UBL
-
మాల్యాకు మరోషాక్, యూబీఎల్ నుంచి ఔట్?
సాక్షి,న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు మరో భారీ ఎదురు దెబ్బ తగలనుంది. యూబీఎల్(యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్) కంపెనీ నుంచి మాల్యాకు చెక్ పెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. యూబీఎల్ కంపెనీలోఇటీవల తన వాటాను భారీగా పెంచుకున్న డచ్ బ్రూవర్ హైనెకెన్, యూబీఎల్ చైర్మన్‌గా మాల్యాను తొలగించేందుకు పావులు కదుపుతోంది. ఈ మేరకు కంపెనీ నిబంధనలను మార్చడానికి కూడా ప్రయత్నిస్తోంది. డెట్ రికవరీ ట్రిబ్యునల్ నుండి యూబీఎల్‌లో మాల్యా షేర్లను హైనెకెన్ కొనుగోలు చేసింది. తద్వారా తన వాటాను 46.5 శాతం నుంచి 61.5 శాతానికి పెంచుకుంది. ఇపుడిక మాల్యాకు ఉద్వాసన పలికేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకు రానున్న ఏజీఎంలో హైనెకెన్ ఇంటర్నేషనల్ సంస్థ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ (ఏఒఏ) మార్చడానికి వాటాదారుల అనుమతి కోరుతోంది. జూలై 29 న జరగనున్న కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో హీనెకెన్ అనుమతి పొందవలసి ఉంది. ఎందుకంటే యూబీఎల్‌కు లైఫ్ టైం ఛైర్మన్‌గా ఉన్న మాల్యాకు మాత్రమే తదుపరి ఛైర్మన్‌ను నామినేట్ చేసే అధికారం ఉంది. అయితే ప్రతిపాదిక ఏజీఎం కంటే ముందే స్వచ్ఛందంగా తప్పుకునేందుకు మాల్యా అంగీకరిస్తే, ఈ తీర్మానాన్ని ఉపసంహరించుకోవచ్చని దిఎకనామిక్ టైమ్స్ ఒక నివేదికలో పేర్కొంది. సంస్థలో హైనెకెన్ మెజారిటీ వాటాదారే అయినప్పటికీ నిబంధనల ప్రకారం ఏఓఏ మార్పుకు 75 శాతం వాటా తప్పనిసరిగా కలిగి ఉండాలి. దీంతో ఈ వ్యవహారంలో పలు ఆర్థికసంస్థలతో ఇప్పటికే చర్చించినట్లు సమాచారం. కాగా 2008లో హైనెకెన్ కొనుగోలుకు మాల్యా చేసుకున్న ఒప్పందం ఇంకా మార్చలేదు. అయితే లిస్టెడ్ కంపెనీకి డైరెక్టర్‌గా ఉండకూడదంటూ సెబీ అనర్హత వేటు వేయడంతో 2017లో యుబీఎల్ బోర్డు నుండి మాల్యా వైదొలగాల్సి వచ్చింది. మనీలాండరింగ్ ఆరోపణలకింద లండన్‌లో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం బెయిల్‌మీద ఉన్న మాల్యాను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. -
మాల్యా కేసు: రూ 1008 కోట్లు రికవరీ
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకులకు వేలాది కోట్ల రుణ ఎగవేత కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ బ్రిటన్‌లో తలదాచుకున్న లిక్కర్ దిగ్గజం విజయ్ మాల్యా కంపెనీ యూబీఎల్ నుంచి ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్షియం రూ 1008 కోట్లు రాబట్టగలిగింది. విజయ్ మాల్యాకు చెందిన యూబీఎల్ షేర్ల విక్రయంతో ఈ మొత్తాన్ని రికవరీ అధికారి వసూలు చేశారు. యస్ బ్యాంక్ వద్ద యూబీ షేర్లు పెద్దమొత్తంలో తనఖా కింద ఉన్నాయని విజయ్ మాల్యా కేసును విచారిస్తున్న ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. కాగా, యస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాన్ని ఇప్పటికే కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తిరిగి చెల్లించిందని, రుణ మొత్తంలో కొద్ది భాగమే పెండింగ్‌లో ఉందని తదుపరి దర్యాప్తులో ఈడీ తేల్చింది. దీంతో యస్ బ్యాంక్ వద్ద కుదువ పెట్టిన షేర్లపై బ్యాంకుకు నియంత్రణ ఉండే అవకాశం పెద్దగా ఉండబోదని దర్యాప్తు ఏజెన్సీ భావించి ఆ దిశగా పావులు కదిపింది. వీటి స్వాధీనం కోసం ఈడీ దరఖాస్తు మేరకు మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా పీఎంఎల్ఏ కోర్టు ప్రకటించింది. ఈడీ వినతితో తనఖాతో కూడిన, తనఖా లేని 74,04,932 యూబీఎల్ షేర్లను కోర్టు అటాచ్ చేసింది. అయితే ఈ షేర్లు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణానికి తనఖాగా యస్ బ్యాంక్ వద్ద ఉన్నాయి. పీఎంఎల్ఏ కోర్టు నిర్ణయం మేరకు యూబీఎల్ షేర్లను డెట్ రికవరీ ట్రిబ్యునల్‌కు చెందిన రికవరీ అధికారికి బదలాయించాలని యస్ బ్యాంక్‌కు గత ఏడాది జులై 9న నోటీసులు జారీ అయ్యాయి. అయితే ట్రిబ్యునల్ ఆదేశాలను సవాల్ చేస్తూ యస్ బ్యాంక్ కర్నాటక హైకోర్టును ఆశ్రయించగా వాదప్రతివాదనలు పూర్తయిన మీదట యూబీఎల్ షేర్లను రికవరీ అధికారికి మూడు వారాల్లోగా బదలాయించాలని ఈ ఏడాది ఫిబ్రవరి 27న యస్ బ్యాంక్‌ను హైకోర్టు ఆదేశించింది. ప్రత్యేక న్యాయస్ధానం నుంచి సానుకూల ఉత్తర్వులు రావడంతో రికవరీ అధికారి బుధవారం షేర్లను విక్రయించడంతో రూ 1008 కోట్లు రికవరీ అయ్యాయి. -
యునెటైడ్ బ్రూవరీస్‌కు యూఎస్ఎల్ గుడ్‌బై
రూ.872 కోట్ల విలువైన వాటా విక్రయం... న్యూఢిల్లీ : విజయ్ మాల్యాకు చెందిన యునెటైడ్ బ్రూవరీస్(యూబీఎల్) నుంచి యునెటైడ్ స్పిరిట్స్(యూఎస్ఎల్) పూర్తిగా వైదొలిగింది. బ్రిటన్ లిక్కర్ దిగ్గజం డియాజియో ప్రస్తుతం యూఎస్‌ఎల్‌లో ప్రధాన వాటాదారుగా ఉన్న సంగతి తెలిసిందే. యూబీఎల్‌లో తనకున్న మొత్తం 3.21 శాతం వాటాను సుమారు రూ.872 కోట్లకు విక్రయించినట్లు బీఎస్ఈకి వెల్లడించిన సమాచారంలో యూఎస్ఎల్ పేర్కొంది. ఎన్ఎస్ఈలో 85 లక్షల షేర్లను బ్లాక్‌ట్రేడ్ ద్వారా విక్రయానికి పెట్టామని, ఒక్కో షేరుకి రూ.1,030 విలువ లభించినట్లు తెలిపింది. హెనికెన్ ఇంటర్నేషనల్ బీవీ అనే సంస్థ ఈ మొత్తం వాటాను కొనుగోలు చేసినట్లు యూఎస్ఎల్ వెల్లడించింది. నాన్-కోర్ అసెట్స్(అప్రాధాన్య ఆస్తులు)ను వదిలించుకునే చర్యల్లో భాగంగానే ఈ వాటా అమ్మకాన్ని చేపట్టినట్లు వివరించింది. మాల్యా ప్రమోట్ చేసిన యూబీ గ్రూప్ నేతృత్వంలోని యూఎస్‌ఎల్‌లో మెజారిటీ వాటా(55 శాతం)ను 2012 నవంబర్‌లో డియాజియో చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు దాదాపు 3 బిలియన్ డాలర్లను వెచ్చించింది. కాగా, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, ఇతర యూబీ గ్రూప్ సంస్థలకు మాల్యా అక్రమంగా రూ.1,337 కోట్ల యూఎస్ఎల్ నిధులను పక్కదారిపట్టించారని ఆరోపిస్తూ.. కంపెనీ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాల్సిందిగా యూఎస్ఎల్ డిమాండ్ చేయడం విదితమే. దీనిపై దర్యాప్తునకు కూడా ఆదేశించింది. అయితే, ఈ ఆరోపణలను తోసిపుచ్చిన మాల్యా, పదవినుంచి వైదొలిగేది లేదంటూ తేల్చిచెప్పారు కూడా. కాగా, ఈ ఉదంతం నేపథ్యంలో కంపెనీ ఖాతాలను తనిఖీ చేయడం కోసం ఐటీ, కార్పొరేట్ వ్యవహారాల శాఖలు యూఎస్ఎల్కు ఇప్పటికే నోటీసులు ఇచ్చాయి. మంగళవారం ఎన్ఎస్ఈలో యూబీఎల్ షేరు ధర 0.90 శాతం నష్టంతో రూ.1,016 వద్ద ముగిసింది. యూఎస్ఎల్ షేరు 1.87 శాతం ఎగబాకి రూ.3,500 వద్ద స్థిరపడింది.