
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకులకు వేలాది కోట్ల రుణ ఎగవేత కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ బ్రిటన్‌లో తలదాచుకున్న లిక్కర్ దిగ్గజం విజయ్ మాల్యా కంపెనీ యూబీఎల్ నుంచి ఎస్‌బీఐ నేతృత్వంలోని కన్సార్షియం రూ 1008 కోట్లు రాబట్టగలిగింది. విజయ్ మాల్యాకు చెందిన యూబీఎల్ షేర్ల విక్రయంతో ఈ మొత్తాన్ని రికవరీ అధికారి వసూలు చేశారు. యస్ బ్యాంక్ వద్ద యూబీ షేర్లు పెద్దమొత్తంలో తనఖా కింద ఉన్నాయని విజయ్ మాల్యా కేసును విచారిస్తున్న ఈడీ దర్యాప్తులో వెల్లడైంది.
కాగా, యస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాన్ని ఇప్పటికే కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తిరిగి చెల్లించిందని, రుణ మొత్తంలో కొద్ది భాగమే పెండింగ్‌లో ఉందని తదుపరి దర్యాప్తులో ఈడీ తేల్చింది. దీంతో యస్ బ్యాంక్ వద్ద కుదువ పెట్టిన షేర్లపై బ్యాంకుకు నియంత్రణ ఉండే అవకాశం పెద్దగా ఉండబోదని దర్యాప్తు ఏజెన్సీ భావించి ఆ దిశగా పావులు కదిపింది. వీటి స్వాధీనం కోసం ఈడీ దరఖాస్తు మేరకు మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా పీఎంఎల్‌ఏ కోర్టు ప్రకటించింది. ఈడీ వినతితో తనఖాతో కూడిన, తనఖా లేని 74,04,932 యూబీఎల్ షేర్లను కోర్టు అటాచ్ చేసింది.
అయితే ఈ షేర్లు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణానికి తనఖాగా యస్ బ్యాంక్ వద్ద ఉన్నాయి. పీఎంఎల్‌ఏ కోర్టు నిర్ణయం మేరకు యూబీఎల్ షేర్లను డెట్ రికవరీ ట్రిబ్యునల్‌కు చెందిన రికవరీ అధికారికి బదలాయించాలని యస్ బ్యాంక్‌కు గత ఏడాది జులై 9న నోటీసులు జారీ అయ్యాయి. అయితే ట్రిబ్యునల్ ఆదేశాలను సవాల్ చేస్తూ యస్ బ్యాంక్ కర్నాటక హైకోర్టును ఆశ్రయించగా వాదప్రతివాదనలు పూర్తయిన మీదట యూబీఎల్ షేర్లను రికవరీ అధికారికి మూడు వారాల్లోగా బదలాయించాలని ఈ ఏడాది ఫిబ్రవరి 27న యస్ బ్యాంక్‌ను హైకోర్టు ఆదేశించింది. ప్రత్యేక న్యాయస్ధానం నుంచి సానుకూల ఉత్తర్వులు రావడంతో రికవరీ అధికారి బుధవారం షేర్లను విక్రయించడంతో రూ 1008 కోట్లు రికవరీ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment