గుర్గావ్ : పెద్ద నోట్ల రద్దు ప్రకటించి నేటికి ఏడాది. ఈ సందర్భంగా నోట్ల రద్దు సమయంలో జరిగిన పరిణామాలను ఒక్కొక్కరు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. కొంతమంది క్యూలైన్స్‌లో నిల్చోలేక పడ్డ కష్టాలను, మరికొంత మంది నోట్ల రద్దు వల్ల తమకు చేకూరిన ప్రయోజనాలను గుర్తు చేసుకుంటున్నారు. పెద్ద నోట్ల రద్దు కాలంలో రోజుల తరబడి క్యూలైన్‌ల్లో నిల్చున్నప్పటికీ చాలామందికి నగదు లభ్యం కాకనే నిరాశే ఎదురయ్యేది. ఇదే అనుభవం ఓ రిటైర్డ్ జవానుకు ఎదురైంది. పెన్షన్ కోసం మూడు రోజలు పాటు బ్యాంకుల చుట్టూ తిరిగినప్పటికీ, ఎలాంటి ప్రయోజనం దక్కకపోవడంతో బ్యాంకు వద్దే కన్నీటి పర్యంతమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో హిందూస్తాన్ టైమ్స్ ఫొటోగ్రాఫర్ తీసిన ఫొటో ట్విటర్‌లో ఆయన గురించి అందరికీ తెలిసేలా చేసింది. అంతేకాక అప్పటి వరకు ఎవరికీ తెలియని, ఎవరూ గుర్తించని ఆయనను ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆదరిస్తున్నారు. నోట్ల రద్దుతో ఆయన ఎంత ఫేమస్ అయ్యాడంటే.. ఏడాదిగా తాను సాగిస్తున్న జీవితం గురించి ఆ జవాను మాటల్లోనే వింటే అర్థమవుతోంది.
నంద్ లాల్ గుర్గావ్‌లోని భీమ్ నగర్లో అద్దె ఇంట్లో ఒంటరిగా జీవితం సాగిస్తున్న ఓ రిటైర్డు జవాను. 1971లో భారత్-పాకిస్తాన్‌కు మధ్య జరిగిన యుద్ధంలో నంద్ లాల్ ఆర్మీలో పనిచేశారు. విభజనాంతరం పాకిస్తాన్ నుంచి ఆయన గుర్గావ్‌కు నివాసం వచ్చారు. మూడు దశాబ్దాల క్రితమే నంద్ లాల్ భార్య మరణించారు. సొంత ఇల్లు ఉన్నప్పటికీ కూతురి పెళ్లి సమయంలో ఆ ఇంటిని అమ్మేయడంతో ప్రస్తుతం అద్దె ఇంట్లో నివసించాల్సి వచ్చింది. కూతురు తనతోనే ఉండమని కోరినప్పటికీ, ఒంటిరిగానే ఆయన తన జీవనం సాగిస్తున్నారు.
ఆర్మీలో పనిచేయడం వల్ల నంద్ లాల్‌కు నెలకు రూ.19,700 పెన్షన్, అదనంగా తన కూతురు మరో రూ.8000 పంపిస్తుంటుంది. పెద్ద నోట్ల రద్దు చేసిన సమయంలో తనకు వచ్చే పెన్షన్ కోసం గుర్గావ్‌లోని ఎస్‌బీఐ న్యూ కాలనీ బ్రాంచ్‌కు వెళ్లారు. మూడు రోజుల పాటు బ్యాంకు చుట్టూ తిరిగినప్పటికీ ఆయనకు ఎలాంటి పెన్షన్ లభించకపోయే సరికి, బ్యాంక్ వద్దే కన్నీంటిపర్యంతమయ్యారు. ఆ సమయంలో హిందూస్తాన్ టైమ్స్ ఫొటోగ్రాఫర్ తీసిన ఫొటోతో ఆయన గమనం మారిపోయింది. అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ ఆయనకు సహకరించడం, ముఖ్యంగా బ్యాంకు అధికారులు ఈ జవానుకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రస్తుతం తనకు ఎలాంటి సమస్య లేదంటున్నారు ఈ జవాను. గతేడాది డిసెంబర్ 14 వరకు ఎవరికి తెలియని తనను, పెద్ద నోట్ల పుణ్యమా అని ప్రతి ఒక్కరూ ఆదరిస్తున్నారంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment