68 దిగువకు రూపాయి...
దాదాపు 9 నెలల కనిష్టానికి పతనం
న్యూఢిల్లీ: డాలర్‌తో రూపాయి మారకం శుక్రవారం 68 దిగువకు పడిపోయింది. అమెరికా రేట్ల పెంపు అంచనాలు, డాలర్ పరుగు కొనసాగుతుండటంతో రూపాయి 31 పైసలు క్షీణించి 68.13 వద్ద ముగిసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 29 తర్వాత ఇదే అత్యంత కనిష్ట స్థాయి. అంటే దాదాపు 9 నెలల కనిష్ట స్థాయికి రూపాయి క్షీణించింది. విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం కూడా ప్రతికూల ప్రభావం చూపిందని, కార్పొరేట్లు, దిగుమతిదారుల నుండి డిమాండ్ బాగా ఉందని ఫారెక్స్ డీలర్లు చెప్పారు. అమెరికా లేబర్ మార్కెట్ మెరుగుపడుతుండడం, పటిష్టమైన వృద్ధి కారణాల వల్ల త్వరలో వడ్డీరేట్లను పెంచనున్నట్లు అమెరికా ఫెడరల్ రిజర్వ్ జానెట్ ఎలెన్ వ్యాఖ్యానించడంతో అమెరికా డాలర్ 14 ఏళ్ల గరిష్ట స్థాయికి ఎగసింది. ఇక భారత స్టాక్ మార్కెట్లో శుక్రవారం విదేశీ ఇన్వెస్టర్లు రూ.926 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.
దేశీ ఫారెక్స్ మార్కెట్లో గురువారం నాటి ముగింపు(67.82)తో పోల్చితే డాలర్‌తో రూపాయి మారకం శుక్రవారం 68 వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో కొత్త కనిష్ట స్థాయి 68.19ను తాకింది. చివరకు 31 పైసలు (46 శాతం) నష్టంతో 68.13 వద్ద ముగిసింది. అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ విధానాలు వృద్ధిని పెంచేలా ఉంటాయని, దీంతో ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు పెరుగుతాయనే అంచనాలతో డాలర్ బలపడుతూ వస్తోంది.