జైట్లీని కలిశాకే.. భారత్‌ వీడాను | Vijay Mallya Says He Met Finance Minister Before Leaving India | Sakshi
Sakshi News home page

జైట్లీని కలిశాకే.. భారత్‌ వీడాను

Published Wed, Sep 12 2018 8:22 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Vijay Mallya Says He Met Finance Minister Before Leaving India - Sakshi

అరుణ్‌ జైట్లీ, లండన్‌లో వెస్ట్‌ మినిస్టర్‌ మెజిస్ట్రేట్స్‌ కోర్టు నుంచి బయటికొస్తున్న విజయ్‌మాల్యా

లండన్‌: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పరారైన మద్యం వ్యాపారి విజయ్‌ మాల్యా వ్యవహారం రాజకీయ మలుపు తిరిగింది. భారత్‌ వదిలి వెళ్లేముందు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీని కలిశానని ఆయన బుధవారం లండన్‌లో వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించింది. మాల్యా వ్యాఖ్యలను జైట్లీ తోసిపుచ్చారు. అసలు తనని కలిసేందుకు మాల్యాకు ఎప్పుడూ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఇదే అదునుగా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండిపడ్డాయి. మాల్యా భారత్‌ వదిలి వెళ్లేలా ఎప్పుడు, ఎలా అనుమతి ఇచ్చారో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. జైట్లీని కలిశానని మాల్యా చేసిన వ్యాఖ్యలు షాకింగ్‌కు గురిచేస్తున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. మరోవైపు, మాల్యాను భారత్‌కు అప్పగించే కేసు విచారణను లండన్‌ కోర్టు ముగించింది. తీర్పును డిసెంబర్‌ 10న ప్రకటించనుంది.   

బలిపశువును చేశారు..
రూ. 9 వేల కోట్ల విలువైన బ్యాంకు రుణాల ఎగవేత, మోసం, మనీ లాండరింగ్‌ తదితర కేసుల్లో నిందితుడైన మాల్యాను తిరిగి అప్పగించాలని భారత్‌ వేసిన పిటిషన్‌ విచారణ లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో కొనసాగుతోంది. బుధవారం విచారణకు హాజరయ్యేందుకు కోర్టుకు వచ్చిన మాల్యా అక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ భారత్‌ వదిలి వెళ్లేముందు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కలిసినట్లు చెప్పారు. భారత్‌ విడిచి వెళ్లాలని ముందస్తుగా ఏమైనా సమాచారం వచ్చిందా? అని పాత్రికేయులు ప్రశ్నించగా..‘జెనీవాలో ఓ సమావేశానికి హాజరుకావాల్సి ఉన్నందున భారత్‌ వదిలి వచ్చాను.

అంతకుముందు, ఆర్థిక మంత్రిని కలిసి బ్యాంకు రుణాలు చెల్లించేందుకు సిద్ధమని చెప్పాను. రాజకీయ పార్టీలు నన్ను బలిపశువును చేశాయి. రుణాల చెల్లింపు కోసం కర్ణాటక హైకోర్టుకు సమగ్ర ప్రతిపాదనలు సమర్పించాను. రూ.15 వేల కోట్ల విలువైన ఆస్తులను కోర్టు ముందుంచాను’ అని బదులిచ్చారు. రుణాల చెల్లింపులో బ్యాంకులే సహకరించడం లేదని ఆరోపించారు. భారత్‌ పంపిన ముంబైలోని ఆర్థర్‌ రోడ్‌ జైలు వీడియో ‘చాలా బాగుంది’ అని సిగరెట్‌ తాగుతూ ఎగతాళి చేశారు.  

ఆ సాక్ష్యాలు నిరాధారం: భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ది క్రౌన్‌ ప్రాసిక్యూషన్‌ సర్వీస్‌  వాదిస్తూ.. మొదటి నుంచీ రుణాలు చెల్లించకూడదనే ఉద్దేశంతో మాల్యా ఉన్నారని, అందుకే తన కంపెనీ కింగ్‌ఫిషర్‌ ఆర్థిక ఫలితాలను ఏమార్చారని ఆరోపించింది. భారత్‌ సమర్పించిన సాక్ష్యాలు నిరాధారమని మాల్యా తరఫు లాయర్‌ కొట్టిపారేశారు.

బ్యాంకులతోనే మాట్లాడుకోమన్నా: జైట్లీ
మాల్యా వ్యాఖ్యల్లో ఏమాత్రం వాస్తవం లేదని జైట్లీ కొట్టిపారేశారు. 2014 నుంచి మాల్యాకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని, ఆయన తనని కలిసేందుకు అవకాశమే లేదని పేర్కొన్నారు. ‘ రాజ్యసభ సభ్యుడి హోదాలో ఓసారి మాల్యా పార్లమెంట్‌ ప్రాంగణంలో నా వెంట నడుస్తూ బ్యాంకు రుణాలు చెల్లించేందుకు ఆఫర్‌ చేస్తున్నట్లు చెప్పారు. ఆయన నకిలీ ఆఫర్ల గురించి ముందే విన్నా కాబట్టి, ఇక ఆయనతో సంభాషణను కొనసాగించడం ఇష్టం లేక ఆ విషయాన్ని బ్యాంకులతోనే మాట్లాడుకోవాలని సూచించా’ అని జైట్లీ వివరణ ఇచ్చారు. మాల్యా, జైట్లీ ఏం మాట్లాడుకున్నారో బహిర్గతం చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.

వెనక్కి తగ్గిన మాల్యా: జైట్లీ తన వ్యాఖ్యలను ఖండించిన తరువాత మాల్యా వెనక్కితగ్గారు. ఈ విషయాన్ని వివాదాస్పదం చేయడం సరికాదని అన్నారు. తాను జైట్లీతో అధికారికంగా సమావేశం కాలేదని, యాదృచ్ఛికంగా కలిశానని చెప్పారు. ‘భార త్‌లో మీడియా ఈ విషయాన్ని పెద్దదిగా చేయడం సరికాదు. లంచ్‌ విరామంలో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు నేను దేశం విడిచి రావడానికి దారితీసిన పరిస్థితులేంటో వివరించాను. లండన్‌ వెళ్తున్నానని మాత్రమే జైట్లీ తో చెప్పాను. అంతేకానీ ఆయనతో అధికారికంగా సమావేశం కాలేదు’ అని అన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement