
సాక్షి, న్యూఢిల్లీ : చౌక మొబైల్ చార్జీలకు కాలం చెల్లింది. ఈనెల 3 నుంచి కాల్ చార్జీలు భారీగా పెరగనున్నాయి. మొబైల్ కాల్స్, డేటా చార్జీలను మంగళవారం నుంచి పెంచనున్నట్టు టెలికాం ఆపరేటర్ వొడాఫోన్-ఐడియా ప్రకటించింది. ప్రీపెయిడ్ విభాగంలో రెండు రోజులు, 28, 84, 368 రోజుల వాలిడిటీతో కూడిన ప్లాన్‌లపై చార్జీలను పెంచనున్నట్టు కంపెనీ వెల్లడించింది. గత ప్లాన్‌లతో పోలిస్తే తాజా ప్లాన్‌లు దాదాపు 42 శాతం మేరకు భారమవుతాయని భావిస్తున్నారు.
ప్రీపెయిడ్ సేవలు, ప్రోడక్టులపై నూతన టారిఫ్‌లు, ప్లాన్‌లను ప్రకటించామని, డిసెంబర్ 3 నుంచి ఇవి అందుబాటులోకి వస్తాయని వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ ఓ ప్రకటనలో పేర్కొంది. డిసెంబర్ నుంచి మొబైల్ టారిఫ్‌లను పెంచుతామని భారత టెలికాం ఆపరేటర్లు గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. టెలికాం టారిఫ్‌ల సవరణపై ట్రాయ్ సంప్రదింపుల ప్రక్రియ నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా టారిఫ్ పెంపను ప్రకటించింది. మరోవైపు దేశంలో డిజిటల్ మళ్లింపు, డేటా వినియోగంపై ప్రతికూల ప్రభావం చూపని రీతిలో రానున్న వారాల్లో టారిఫ్‌లను పెంచుతామని రిలయన్స్ జియో ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక ఎయిర్‌టెల్ సైతం టారిఫ్‌ల పెంపునకు రంగం సిద్ధం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment