ఓల్టాస్ లాభం 54 శాతం అప్
న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌నకు చెందిన ఓల్టాస్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలానికి కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.158 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం రూ.103 కోట్లతో పోలిస్తే 54 శాతం వృద్ధి సాధించినట్లు ఓల్టాస్ తెలియజేసింది. అమ్మకాలు అధికంగా ఉండడం, ప్రాజెక్ట్ బిజినెస్ సెగ్మెంట్ మంచి పనితీరు కనబరచడంతో ఈ స్థాయి నికర లాభం ఆర్జించినట్లు తెలియజేసింది.
గత క్యూ1లో రూ.1,561 కోట్లుగా ఉన్న నికర అమ్మకాలు ఈ క్యూ1లో 18 శాతం వృద్ధితో రూ.1,845 కోట్లకు పెరిగాయి. ఎలక్ట్రో మెకానికల్ ప్రాజెక్ట్స్ అండ్ సర్వీసెస్ వ్యాపారం రూ.580 కోట్ల నుంచి 3 శాతం వృద్ధితో రూ.564 కోట్లకు పెరిగింది. ‘యూనిటరీ ప్రొడక్ట్స్ ఫర్ కంఫర్ట్ అండ్ కమర్షియల్ యూజ్’ వ్యాపార విభాగం ఆదాయం రూ.928 కోట్ల నుంచి 29 శాతం వృద్ధితో రూ.1,196 కోట్లకు పెరిగిందని కంపెనీ పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఓల్టాస్ షేర్ ధర 1.4 శాతం క్షీణించి రూ.365 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ ఏడాది గరిష్ట స్థాయి, రూ.376ను తాకింది.