విజయా బ్యాంకు లాభంలో 34 శాతం వృద్ధి
హైదరాబాద్: ప్రభుత్వ రంగ విజయా బ్యాంకు జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. బ్యాంకు లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చి చూస్తే 34% వృద్ధితో రూ.154.5 కోట్లుగా నమోదైంది. బ్యాంకు మొత్తం వ్యాపారం గతేడాది సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.2,10,312 కోట్లు ఉండగా, అది తాజాగా రూ.2,19,606 కోట్లకు వృద్ధి చెందినట్టు బ్యాంకు డిప్యూటీ జీఎం, హైదరాబాద్ రీజినల్ హెడ్ కె.సత్యనారాయణరాజు వెల్లడించారు. డిపాజిట్లు 3.65%, రుణాలు 5.51% పెరిగినట్టు చెప్పారు. హైదరాబాద్ రీజియన్ పరిధిలో డిపాజిట్లు రూ.3,854 కోట్లు, రుణాలు రూ.5,151 కోట్లుగా ఉన్నట్టు వెల్లడించారు. ప్రాధాన్య రుణాలు రూ.1,410 కోట్లుగా ఉన్నాయని పేర్కొన్నారు. విజయా బ్యాంకు ఏటీఎం ద్వారా చేసే ప్రతీ లావాదేవీపై 50 పైసలను కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద వినియోగించనున్నట్టు తెలిపారు.