చైనాతో వాణిజ్య వివాదాలు మళ్లీ తలెత్తనున్న అంచనాలతో శుక్రవారం అమెరికా స్టాక్ మార్కెట్లు అటూఇటుగా ముగిశాయి. డోజోన్స్ 9 పాయింట్లు(0.1 శాతం) క్షీణించి 24,465 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 7 పాయింట్లు(0.23 శాతం) బలపడి 2,955 వద్ద స్థిరపడింది. నాస్‌డాక్ మరికొంత అధికంగా 40 పాయింట్లు(0.4 శాతం) పుంజుకుని 9,325 వద్ద ముగిసింది. బ్లూచిప్స్ చెవ్రాన్ కార్ప్, కేటర్‌పిల్లర్ 2-1.4 శాతం మధ్య నీరసించడంతో డోజోన్స్ వెనకడుగు వేసింది. కాగా.. గత వారం డోజోన్స్ నికరంగా 3.3 శాతం జంప్‌చేసింది. ఏప్రిల్ 9 తదుపరి ఇది అత్యధిక లాభంకాగా.. ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్ 3.2 శాతం చొప్పున ఎగశాయి. చిన్న స్టాక్స్‌కు ప్రాతినిధ్యంవహించే రసెల్-2000 ఇండెక్స్ సైతం 7 శాతం పురోగమించింది. మార్కెట్ల జోరుకు ప్రధానంగా కోవిడ్-19 చికిత్సకు మోడార్నా ఇంక్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ పరీక్షలు తొలి దశలో సఫలమయ్యాయన్న వార్తలు కారణమైనట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దీనికితోడు పలు రాష్ట్రాలలో లాక్‌డవున్‌ను పాక్షికంగా ఎత్తివేయడంతో ఆర్థిక వ్యవస్థ రికవర్‌కానున్న అంచనాలు సైతం సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు తెలియజేశారు.
రిటైల్ జోష్
గత వారం ప్రధానంగా రిటైల్ దిగ్గజాలు బలపడ్డాయి. టీజేఎక్స్ 13 శాతం జంప్‌చేయగా.. గ్యాప్ ఇంక్ 8 శాతం ఎగసింది. ఈ బాటలో బ్యాంకింగ్ దిగ్గజాలు సిటీగ్రూప్, జేపీ మోర్గాన్ చేజ్, వెల్స్ ఫార్గో 3 శాతం పుంజుకున్నాయి. కరోనా వైరస్ కారణంగా ఓవైపు అమెరికా, చైనా మధ్య వివాదాలు రాజుకుంటున్నప్పటికీ.. మరోపక్క కోవిడ్-19కు వ్యాక్సిన్ ప్రయోగాలు క్లినికల్ పరీక్షలలో సఫలమవుతున్న వార్తలు ఇన్వెస్టర్లకు హుషారునిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. దీంతో శుక్రవారం మోడర్నా ఇంక్ షేరు 3 శాతం లాభపడింది. ఇతర కౌంటర్లలో అలీబాబా 6 శాతం పతనమైంది.
Comments
Please login to add a commentAdd a comment