ousting orders
-
‘ఇది నా కంపెనీ.. నేనెందుకు బయటికి పోవాలి’
BharatPe MD Ashneer Grover Huge Demand Before Investors For Leaving Company: ఫిన్‌టెక్ కంపెనీ భారత్‌పేలో అవినీతి ఆరోపణలతో పాటు ప్రవర్తన తీరు సరిగా లేదన్న వ్యవహారంపై మేనేజింగ్ డైరెక్టర్ అష్నీర్ గ్రోవర్ మీద దర్యాప్తు నడుస్తోంది. లావాదేవీల్లో మోసాలు, ఆరోపణలపై సొంత టీంతో కాకుండా.. స్వతంత్ర విభాగాన్ని నియమించింది భారత్‌పే. ఈ తరుణంలో ఆయన్ను గద్దె దించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. అయితే.. తాను కంపెనీని వీడాలంటే.. 4 వేల కోట్ల రూపాయలు తన ముందు పెట్టాలని ఆయన ఇన్వెస్టర్లను డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఓ బిజినెస్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఆయన సంకేతాలు పంపించారు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ కొట్టిపారేసిన గ్రోవర్.. తనను ఇన్వెస్టర్లు గనుక బయటకు పంపాలనుకుంటే తన డిమాండ్లను నెరవేర్చాల్సిందేనని పట్టుబడుతున్నారు. భారత్‌పేలో గ్రోవర్‌కి 9.5 శాతం వాటా ఉంది. ప్రస్తుతం ఆయన సంపద విలువ 21 వేల కోట్ల రూపాయాలకు పైనే. ఇక భారత్‌పే కంపెనీ విలువ 6 బిలియన్ డాలర్లకు పైనే ఉంటుందన్నది ఒక అంచనా. ‘‘రాజీనామా చేసేంత తప్పు నేనేం చేశా?. నేను ఈ కంపెనీ ఎండీని. కంపెనీని నడిపిస్తోంది నేనే. ఒకవేళ బోర్డు గనుక నా అవసరం లేదనుకుంటే.. నన్ను ఎండీగా కొనసాగించడం ఇష్టం లేదనుకుంటే.. నాకు రావాల్సిన 4 వేల కోట్ల రూపాయలను టేబుల్ మీద పెట్టి.. తాళాలు తీసుకోవచ్చు. ఒకటి కంపెనీని నేనే నడిపించడమా? లేదా నాకు సెటిల్ మెంట్ చేసి బయటకు పంపించడమా? అంతేతప్ప.. మూడో ఆప్షన్ బోర్డు దగ్గర లేదు అని స్పష్టం చేశాడాయన. మరోవైపు ఆయన న్యాయపోరాటానికి సైతం సిద్ధమయ్యారు. ప్రస్తుతం సీఈవోగా ఉన్న సుహాయిల్ సమీర్‌ను పదవి నుంచి తప్పించాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నాడు కూడా. ఇదిలా ఉంటే.. నైకా ఐపీవోకి సంబంధించిన పెట్టుబడుల విషయంలో కొటాక్ మహీంద్ర బ్యాంక్‌తో భారత్‌పే ఎండీ అష్నీర్ గ్రోవర్‌కి వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో బ్యాంకుకు లీగల్ నోటీసులు పంపిన కొద్దిరోజులకే.. కొటక్ ఎంప్లాయి ఒకరిని ఫోన్లో బండబూతులు తిట్టాడు అష్నీర్. అందుకు సంబంధించిన క్లిప్ ఒకటి బయటకు రాగా.. ఈ వ్యవహారానికి సంబంధించి కొటక్ బ్యాంకు లీగల్ నోటీసులు పంపింది భారత్‌పేకు. ఈ పరిణామాలతో అష్నీర్ గ్రోవర్ కొన్నాళ్లపాటు సెలవుల మీద బయటకు వెళ్లగా.. తాజాగా ఆయన సెలవులను మార్చి 31 వరకు పొడిగించింది భారత్‌పే. దీంతో ఆయన ఉద్వాసన ఖాయమని అంతా భావించగా.. అలాంటిదేం లేదని కంపెనీ ప్రకటన ఇచ్చింది. ఆ కొద్దిరోజులకే ఆయన భార్య మాధురిని సైతం సెలవుల మీద పంపింది. ఈ గ్యాప్‌లో భారత్‌పే సీఈవో సుహాయిల్ సమీర్‌కు బాధ్యతలు అప్పజెప్పిన బోర్డు.. అష్నీర్ ఆయన భార్య మాధురి ఇద్దరూ ఫేక్ ఇన్వాయిస్లతో భారీ అవకతవకలకు పాల్పడ్డాడంటూ ఫోరెన్సిక్ అడిట్ కోసం అల్వరెజ్& మార్షల్, పీడబ్ల్యూసీలను నియమించి.. దాదాపుగా ఆయన ఉద్వాసనను ఖరారు చేసింది. -
మాల్యాకు మరోషాక్, యూబీఎల్ నుంచి ఔట్?
సాక్షి,న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు మరో భారీ ఎదురు దెబ్బ తగలనుంది. యూబీఎల్(యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్) కంపెనీ నుంచి మాల్యాకు చెక్ పెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. యూబీఎల్ కంపెనీలోఇటీవల తన వాటాను భారీగా పెంచుకున్న డచ్ బ్రూవర్ హైనెకెన్, యూబీఎల్ చైర్మన్‌గా మాల్యాను తొలగించేందుకు పావులు కదుపుతోంది. ఈ మేరకు కంపెనీ నిబంధనలను మార్చడానికి కూడా ప్రయత్నిస్తోంది. డెట్ రికవరీ ట్రిబ్యునల్ నుండి యూబీఎల్‌లో మాల్యా షేర్లను హైనెకెన్ కొనుగోలు చేసింది. తద్వారా తన వాటాను 46.5 శాతం నుంచి 61.5 శాతానికి పెంచుకుంది. ఇపుడిక మాల్యాకు ఉద్వాసన పలికేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకు రానున్న ఏజీఎంలో హైనెకెన్ ఇంటర్నేషనల్ సంస్థ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ (ఏఒఏ) మార్చడానికి వాటాదారుల అనుమతి కోరుతోంది. జూలై 29 న జరగనున్న కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో హీనెకెన్ అనుమతి పొందవలసి ఉంది. ఎందుకంటే యూబీఎల్‌కు లైఫ్ టైం ఛైర్మన్‌గా ఉన్న మాల్యాకు మాత్రమే తదుపరి ఛైర్మన్‌ను నామినేట్ చేసే అధికారం ఉంది. అయితే ప్రతిపాదిక ఏజీఎం కంటే ముందే స్వచ్ఛందంగా తప్పుకునేందుకు మాల్యా అంగీకరిస్తే, ఈ తీర్మానాన్ని ఉపసంహరించుకోవచ్చని దిఎకనామిక్ టైమ్స్ ఒక నివేదికలో పేర్కొంది. సంస్థలో హైనెకెన్ మెజారిటీ వాటాదారే అయినప్పటికీ నిబంధనల ప్రకారం ఏఓఏ మార్పుకు 75 శాతం వాటా తప్పనిసరిగా కలిగి ఉండాలి. దీంతో ఈ వ్యవహారంలో పలు ఆర్థికసంస్థలతో ఇప్పటికే చర్చించినట్లు సమాచారం. కాగా 2008లో హైనెకెన్ కొనుగోలుకు మాల్యా చేసుకున్న ఒప్పందం ఇంకా మార్చలేదు. అయితే లిస్టెడ్ కంపెనీకి డైరెక్టర్‌గా ఉండకూడదంటూ సెబీ అనర్హత వేటు వేయడంతో 2017లో యుబీఎల్ బోర్డు నుండి మాల్యా వైదొలగాల్సి వచ్చింది. మనీలాండరింగ్ ఆరోపణలకింద లండన్‌లో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం బెయిల్‌మీద ఉన్న మాల్యాను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. -
తోషిబా సంచలన నిర్ణయం
టోక్యో: దిగ్గజ కంపెనీ తొషిబాలో అవినీతి, కుట్రకు ఎట్టకేలకు తిరుగుబాటుతో చెక్ పెట్టారు షేర్ హోల్డర్లు. తొషిబా కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఒసామూ నగయమా(74)ను అర్థాంతరంగా గద్దె దించేశారు. శుక్రవారం సాయంత్రం ఒసామూ రీ ఎలక్షన్ కోసం జరిగిన ఓటింగ్.. నాటకీయ పరిణామాల మధ్య ముగిసింది. ఆపై ఒసామూను చైర్మన్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు కావాలనే ఆలస్యంగా ప్రకటించింది బోర్డు. జపాన్ ప్రభుత్వంతో కుమ్మక్కై.. ప్రైవేట్ ఇన్వెస్టర్ల ఆసక్తిని దెబ్బతీస్తున్నాడని, అధికారులతో కిందటి ఏడాది బోర్డు నామినీల ఓటింగ్‌పై ప్రభావం చూపెట్టాడనేది ఒసామూ మీద ఉన్న ప్రధాన ఆరోపణలు. ఈ కుంభకోణం బయటపడ్డప్పటికీ ఆయన్నే కొనసాగించాలని పలువురు ఇన్వెస్టర్లు మద్దతు చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తొలగింపుపై బోర్డు తొందరపాటు ప్రదర్శించలేదు. అయితే శుక్రవారం సాధారణ సమావేశాల సందర్భంగా ఉన్నపళంగా ఓటింగ్ నిర్వహించారు. ఈ క్రమంలోనే ఒసామూను గద్దె దించుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఒసామూ మద్దతుదారులు మాత్రం.. సంక్షోభ సమయంలో ఆయన పనితీరును చూసైనా మరో అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ, ఇలాంటి విషయాల్లో కఠినంగా వ్యవహారిస్తామనే సంకేతాల్ని బయటి ఇన్వెస్టర్లకు తోషిబా పంపినట్లయ్యింది. ఇక సంస్కరణలేనా? జపాన్ కార్పొరేట్ గవర్నెన్స్‌లో ఈ నిర్ణయం ఒక మైలు రాయి అని, ముందు ముందు ఇది విప్లవాత్మక మార్పులకు దారితీస్తుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. కాగా, గతంలో ఒసామూ రాజీనామాను డిమాండ్ చేసిన తొషిబా అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ భాగస్వామి 3డీ కంపెనీ తాజా పరిణామాలను స్వాగతించింది. ఇక చైర్మన్ పదవికి ప్రతిపాదించిన పేర్లను పక్కనపెట్టిన బోర్డు.. తాత్కాలిక చైర్మన్‌గా తొషిబా సీఈవో సతోషి సునాకవా కొనసాగనున్నారు. సతోషి ఆధ్వర్యంలో త్వరలో మరిన్ని సంస్కరణలతో కంపెనీని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని బోర్డు తీర్మానం చేసుకుంది. కాగా, ఇంతకు ముందు చైర్మన్‌గా ఉన్న నోబువాకి కురుమటాని కూడా అవినీతి ఆరోపణల విమర్శల నేపథ్యంలో రాజీనామా చేశాడు. జపాన్‌తో పాటు ప్రపంచ దేశాలకు తోషిబా బ్రాండ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. హోం ఎలక్ట్రికల్స్ గూడ్స్ నుంచి న్యూక్లియర్ పవర్ స్టేషన్ రంగంలోనూ తోషిబా ఒకప్పుడు రారాజుగా ఉండేది. అయితే మేనేజ్మెంట్ తప్పిదాలు, సరైన పాలనా-పర్యవేక్షణ లేకపోవడమనే కారణాలు.. మార్కెట్‌ను కోల్పోతూ వస్తోంది. చదవండి: దెబ్బకు 32 కోట్ల డాలర్ల నష్టం -
ఫౌచీ ఊస్టింగ్.. వైరస్ గుట్టు వీడిందా?
డాక్టర్ ఆంటోనీ ఫౌచీ.. కరోనా టైం నుంచి ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. వైరస్ వ్యాప్తి తీరుపై విశ్లేషణ, సలహాలు ఇస్తున్న ఫౌచీని ఉన్నపళంగా ఆ పదవి నుంచి తొలగించారట. అంతేకాదు ఆయన ఊస్టింగ్‌కు సంబంధించి ప్రత్యేకంగా ఒక బిల్లును కూడా కాంగ్రెస్(పార్లమెంట్)లో ప్రవేశపెట్టారని కూడా తెలుస్తోంది. మరోవైపు కరోనా వైరస్ ల్యాబ్‌ల్లోనే తయారు చేశారనే విషయాన్ని అమెరికా అధికారికంగా ధృవీకరించిందనేది మరో వార్త. ఫేస్బుక్, వాట్సాప్‌లో ఫార్వార్డ్ అవుతున్న ఈ వార్తల్లో ఉన్న సగం నిజమెంతంటే.. సీనియర్ ఫిజిషియన్, అమెరికాలోనే టాప్ ఇమ్యునాలజిస్ట్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ (ఎన్ఐఏఐడి) డైరెక్టర్ ఆంటోనీ ఫౌచీ. అంతెందుకు అమెరికా అధ్యక్షుడికి ఈయనే ఆరోగ్య సలహాదారు కూడా. అలాంటి వ్యక్తిని ఉన్నపళంగా పదవి నుంచి తొలగించాల్సిన అవసరం ఏముందసలు?.. విషయంలోకి వెళ్తే.. ఫౌచీ నిర్లక్క్ష్యం వల్లే అమెరికాలో కరోనాతో తీరని నష్టం వాటిల్లిందని, వైరస్ వ్యాప్తి టైంలో ఆయన ప్రభుత్వానికి సరైన మార్గనిర్దేశం చేయలేకపోయాడని, పైగా వైరస్ వ్యాప్తికి సంబంధించి రహస్య ఈ-మెయిల్స్ ద్వారా ఫౌచీ కుట్రకు పాల్పడ్డారనేది రిపబ్లికన్ ఎంపీ మర్జోరి టేలర్ గ్రీనె ఆరోపణ. ఈ మేరకు ఆమె ‘ఫైర్ ఫౌచీ యాక్ట్’ పేరుతో ప్రత్యేకంగా ఒక బిల్లును రూపొందించింది. అయితే ఈ బిల్లు ఇంకా పార్లమెంట్లో చర్చదశకు రాలేదు. ఈలోపే ఓటింగ్ జరిగిందని, ఆమోదం దొరికిందని, ఫౌచీ పని అయిపోయిందని ఫేక్ కథనాలు వెలువడ్డాయి. ఇక కరోనా వైరస్ గుట్టు తేల్చేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అమెరికా నిఘా వర్గాలకు 90 రోజుల గడువు విధించిన విషయం తెలిసిందే(మే 26 ఆదేశాలు వెలువడ్డాయి). వైరస్‌ను ల్యాబ్‌లోనే తయారు చేశారా?, లేదంటే జంతువుల ద్వారా సోకిందా? తేల్చాలని ఆయన నిఘా ఏజెన్సీలను ఆదేశించాడు. అయితే నెలలోపే దర్యాప్తు పూర్తైందని, ఇది మనిషి తయారు చేసిందని అమెరికా ధృవీకరించిందని ఒక ప్రైవేట్ బ్లాగ్ ద్వారా ఫేక్ వార్త వైరల్ అయ్యింది. ఇక ఈ రెండు ఫేక్ అని వైట్‌హౌజ్ ప్రతినిధి ఒకరు అధికారికంగా వెల్లడించారు. అంతేకాదు ‘ఫౌచీ పట్ల తాను అత్యంత నమ్మకంగా ఉన్నట్లు’ ఈ నెల మొదట్లో ఓ ఇంటర్వ్యూలో స్వయంగా బైడెన్ ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాడు ఆ అధికారి. చదవండి: కరోనా పుట్టకపై ఫౌచీ కీలక వ్యాఖ్యలు -
కాంట్రాక్టు ఉద్యోగులకు చంద్రబాబు షాక్
అమరావతి : ఎన్నికల ముందు బాబొస్తే జాబొస్తుందని ప్రకటనలతో పెద్ద ఎత్తున ఊదరగొట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా కాంట్రాక్టు ఉద్యోగులకు షాకిచ్చారు. ఆయుష్ విభాగంలో పనిచేస్తున్న 800 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయుష్ ఉద్యోగుల అవసరం లేదని, జీతాలు ఇవ్వలేమంటూ, వారిని ఇంటికి పంపించడని ఆదేశాలు జారీచేశారు. ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా 2016–17 సంవత్సరం పనిచేసిన 12నెలల కాలానికి వేతనం కూడా ఇవ్వకూడదని నిర్దాక్షిణ్యంగా చెప్పడంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఒక్కసారిగా భయాందోళన మొదలైంది. తాజా ఉత్తర్వులతో భవిష్యత్‌లో ఇంకా ఎంత మందిని సర్కారు తొలగిస్తుందోనన్న భయం నెలకొంది. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై ఆయుష్ ఉద్యోగుల సంఘం ప్రతినిధి సురేష్ స్పందిస్తూ ప్రభుత్వం అత్యంత దుర్మార్గమైన చర్యలకు ఒడిగట్టిందని, దీనిపై 800 మంది ఉద్యోగులు నిరాహార దీక్షకు దిగుతున్నట్టు ప్రకటించారు. కాగా ఆయుష్ ఉద్యోగులను తొలగించడంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత తెలివిగా వ్యవహరించింది. ఏప్రిల్ 20 నాటికే ఉద్యోగుల తొలగింపు ఉత్తర్వులు సిద్ధం చేశారు. అయితే వెంటనే ఉత్తర్వులు జారీ చేస్తే వాళ్లంతా.. కోర్టుకెళ్లి స్టే తెచ్చుకుంటారేమోనన్న అనుమానంతో ఏప్రిల్ 28 వరకూ జారీ చెయ్యలేదు. ఏప్రిల్ 28 నుంచి కోర్టు సెలవులు కావడంతో ఏప్రిల్ 30న అన్ని ప్రాంతీయ సంచాలకులకు పంపించారు.