 శాతం ఎగబాకి రూ.3,500 వద్ద స్థిరపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement