ఇన్ఫీలో జాబ్ కావాలంటే ఈ రెండు ఉండాలి!
ఇన్ఫీలో జాబ్ కావాలంటే ఈ రెండు ఉండాలి!
Published Mon, Apr 24 2017 3:26 PM | Last Updated on Tue, Sep 5 2017 9:35 AM
ముంబై : మార్కెట్లో పెట్టుబడిదారి విధానం ఎలా ఉండాలి అంటే, కరుణ, దయా, జాలి గుణాలతో నిండి ఉండాలంటారు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి. ఇటీవల కంపెనీల్లో టాప్ స్థాయి వ్యక్తులకు చెల్లించే వేతనాలతో పోలిస్తే కింద స్థాయి ఉద్యోగులకు చెల్లించే వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేస్తూ మేనేజ్ మెంట్ ను కడిగిపారేశారు కూడా. కంపెనీలో కార్పొరేట్ గవర్నెర్స్ దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తంచేశారు. మానవ మర్యాదలకు ఆయన ఎంతో అంకితభావంతో ఉంటారు. అలాంటి వ్యక్తి కంపెనీలో పనిచేయాలని ప్రతి టెక్నాలజీ విద్యార్థి కోరుకుంటుంటారు. అయితే ఇన్ఫోసిస్ లో జాబ్ కావాలని కోరుకునే ఉద్యోగులు ఓ రెండు క్వాలిటీలను తప్పనిసరిగా కలిగి ఉండాలని నారాయణమూర్తి చెప్పారు.
'' ఇన్ఫోసిస్ లో ఉద్యోగం కావాలనుకునే వారికి తెలివి, విలువలు ఉండాలి. అంతకు మించి వారికి మరేది అవసరం లేదు'' అని మూర్తి పేర్కొన్నారు. అదేవిధంగా కార్పొరేట్ సమాజంలో నిర్ణయాలు తీసుకునే లీడర్లు పాటించవల్సిన నియమాలను కూడా ఆయన తెలిపారు. ''ఒకటి కార్పొరేట్ లీడర్లు తీసుకునే నిర్ణయం సమాజంలో మా కంపెనీకి గౌరవాన్ని పెంచుతుందా? అని ఆలోచించుకోవాలి. రెండోది ఉద్యోగుల నుంచి నాకు మంచి గౌరవం దక్కుతుందా? అని తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి'' అని సూచించారు. ఇలాంటి ప్రశ్నలు కార్పొరేట్ నిర్ణయాల్లో ప్రాథమికమైనవని, వీటితో సమాజం ఎంతో సంతోషంగా ఉంటుందని, ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని మూర్తి చెప్పారు. డార్డన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సత్కరించిన థామస్ జెఫర్సన్ ఫౌండేషన్ మెడల్ ఫంక్షన్ లో మూర్తి తన అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా పారదర్శకత, జవాబుదారీతనం, న్యాయమైన విలువలను మూర్తి హైలెట్ చేశారు.
Advertisement
Advertisement