
దేశీ ఈ–కామర్స్ రంగంలో రారాజుగా వెలగొందుతున్న ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు పూర్తిగా విదేశీ పరం అవుతోంది. ఇప్పటిదాకా అమెరికాకు చెందిన అమెజాన్‌తో పోటీపడిన ఫ్లిప్‌కార్ట్‌ను మరో అమెరికా కంపెనీ వాల్‌మార్ట్ చేజిక్కించుకోవడంతో ఇకపై భారత ఆల్‌లైన్ రిటైల్‌లో రంగం మొత్తం దాదాపుగా అమెరికన్ కంపెనీల చేతుల్లోనే ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. పోటీ కంపెనీలతోపాటు ఇటు ఆన్‌లైన్ వినియోగదారులపైనా ఈ మెగా డీల్ తీవ్ర ప్రభావం చూపనుందని పేర్కొంటున్నారు.
వణుకుతున్న చిన్న కంపెనీలు...
భారత్ ఆన్‌లైన్ మార్కెట్లోకి వాల్‌మార్ట్ మెగా ఎంట్రీతో తమ భవిష్యత్తుపై చిన్నాచితకా ఈ–కామర్స్ కంపెనీలు, అమ్మకందారులలో (సెల్లర్లు) తీవ్రమైన ఆందోళన నెలకొంది. అత్యంత చౌక ధరలతో చిన్న వ్యాపారాలను కకావికలం చేసిన చరిత్ర వాల్‌మార్ట్‌కు ఉండటమే వీరి భయాలకు ప్రధాన కారణం. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఇకపై వాల్‌మార్ట్ తన సొంత ఉత్పత్తులను (ప్రైవేట్ లేబుల్స్) భారత వినియోగదారులకు సరసమైన ధరలకు అందించే అవకాశం ఉంది.
ఇది ఒకరకంగా కొనుగోలుదారులకు మంచిదే అయినప్పటికీ... చిన్నస్థాయి పోటీ కంపెనీలు, సెల్లర్లకు మాత్రం ఆ పోటీని తట్టుకోవడం చాలా కష్టమేనన్నది విశ్లేషకుల భావన. ‘వాల్‌మార్ట్ గనక సొంత చౌక ఉత్పత్తులతో విరుచుకుపడితే దేశీ ఆన్‌లైన్ మార్కెట్లో పోటీ తారస్థాయికి చేరుతుంది. దీనివల్ల మన మార్కెట్లో చిన్న వ్యాపారాలు అతలాకుతలం అవుతాయి.
ఇప్పటివరకూ ఆన్‌లైన్ ద్వారా ఉత్పత్తులు విక్రయిస్తున్న సెల్లర్లు ఈ పోటీ తట్టుకోవడం చాలా కష్టం. తాజా పరిస్థితిని అధ్యయనం చేస్తున్నాం. చట్టపరమైన చర్యలతో పాటు ఇతరత్రా చర్యలూ చేపడతాం’ అని అఖిల భారత ఆన్‌లైన్ వెండార్స్ అసోసియేషన్ (ఏఐఓవీఏ) ప్రతినిధి పేర్కొన్నారు. ఈ సంఘంలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌తో సహా మొత్తం 3,500 మంది సెల్లర్లు ఉన్నారు.
వాల్‌మార్ట్‌కు మహదావకాశం...
భారత్ హోల్‌సేల్ రంగంలో దశాబ్దం క్రితమే అడుగుపెట్టిన వాల్‌మార్ట్‌కు ఇక్కడి మార్కెట్లో ఇప్పటిదాకా పెద్దగా పట్టుచిక్కలేదు. రిటైల్ రంగంలోకి భారత సర్కారు ద్వారాలు తెరచినప్పటికీ.. పలు సంక్లిష్టతల కారణంగా ముందుకెళ్లే పరిస్థితి లేదు. ఇక ఇప్పటికే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా మరిన్ని సంస్థలు వేళ్లూనుకుపోవడంతో ఈ–కామర్స్‌లో సొంతంగా అడుపెట్టే సాహసం చేయలేకపోయింది.
అయితే, ఇప్పుడు ఏకంగా హాట్‌కేక్ లాంటి అవకాశాన్ని చేజిక్కించుకుంది. మరో దశాబ్దకాలంలోపే భారత్ ఈ–కామర్స్ రంగం మార్కెట్ 200 బిలియన్ డాలర్ల స్థాయికి ఎగబాకనుందని అంచనా. ఇలాంటి తరుణంలో వాల్‌మార్ట్ ఇక్కడ నేరుగా అగ్రస్థానాన్ని చేజిక్కించుకోవడానికి ఈ డీల్ ఉపకరించనుంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారత ఈ–కామర్స్ మార్కెట్లో అపార అవకాశాలను దక్కించుకోవడానికి దోహదం చేస్తుంది.
ప్రస్తుతం దేశంలో 40 కోట్ల మందికిపైగా ఇంటర్నెట్ యూజర్లు ఉండగా.. ఇందులో 14 శాతమే షాపింగ్ కోసం ఆన్‌లైన్‌ను ఆశ్రయిస్తున్నారు. ఈ వాటా 2026 నాటికి 50 శాతానికి ఎగబాకవచ్చని అంచనా. తాజా డీల్‌తో వాల్‌మార్ట్‌కు 17.5 కోట్ల మంది యూజర్లు దక్కుతారు. ప్రస్తుతం 21 బెస్ట్‌ప్రైస్ హోల్‌సేల్ స్టోర్ల ద్వారా వాల్‌మార్ట్ భారత్‌లో అనేక ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఈ స్టోర్లను కూడా ఇకపై వాల్‌మార్ట్ తన డెలివరీ కేంద్రాలుగా వాడుకోవడానికి వీలవుతుంది.
వాల్‌మార్ట్ రంగ ప్రవేశంతో పోటీ సంస్థ అమెజాన్ కూడా వేగంగా పావులు కదుపుతోంది. మార్కెట్ వాటాను మరింత పెంచుకోవడం కోసం ఇక్కడ 5 బిలియన్ డాలర్లను వెచ్చించేందుకు ఇప్పటికే ప్రణాళికలను ప్రకటించిన అమెజాన్... తాజాగా మరో 2 బిలియన్ డాలర్లను కుమ్మరించేందుకు సిద్ధమవుతోంది. మొత్తంమీద ఈ రెండు దిగ్గజాల జోరుతో భారత్‌లో అటు కొత్తగా మౌలిక సదుపాయాల కల్పనతోపాటు వేలాది ఉద్యోగాలు కూడా రానుండటం మంచి పరిణామం కిందే లెక్క.
సచిన్ బన్సల్‌కు కనక వర్షం...
వాల్‌మార్ట్ డీల్‌తో ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ పంట పండనుంది. తనకున్న మొత్తం 5.5 శాతం వాటాను విక్రయించేందుకు సచిన్ ఓకే చెప్పడంతో దాదాపు రూ.5,100 కోట్లకుపైగా మొత్తం ఆయన జేబులోకి వచ్చిపడనుంది. అయితే, దీనిపై 20 శాతం మేర మూలధన లాభాల పన్నును కేంద్రానికి ఆయన చెల్లించాలివస్తుందని అంచనా.
అదేవిధంగా సాఫ్ట్‌బ్యాంక్ కూడా తన వాటా అమ్మకంపై వచ్చిన మొత్తంపై పన్ను కట్టాల్సి ఉంటుందని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు. అంటే ఈ డీల్‌తో కేంద్ర ఖజానాపైకూడా కనకవర్షం కురుస్తుందన్నమాట!!
ఇంకా నష్టాల్లోనే ఫ్లిప్‌కార్ట్...
ఒక చిన్న స్టార్టప్‌గా మొదలై ఆన్‌లైన్ వటవృక్షంగా ఎదిగిన ఫ్లిప్‌కార్ట్.. ఇప్పటివరకూ లాభాలను కళ్లజూసింది లేదు. ఎప్పటికప్పుడు కొత్తగా పెట్టుబడులను సమీకరిస్తూనే ఉంది. అయితే, ఇంత భారీగా నిధులొస్తున్నా.. కంపెనీ ఆర్థిక పనితీరులో ఇంకా పెద్దగా పురోగతిలేదు.
కన్సాలిడేటెడ్‌గా 2016–17లో రూ.19,855 కోట్ల ఆదాయాన్ని (గ్రాస్ మర్చెంటైజ్ వేల్యూ–జీఎంవీ) ఆర్జించింది. అయితే, స్థూల నష్టం రూ.8,895 కోట్లకు ఎగబాకింది. 2014–15లో రూ.2,985 కోట్లు, 2015–16లో రూ.5,467 కోట్ల స్థూల నష్టం నమోదైంది. కాగా, డెరివేటివ్స్ పెట్టుబడుల్లో అంచనా నష్టాలు (ఎం–టు–ఎం) తీసేస్తే స్థూల నష్టాలు దాదాపు 2015–16 స్థాయిలోనే ఉన్నట్లు లెక్క.
దేశీ స్టార్టప్‌ల విజయానికి ఇది ప్రతీక
ఇండియన్ ఎంట్రప్రెన్యూర్లకు సెల్యూట్ చేస్తున్నా. ఒక స్టార్టప్ 21 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌ను దక్కించుకోవడం చాలా గొప్ప విషయం. అలాగే వాల్‌మార్ట్... ఫ్లిప్‌కార్ట్‌లో 2 బిలియన్ డాలర్లు ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌ను ప్రకటించింది. భారత్‌లో ఇది అతిపెద్ద ఎఫ్‌డీఐ కాబోతోంది. – అసోచామ్ సెక్రటరీ జనరల్ డి.ఎస్.రావత్
కేవలం ఇన్వెస్టర్లు, ప్రమోటర్లకే ప్రయోజనం..
ఫ్లిప్‌కార్ట్– వాల్‌మార్ట్ డీల్ వల్ల ఈ–కామర్స్, రిటైల్ మార్కెట్‌పై ప్రభావం కచ్చితంగా ఉంటుంది. వాల్‌మార్ట్ దీర్ఘకాలంలో ఈ–కామర్స్ ద్వారా భారత్‌లో రిటైల్ వ్యాపారాన్ని నియంత్రిస్తుంది. డీల్‌తో వెంచర్ క్యాపిటలిస్ట్‌లు, ఇన్వెస్టర్లు, ప్రమోటర్లు మాత్రమే ప్రయోజనం పొందుతారు. దేశం కాదు. – అఖిల భారత వర్తకుల సమాఖ్య
దొడ్డిదారిలో ఎంట్రీ
అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్... ఫ్లిప్‌కార్ట్ కొనుగోలుతో దొడ్డిదారిలో భారత రిటైల్‌లోకి ప్రవేశిస్తోంది. ఈ–కామర్స్ మార్గంలో ప్రస్తుత నిబంధలను తప్పించుకోవాలని చూస్తోంది. ఇండియాలో మల్టీ బ్రాండ్ రిటైల్‌కు విదేశీ కంపెనీలకు అనుమతి లేదు. తాజా డీల్ వల్ల చిన్న వర్తకులకు ముప్పు వాటిల్లుతుంది. దేశ ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రధాని మోదీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. – స్వదేశీ జాగరణ్ మంచ్