పెట్టుబడికి ఏది సరి?
నివాసమా.. వాణిజ్య సముదాయమా? దేన్లో అధిక రాబడి
సాక్షి, హైదరాబాద్: ఫ్లాటా? ప్లాటా? లేక వాణిజ్య సముదాయంలో స్థలమా? దేన్లో పెట్టుబడి భవిష్యత్తులో పెడితే ధర పెరుగుతుంది? నివసించడం కోసం ఇల్లు కొనేవారు కొందరైతే.. పెట్టుబడి కోణంలో ఆలోచించి అడుగు వేసేవారు మరికొందరు. అయితే మనలో చాలా మంది పెట్టుబడి అనే సరికి నివాస గృహాలపైనే దృష్టి సారిస్తారు. కానీ, వాస్తవానికి వాణిజ్య సముదాయాల్లోనే అధిక రాబడి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.అయితే విస్తీర్ణం తక్కువ గల స్థలంలో పెట్టుబడి చేయడానికి కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారని వారంటున్నారు.
⇔ ప్రాజెక్ట్ ఏదైనా అందుబాటులో ఉన్న ప్రాంతంలో నిర్మాణాల్ని చేపడితే కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తారు. అందుకే మాదాపూర్, కొండాపూర్, జూబ్లీహిల్స్, మదీనాగూడ, గచ్చిబౌలి, మణికొండ, నానక్‌రాంగూడ, కేపీహెచ్‌బీ కాలనీ వంటి ప్రాంతాల్లో నిర్మాణ సంస్థలు పెద్ద సంఖ్యలో వాణిజ్య సముదాయాల్ని నిర్మిస్తున్నాయి.
వాణిజ్యమే బెటర్..
పెట్టుబడి కోణంలో చూసేవారు మంచి రాబడిని అందుకోవడానికి రెండోసారి ఇల్లు కొనడం బదులు వాణిజ్య లేదా ఆఫీసు సముదాయాల్లో పెట్టుబడి పెట్టడమే మేలని నిపుణుల సూచన. మొదటిసారి ఇల్లు కొనేటప్పుడు లభించే పన్ను రాయితీలు రెండోసారి దొరకకపోవటమే ఇందుకు కారణం. గృహ రుణాలతో పోల్చితే వాణిజ్య సముదాయాల రుణాల వడ్డీ కూడా 2–4 శాతం దాకా అధికంగా ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి. నివాస సముదాయాలతో పోల్చితే వాణిజ్య సముదాయాల్లో నెలసరి అద్దె రెండు రెట్లు ఎక్కువగా గిట్టుబాటవుతుంది కూడా. అయితే నివాసంతో పోల్చితే వాణిజ్య భవనాల్లో కొనుగోలు ధర మాత్రం యాభై శాతం అధికంగా ఉంటుంది. ఉదాహరణకు నివాస సముదాయాల ధర చదరపు అడుగుకి రూ. 3,500 ఉందనుకోండి.. వాణిజ్య సముదాయాల్లో రూ. 5,250 దాకా పెట్టాల్సి ఉంటుంది.
⇔ అయితే ప్రమోటర్లే స్వయంగా నిర్వహించే వాణిజ్య సముదాయాలకు ప్రాధాన్యమివ్వాలి. ఏటా కొంత మొత్తాన్ని సేవా రుసుముగా తీసుకొని ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ సేవల్ని అందించే వాటిని ఎంచుకోవటం మేలు. వీటితో అందుబాటులో ఉన్న స్థలానికి తగ్గట్టుగా అద్దెదారుల్ని ఎంపిక చేయడం, వారు కోరుకున్న సైజుల్లో స్థలాన్ని సమకూర్చడం, దస్తావేజుల్ని సిద్ధం చేయడం, క్రమం తప్పకుండా అద్దెలను వసూలు చేయడం, ఆయా సొమ్మును పెట్టుబడిదారుడికి ఖాతాలో జమ చేయడం.. ఇలా ప్రతి అంశాన్ని ప్రాపర్టీ మేనేజర్లే దగ్గరుండి పర్యవేక్షిస్తారు. దీని వల్ల పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఫస్ట్ అయితే నివాసమే ఉత్తమం..
మొదటిసారి ఇల్లు కొనాలని భావించేవారెవరైనా సరే నివాస సముదాయాన్ని కొనుగోలు చేయడమే ఉత్తమం. ఆరంభంలో ఇరవై శాతం సొమ్ము కడితే చాలు 80 శాతం వరకూ బ్యాంకు నుంచి గృహæరుణం లభిస్తుంది. అంటే తక్కువ సొమ్ముతో సొంతింటి కల తీరుతుంది. అప్పు తీసుకున్న కొన్నాళ్లకే తీర్చక్కర్లేదు. ఇరవై, పాతికేళ్ల వరకూ నెలసరి వాయిదాల్ని కట్టే వెసులుబాటు ఉంటుంది. గృహరుణం తీసుకున్నాక.. చేతిలో సొమ్ము ఉన్నప్పుడల్లా.. విడతలవారీగా రుణాల్ని తిరిగి కట్టొచ్చు. వడ్డీ, అసలుపై ఆదాయ పన్ను రాయితీ లభిస్తుందని తెలిసిందే. అయితే ఆయా ప్రాజెక్ట్‌కు అనుమతులున్నాయా లేవా తెలుసుకోవాలి. అభివృద్ధి చెందే ప్రాంతంలో, టైటిల్ క్లియర్‌గా ఉండి, నిర్వహణ సక్రమంగా ఉన్న వాటి విలువనే పెరుగుతాయని మరవొద్దు.
స్థిరాస్తులకు సంబంధించి మీ సందేçహాలు మాకు రాయండి.realty@sakshi.com