సాక్షి,న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు మరో భారీ ఎదురు దెబ్బ తగలనుంది. యూబీఎల్(యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్) కంపెనీ నుంచి మాల్యాకు చెక్ పెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. యూబీఎల్ కంపెనీలోఇటీవల తన వాటాను భారీగా పెంచుకున్న డచ్ బ్రూవర్ హైనెకెన్, యూబీఎల్ చైర్మన్‌గా మాల్యాను తొలగించేందుకు పావులు కదుపుతోంది. ఈ మేరకు కంపెనీ నిబంధనలను మార్చడానికి కూడా ప్రయత్నిస్తోంది.
డెట్ రికవరీ ట్రిబ్యునల్ నుండి యూబీఎల్‌లో మాల్యా షేర్లను హైనెకెన్ కొనుగోలు చేసింది. తద్వారా తన వాటాను 46.5 శాతం నుంచి 61.5 శాతానికి పెంచుకుంది. ఇపుడిక మాల్యాకు ఉద్వాసన పలికేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకు రానున్న ఏజీఎంలో హైనెకెన్ ఇంటర్నేషనల్ సంస్థ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ (ఏఒఏ) మార్చడానికి వాటాదారుల అనుమతి కోరుతోంది. జూలై 29 న జరగనున్న కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో హీనెకెన్ అనుమతి పొందవలసి ఉంది. ఎందుకంటే యూబీఎల్‌కు లైఫ్ టైం ఛైర్మన్‌గా ఉన్న మాల్యాకు మాత్రమే తదుపరి ఛైర‍్మన్‌ను నామినేట్ చేసే అధికారం ఉంది. అయితే ప్రతిపాదిక ఏజీఎం కంటే ముందే స్వచ్ఛందంగా తప్పుకునేందుకు మాల్యా అంగీకరిస్తే, ఈ తీర్మానాన్ని ఉపసంహరించుకోవచ్చని దిఎకనామిక్ టైమ్స్ ఒక నివేదికలో పేర్కొంది. సంస్థలో హైనెకెన్ మెజారిటీ వాటాదారే అయినప్పటికీ నిబంధనల ప్రకారం ఏఓఏ మార్పుకు 75 శాతం వాటా తప్పనిసరిగా కలిగి ఉండాలి. దీంతో ఈ వ్యవహారంలో పలు ఆర్థికసంస్థలతో ఇప్పటికే చర్చించినట్లు సమాచారం.
కాగా 2008లో హైనెకెన్ కొనుగోలుకు మాల్యా చేసుకున్న ఒప్పందం ఇంకా మార్చలేదు. అయితే లిస్టెడ్ కంపెనీకి డైరెక్టర్‌గా ఉండకూడదంటూ సెబీ అనర్హత వేటు వేయడంతో 2017లో యుబీఎల్ బోర్డు నుండి మాల్యా వైదొలగాల్సి వచ్చింది. మనీలాండరింగ్ ఆరోపణలకింద లండన్‌లో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం బెయిల్‌మీద ఉన్న మాల్యాను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment