వీడియోకాన్ విండోస్ 10 తొలి ఎల్‌ఈడీ టీవీ
* పీసీగానూ వినియోగానికి వీలు..
* 32 అంగుళాల టీవీ @ రూ.39,990
* 40 అంగుళాల టీవీ @ రూ.52,990
హైదరాబాద్: వీడియోకాన్ కంపెనీ- విండోస్ 10 ఓఎస్ ఆధారిత తొలి ఎల్‌ఈడీ టీవీని మార్కెట్లోకి తెచ్చింది. మైక్రోసాఫ్ట్ సంస్థ భాగస్వామ్యంతో ఈ టీవీని తెస్తున్నామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. పర్సనల్ కంప్యూటర్‌గా కూడా పనిచేసే ఈ తొలి హైబ్రిడ్ టీవీ విక్రయాలు వచ్చే నెల నుంచి ప్రారంభిస్తామని వీడియోకాన్ హెడ్(టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్) అక్షయ్ ధూత్ పేర్కొన్నారు.
విండోస్ 10 పై పనిచేసే తొలి టీవీ ఇదేనని తెలిపారు. బాగా అమ్ముడయ్యే 32, 40 అంగుళాల టీవీలనే మార్కెట్లోకి తెచ్చామని, 32 అంగుళాల టీవీ ధర రూ.39,990, 40 అంగుళాల టీవీ ధర రూ.52,990 అని వివరించారు. వినియోగదారుల స్పందనను బట్టి 24, 55, 65 అంగుళాల టీవీలను కూడా అందుబాటులోకి తెస్తామని చెప్పారు. మారుతున్న కాలంలో, వినియోగదారుల అవసరాలకనుగుణంగా ప్రపంచంలోనే ఈ తొలి హైబ్రిడ్ టీవీని అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.
ఈ టీవీలో ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 2జీబీ ర్యామ్, ఇన్‌బిల్ట్ వై-ఫై, 16 జీబీ మెమెరీ, 128 జీబీ ఎక్స్‌టర్నల్ మెమెరీ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. విండోస్ 10కు ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోందని వినీత్ దురాని చెప్పారు. ఈ వినూత్నమైన టీవీతో విండోస్ 10ను మరింత మందికి చేరువ చేస్తున్నామని పేర్కొన్నారు.