![Infosys IT services providers is set to issue salary increment letters by the end of February 2025](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/infy0102.jpg.webp?itok=HKNZwjDq)
దేశంలోని ప్రముఖ ఐటీ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్(Infy) 2025 ఫిబ్రవరి చివరి నాటికి వేతన ఇంక్రిమెంట్ లెటర్లను జారీ చేయనున్నట్లు ప్రకటించింది. 2025 ఏప్రిల్ నుంచి కొత్త ఇంక్రిమెంట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. అయితే ఎంతశాతం వేతన పెంపు ఉంటుందో మాత్రం కంపెనీ తెలియజేయలేదు. కానీ, సగటు వేతన పెంపు 5% నుంచి 8% మధ్య ఉంటుందని ఉద్యోగులు భావిస్తున్నారు.
ఇన్ఫోసిస్ సంస్థలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి వేతన పెంపు ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుంది. దశలవారీ వేతన సవరణలు ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది. మొదటి దశను జనవరి 2025 నుంచి, రెండో దశను ఏప్రిల్ 2025 నుంచి పరిగణించనున్నారు. ఇంక్రిమెంట్లతోపాటు ఇన్ఫోసిస్ బ్యాచ్‌లవారీగా ప్రమోషన్ లెటర్స్ జారీ చేస్తున్నట్లు తెలిపింది. మొదటి బ్యాచ్ వారికి 2024 డిసెంబర్‌లో ప్రమోషన్స్ లెటర్స్ ఇచ్చినట్లు చెప్పింది. మరొక బ్యాచ్‌కు 2025 ఫిబ్రవరి చివరిలో లెటర్స్ పంపించబోతున్నట్లు పేర్కొంది.
ఇదీ చదవండి: మెహుల్ చోక్సీకి క్యాన్సర్ చికిత్స
వచ్చే ఆర్థిక సంవత్సరంలో సాంకేతిక సేవలు పొందే కంపెనీల టెక్నాలజీ మూలధన వ్యయం పెరుగుతుందని పలు ఐటీ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వేతనాల పెంపు నిర్ణయం తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే ఇన్ఫోసిస్ వేతన సవరణ చేస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో ఇన్ఫోసిస్ జీతాలు పెంచుతున్నట్లు తీసుకున్న నిర్ణయం ఉద్యోగులకు సానుకూల సంకేతం. అయితే, కంపెనీ ఇటీవల మైసూరు క్యాంపస్ నుంచి దాదాపు 700 మంది ఫ్రెషర్లను తొలగించడంపై విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ ఉద్యోగులకు ఆఫర్ లెటర్ ప్రకటించిన తర్వాత రెండేళ్లకు కొలువులోకి తీసుకున్నారు. కానీ ఆరు నెలల్లో వీరిని ఉద్యోగంలో నుంచి తొలగించారని వాదనలున్నాయి. ఈ వ్యవహారాన్ని ఐటీ ఉద్యోగుల సంఘం ఎన్ఐటీఈఎస్ అనైతిక చర్యగా అభివర్ణించింది.
Comments
Please login to add a commentAdd a comment