ద్రవ్యోల్బణానికి కళ్లెం వేశాం.. కానీ
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే ఆందోళనకర స్థాయిలో కొనసాగుతున్నద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. కానీ దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, వ్యవసాయ రంగం, దేశీ పెట్టుబడులు వంటి అంశాల నుంచి ఇంకా సవాళ్లు పొంచి ఉన్నాయన్నారు. గత ప్రభుత్వాలు అభివృద్ధి వ్యతిరేక విధానాలను అవలంబించాయని విమర్శించారు.
కేంద్రంలో మోదీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా జైట్లీ మరోసారి శనివారం విలేకరులతో సమావేశాన్ని నిర్వహించారు. గతం తో పోలిస్తే ప్రస్తుతం ద్రవ్యోల్బణ పరిస్థితులు ఆం దోళనకరంగా లేవన్నారు. ద్రవ్యోల్బణం దిగిరావటానికి అంతర్జాతీయ ముడి చమురు, కమోడిటీ ధరల తగ్గుదల వంటి అంశాలు బాగా దోహదపడ్డాయని తెలిపారు. దీనితోపాటు ద్రవ్యోల్బణ కట్టడికి ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలు కూడా టోకు ధరల ద్రవ్యోల్బణం, రిటైల్ ద్రవ్యోల్బణం దిగిరావటానికి ఉపకరించాయని పేర్కొన్నారు.
జన్ ధన్ యోజన్, జన్ సురక్ష, జీవన్ జ్యోతి వంటి ఆర్థిక స్వావలంబన, సామాజిక భద్రత పథకాలను ప్రవేశపెట్టడమనేది ప్రభుత్వ విజయమని అభివర్ణించారు. ప్రస్తుతం 15 కోట్ల మంది జన్ ధన్ యోజన్ ఖాతాలను, 7.5 కోట్ల మంది జీవిత, ప్రమాద బీమాను కలిగి ఉన్నారని తెలిపారు. దేశ జనాభాలో 11% మంది పెన్షన్ పాలసీదారులు ఉన్నారని, వీరి సంఖ్య అటల్ పెన్షన్ యోజనా పథకం ద్వారా మరింత పెరగనుందని పేర్కొన్నారు.