ఇంటి దస్తావేజులు బ్యాంకులో పోతే? | What should we do if Property documents miss | Sakshi
Sakshi News home page

ఇంటి దస్తావేజులు బ్యాంకులో పోతే?

Published Mon, Apr 23 2018 1:53 AM | Last Updated on Mon, Apr 23 2018 1:53 AM

What should we do if Property documents miss - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో :  బ్యాంక్‌ రుణంతో ఇల్లు కొనడం తెలిసిందే. ఇంటి దస్తావేజులు తనఖాగా పెట్టి రుణం తీసుకోవటమూ సహజమే! కాకపోతే ప్రతినెలా క్రమం తప్పకుండా ఈఎంఐ కట్టేసి... చివరికి బ్యాంక్‌ నుంచి నో డ్యూ సర్టిఫికెట్‌ తీసుకుంటారు. అన్నీ చేశాక... తనఖా పెట్టిన ఇంటి దస్తావేజులు ఎక్కడో పోయాయని బ్యాంక్‌ చెబితే? బ్యాంక్‌ అధికారులతో గొడవ పెట్టుకుంటాం. లేకపోతే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లి సర్టిఫైడ్‌ సేల్‌ డీడ్‌ కాపీ కోసం దరఖాస్తు చేస్తాం.

కానీ, మహారాష్ట్రకు చెందిన ప్రదీప్‌ శెట్టి అలా చేయలేదు. 2004లో ప్రదీప్‌ మహారాష్ట్ర పరెల్‌లోని స్టాండర్డ్‌ చార్టెర్డ్‌ బ్యాంక్‌లో రూ.9 లక్షల గృహ రుణం తీసుకున్నాడు. ఈఎంఐలన్నీ కట్టేశాక, బ్యాంక్‌ నుంచి నో– డ్యూస్‌ సర్టిఫికెట్‌ కూడా పొందాడు. ఆ తర్వాత బ్యాంక్‌ అందించాల్సిన సేల్‌డీడ్‌ కాపీలను ఇవ్వకుండా అవెక్కడో మిస్సయ్యాయని చెప్పింది. దీంతో ప్రదీప్‌ ‘‘తనఖా పెట్టిన దస్తావేజులను బ్యాంక్‌ ఎక్కడో పోగొట్టింది.

ప్రాపర్టీ ధరలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో సేల్‌డీడ్‌ కాపీలు లేకపోవటంతో ఇంటిని విక్రయించలేకపోతున్నా. పైగా ఈ సంఘటనతో మానసిక వేదనకు గురయ్యా. విలువైన సమయం వృథా అయింది. అందుకు నాకు బ్యాంక్‌ నష్ట పరిహారాన్ని చెల్లించాలి’’ అంటూ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు.

నష్టపరిహారం సరిపోలేదు..
వివరాలన్నీ చూసిన మీదట ప్రదీప్‌కు బ్యాంకు రూ.60 వేల నష్ట పరిహారాన్ని చెల్లించాలని కమిషన్‌ తీర్పునిచ్చింది. ఇందులో రూ.50 వేలు దస్తావేజులు పోగొట్టినందుకు... రూ.5 వేలు మానసిక వేదనకు గురి చేసినందుకు... మరో రూ.5 వేలు ఫిర్యాదు దాఖలు ఖర్చులకు అని తెలియజేసింది.

అయితే ఈ పరిహారంతో సంతృప్తి చెందని ప్రదీప్‌ శెట్టి.. మహారాష్ట్రలోని రాష్ట్రస్థాయి వినియోగదారుల సమస్యల పరిష్కార కమిషన్‌ తలుపు తట్టాడు. దీంతో స్టేట్‌ ఫోరం.. నష్ట పరిహార మొత్తాన్ని రూ.60 వేల నుంచి రూ.1.15 లక్షలకు పెంచింది. పైగా 3 నెలల్లోపు కస్టమర్‌కు సర్టిఫైడ్‌ సేల్‌డీడ్‌ కాపీని అందించాలని.. లేని పక్షంలో ప్రతి నెలా రూ.50 వేల జరిమానాగా చెల్లించాలని తీర్పునిచ్చింది.

ఈ వినియోగదారుల సమస్యల పరిష్కార కమిషన్‌ ఇచ్చిన తీర్పు కేవలం ప్రదీప్‌ శెట్టికే కాదు. మనలో ఎవరి ప్రాపర్టీ దస్తావేజులైనా సరే బ్యాంక్‌లు పోగొడితే.. కస్టమర్‌కు నష్ట పరిహారంతో పాటూ తిరిగి సర్టిఫైడ్‌ సేల్‌ డీడ్‌ కాపీని కూడా అందించాల్సిన బాధ్యత బ్యాంక్‌లదే! ఇందుకోసం స్థానిక వినియోగదారుల ఫోరాన్ని సంప్రతిస్తే చాలు!

ఇంట్లో దాచిపెట్టుకున్న ప్రాపర్టీ దస్తావేజులు దొంగలు పడో లేక ఇతరత్రా కారణాల వల్లనో మిస్‌ అయితే..?
దస్తావేజులు పోయాయని కంగారు పడకండి. మళ్లీ సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసు నుంచి సర్టిఫైడ్‌ దస్తావేజులను పొందొచ్చు. కాకపోతే కొంత శ్రమించాల్సి ఉంటుంది.
 ముందుగా స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో సేల్‌ డీడ్‌ పోయిందని ఫిర్యాదు చేయాలి. ఆ తర్వాత దస్తావేజులు పోయినట్టుగా స్థానిక వార్తా పత్రికల్లో ప్రకటన ఇవ్వాలి. ఎవరికైనా దొరికితే సమాచారం అందించాలని కోరుతూ నోటీసు ఇవ్వాలి.
 గతంలో ఏదైతే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రాపర్టీని రిజిస్ట్రేషన్‌ చేయించారో మళ్లీ అదే కార్యాలయానికి వెళ్లి ఒరిజినల్‌ సేల్‌డీడ్‌ దస్తావేజులు పోయినట్లు సంబంధిత అధికారికి వివరించి సర్టిఫైడ్‌ కాపీని ఇవ్వాలని కోరుతూ స్వీయ దస్తూరితో లెటర్‌ రాసివ్వాలి.
 ఫామ్‌–22లో పేరు, చిరునామా వంటి వివరాలన్నీ నమోదు చే సి.. ప్రాపర్టీ జిరాక్స్‌ కాపీలను జత చేయాల్సి ఉంటుంది. అలాగే సంబంధిత ప్రాపర్టీ పేరు మీద ఉన్న ఆధార్, పాన్, రేషన్‌ కార్డ్, కరెంట్‌ బిల్లు వంటివి జత చేయాలి. వీటన్నింటికీ పోలీసు ఫిర్యాదు కాపీ, పత్రికా ప్రకటన జత చేసి సబ్‌ రిజిస్ట్రార్‌కు అందించాలి. నిర్ణీత ఫీజును చెల్లిస్తే సరిపోతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement