
న్యూఢిల్లీ: ఉద్యోగుల్లో అజాగ్రత్త లేదా అవగాహనలేని వల్ల వ్యాపార సంస్థలకు సైబర్ భద్రతా దాడుల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఈవై నివేదిక తెలియజేసింది. ఇక కాలం చెల్లిన సెక్యూరిటీ నియంత్రణలు, అనధికారిక అందుబాటు అన్నవి ప్రమాదాలకు రెండో కారణమని పేర్కొంది. ఈ మేరకు ఈవై గ్లోబల్ అంతర్జాతీయ సమాచార భద్రతా సర్వే 2018–19 ఎడిషన్ విడుదలైంది. ఈ సర్వేలో 32 శాతం మంది అజాగ్రత్త, అవగాహన లేని ఉద్యోగుల రూపంలోనే తమకు అధిక రిస్క్ ఉన్నట్టు తెలిపారు.
21 శాతం మంది కాలం చెల్లిన నియంత్రణలు, 19 శాతం మంది అనధికారిక అనుసంధానత (క్లౌడ్ కంప్యూటింగ్, స్మార్ట్‌ఫోన్లు/ట్యాబెట్ల వినియోగం), 8 శాతం మంది సోషల్ మీడియా, 4 శాతం మంది ఇంటర్నెట్ ఆప్ థింగ్స్‌ను రిస్క్ కారకాలుగా చెప్పడం గమనార్హం. టెక్నాలజీ రంగంలో 87 శాతం, టెలికం రంగంలో 70 శాతం సంస్థలు అజాగ్రత్తతో ఉండే ఉద్యోగులు దాడులకు కేంద్రంగా పేర్కొన్నాయి. తమ సున్నితమైన సమాచారాన్ని, కస్టమర్ల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించే ప్రమాదం ఉంటుందని చెప్పడం గమనార్హం. 70 శాతం మంది సైబర్ సెక్యూరిటీపై తమ బడ్జెట్‌ను రానున్న సంవత్సరంలో పెంచుకుంటామని చెప్పాయి.