
టెలికం 'బాహుబలి' వస్తోంది..!
⇒ ఐడియా–వొడాఫోన్ విలీనానికి ఓకే
⇒ పూర్తిగా షేర్ల రూపంలో ఒప్పందం...
⇒ విలీనం కంపెనీలో వొడాఫోన్‌కు 45.1 శాతం వాటా
⇒ ఐడియాకు 26% వాటా... మిగిలింది ఇన్వెస్టర్ల చేతిలో
⇒ 43% మార్కెట్ వాటా.. 40 కోట్ల మంది కస్టమర్లు...
⇒ చైర్మన్ బాధ్యతలు కుమార మంగళం బిర్లా చేతికి
⇒ నియంత్రణ పగ్గాలు ఇరు గ్రూప్‌ల చేతిలో...
ముంబై: దేశంలో అతిపెద్ద టెలికం కంపెనీ ఆవిర్భావానికి లైన్‌క్లియర్ అయింది. బ్రిటిష్ టెలికం దిగ్గజం వొడాఫోన్ ఇండియా, ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన ఐడియా సెల్యులార్ విలీనం అవుతున్నట్లు సోమవారం ప్రకటించాయి. తమ డైరెక్టర్ల బోర్డులు ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేశాయని ఇరు గ్రూప్‌లు పేర్కొన్నాయి. దీంతో విలీనం ద్వారా ఏర్పాటయే కొత్త కంపెనీ అటు ఆదాయ మార్కెట్ వాటా, కస్టమర్ల సంఖ్య పరంగా దేశీయంగా అగ్రగామి టెల్కోగా అవతరించనుంది. పూర్తిగా షేర్ల రూపంలో కుదిరిన ఈ డీల్ రెండేళ్లలోపు పూర్తికావచ్చని భావిస్తున్నారు.
డీల్ స్వరూపం ఇదీ...
షేర్ల లావాదేవీ రూపంలో విలీనం ఉంటుంది. విలీనం ద్వారా ఏర్పడే కొత్త కంపెనీలో వొడాఫోన్ ఇండియా, దాని పూర్తిస్థాయి అనుబంధ సంస్థ వొడాఫోన్ మొబైల్ సర్వీసెస్‌లు కలిసిపోతాయి. ఐడియా సెల్యులార్ వొడాఫోన్‌కు కొత్తగా షేర్లను జారీ చేస్తుంది. తద్వారా వొడాఫోన్ ఇండియా ప్రత్యక్షంగా భారత్ కార్యకలాపాల నుంచి వైదొలగుతుంది. విలీనం తర్వాత ఆవిర్భవించే కంపెనీలో వొడాఫోన్‌కు 45.1 శాతం వాటా ఉంటుంది. ఆదిత్య బిర్లా గ్రూప్ వొడాఫోన్ ఇండియాకు చెందిన 4.9 శాతం వాటాను రూ.3,874 కోట్ల మొత్తానికి దక్కించుకోవడం ద్వారా కొత్త కంపెనీలో వొడాఫోన్ వాటా తగ్గనుంది. దీనిప్రకారం విలీన సంస్థలో ఐడియాకు 26 శాతం వాటా లభిస్తుంది. మిగతా వాటా ఇతర వాటాదారుల(పబ్లిక్) చేతిలో ఉంటుంది. కాగా, విలీన కంపెనీ నియంత్రణను వొడాఫోన్ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్‌లు సంయుక్తంగా చేపడతాయి. కొత్త కంపెనీకి చైర్మన్‌గా కుమార మంగళం బిర్లా వ్యవహరించనున్నారు.
వొడాఫోన్ తరఫున చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్‌ఓ) నామినీగా ఉంటారని వొడాఫోన్ గ్రూప్ సీఈఓ విటోరియో కొలావో... బిర్లా సమక్షంలో జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పారు. రానున్న కాలంలో విలీన సంస్థలో ఇరు గ్రూపుల వాటా సమాన స్థాయికి చేరుతుందని బిర్లా, కొలావో పేర్కొన్నారు. తద్వారా వొడాఫోన్ భారత్ నుంచి క్రమంగా వైదొలగుతుందన్న సంకేతాలిచ్చారు. కాగా, ఇండస్ టవర్స్‌లో వొడాఫోన్‌కు ఉన్న 42 శాతం వాటా ఈ విలీన ఒప్పందంలోకి రాదు. భారతీ ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్‌లు కలిపి ఇండస్ టవర్స్‌ను ఏర్పాటు చేశాయి.
బిర్లా గ్రూపునకు మరింత వాటా...
కొత్తగా ఆవిర్భవించే విలీన సంస్థలో మరింత వాటాను కొనుగోలు చేసే హక్కు ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు ఉంటుందని.. కొంతకాలానికి ఇరు గ్రూప్‌ల వాటా సమానమవుతుందని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఒప్పందంలో అంగీకరించిన ఈ యంత్రాంగం ప్రకారం.. నాలుగేళ్ల తర్వాత బిర్లా గ్రూప్ వాటాను పెంచుకోవడం మొదలుపెడుతుందని కొలావో చెప్పారు. అప్పటినుంచి ఐదేళ్ల వ్యవధిలో వొడాఫోన్ షేర్లను విక్రయిస్తుందన్నారు. షేరు ఒక్కంటికి రూ.130 చొప్పున 9.5 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు బిర్లా గ్రూపునకు అవకాశం ఉంటుంది. వాటా సమానమయ్యేవరకూ వొడాఫోన్‌కు ఉన్న అదనపు షేర్లకు సంబంధించి ఓటింగ్ హక్కులకు ఆస్కారం ఉండదు. ఇరు గ్రూప్‌లూ సంయుక్తంగానే ఓటింగ్ హక్కు లను కలిగిఉంటాయని ప్రకటన తెలిపింది. విలీనం ద్వారా నాలుగో ఏడాది నుంచి వార్షికంగా 2.1 బిలియన్ డాలర్లమేర వ్యయాలు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు.
విలీనం సాహసోపేత నిర్ణయం: సీఓఏఐ
వొడాఫోన్–ఐడియాల విలీనాన్ని సాహసోపేతమైన చర్యగా సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) అభివర్ణించింది. విలీనం ద్వారా ఆవిర్భవించే పటిష్ట కంపెనీ వల్ల అటు ప్రభుత్వానికి.. ఇటు దేశీ టెలికం మార్కెట్‌కూ ప్రయోజనం చేకూరుతుందని సీఓఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ వ్యాఖ్యానించారు. ‘ఇరు కంపెనీలూ చాలా సాహసంతో నిర్ణయం తీసుకున్నాయి. దేశంలో అత్యంత బలోపేతమైన టెల్కో ఆవిర్భవించడం వల్ల ప్రభుత్వానికి స్థిరమైన ఆదాయం లభిస్తుంది. అత్యున్నత స్థాయి టెలికం నెట్‌వర్క్ ఆసరాతో వినియోగదారులకూ మేలు చేకూరుతుంది. వ్యాపారాలకు సానుకూల పరిస్థితులు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఈ విలీనానికి సాధ్యమైనంత త్వరగా నియంత్రణపరమైన అనుమతులు లభిస్తాయని భావిస్తున్నాం’ అని మాథ్యూస్ పేర్కొన్నారు.
జియో దెబ్బతో...
దేశీ టెలికం రంగంలో రిలయన్స్ జియో సంచలన అరంగేట్రం తర్వాత విలీనాలు, కొనుగోళ్లు జోరందుకున్నాయి. మొట్టమొదటిగా రిలయన్స్ కమ్యూనికేషన్స్‌లో సిస్టెమా శ్యామ్, ఎయిర్‌సెల్‌ల విలీనంతో దీనికి తెరలేచింది. ఆర్వాత వొడాఫోన్–ఐడియా విలీనం తెరపైకి వచ్చింది. కాగా, భారతీ ఎయిర్‌టెల్ కూడా ఈ రేసులో తాను ఉన్నానంటూ ఇటీవలే నార్వే టెలికం సంస్థ టెలినార్ ఇండియాను విలీనం చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ విలీనం పూర్తయితే... ఎయిర్‌టెల్ టెలికం యూజర్ల సంఖ్య 30 కోట్ల మార్కును అధిగమిస్తుంది. అదేవిధంగా మార్కెట్ వాటా కూడా 35 శాతానికి చేరుతుంది.
అయినప్పటికీ.. వొడాఫోన్–ఐడియా విలీన సంస్థ తర్వాత రెండో స్థానానికే పరిమితం కావాల్సి వస్తుంది. కాగా, ఇటీవలే టాటా టెలీతో జపాన్ టెలికం దిగ్గజం ఎన్‌టీటీ డొకోమో దీర్ఘకాల వివాదానికి కోర్టు వెలుపల ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దీంతో టాటా టెలీ నుంచి డొకోమో వైదొలిగేందుకు మార్గం సుగమమైంది. మొత్తమ్మీద ఇప్పుడు భారత్‌కు దాదాపు విదేశీ టెలికం కంపెనీలన్నీ ఒక్కొక్కటిగా గుడ్‌బై చెప్పేస్తున్నట్లు కనబడుతోంది. కాగా, భారత్‌కు నాలుగైదు పెద్ద టెల్కోలు ఉంటే సరిపోతుందంటూ కేంద్ర ప్రభుత్వం కూడా తాజాగా విలీనాలకు అనుకూలంగా సంకేతాలివ్వడం గమనార్హం.
నంబర్ వన్ స్థానానికి...
⇔ ట్రాయ్ గణాంకాల ప్రకారం గతేడాది డిసెంబర్ నాటికి వొడాఫోన్‌కు ఇండియాలో 20.46 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. రెండో స్థానంలో ఉంది. మార్కెట్ వాటా 18.16 శాతంగా ఉంది.
⇔ ఇక ఐడియా సెల్యులార్ 16.9 శాతం మార్కెట్ వాటా, 19.05 కోట్లమంది యూజర్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది.
⇔ భారతీ ఎయిర్‌టెల్ కస్టమర్ల సంఖ్య 26.58 కోట్లు కాగా, ఆదాయంలో మార్కెట్ వాటా 33 శాతం. ఆదాయం, కస్టమర్ల సంఖ్య పరంగా ప్రస్తుతం ఎయిర్‌టెల్ నంబర్ వన్ ర్యాంకులో ఉంది.
⇔ అయితే, ఇప్పుడు ఐడియా–వొడాఫోన్ విలీనంతో కొత్తగా ఏర్పాటయ్యే సంస్థ ఎయిర్‌టెల్‌ను వెనక్కినెట్టేసి టాప్ ర్యాంకును చేజిక్కించుకోనుంది. ఈ విలీన సంస్థ మొత్తం యూజర్ల సంఖ్య దాదాపు 40 కోట్ల మందికి చేరనుంది. మొత్తం దేశీ టెలికం యూజర్ల సంఖ్యలో ఇది 40 శాతం.
⇔ బ్రోకరేజి సంస్థ సీఎల్‌ఎస్‌ఏ నివేదిక ప్రకారం.. విలీనం సంస్థ ఆదాయం రూ.80,000 కోట్లుగా ఉంటుంది. ఆదాయంపరంగా దేశీ టెలికం పరిశ్రమలో 43 శాతం మార్కెట్ వాటా దీని సొంతం అవుతుంది. దీంతో నంబర్ వన్ కంపెనీగా ఆవిర్భవిస్తుంది.
⇔ విలీనం ఒప్పందం ప్రకారం వొడాఫోన్ ఇండియా ఎంటర్‌ప్రైజ్ విలువ రూ.82,800 కోట్లు(12.4 బిలియన్ డాలర్లు)గా లెక్కతేలుతోంది. ఇక ఐడియా విలువ రూ.72,200 కోట్లు(10.8 బిలియన్ డాలర్లు)గా అంచనా వేసినట్లు ఐడియా సెల్యులార్ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలిపింది.
⇔ వొడాఫోన్ ఇండియా, ఐడియాలకు డిసెంబర్ 2016 నాటికి రూ.1.07 లక్షల కోట్ల రుణ భారం ఉంది.
⇔ విలీన సంస్థకు సంయుక్తంగా దేశంలో ఇప్పటిదాకా కేటాయించిన స్పెక్ట్రంలో 25 శాతానికిపైగా ఉంటుంది. అయితే, స్పెక్ట్రం పరిమితి నిబంధనల ప్రకారం దా దాపు 1 శాతం స్పెక్ట్రం(విలువ సుమారు రూ.5,400 కోట్లు)ను ఈ విలీన సంస్థ విక్రయించాల్సి ఉంటుంది.
⇔ విలీనం పూర్తయిన తర్వాత వొడాఫోన్ గ్రూప్ నికర రుణ భారం దాదాపు 8.2 బిలియన్ డాలర్ల మేర తగ్గుతుందని అంచనా.
విలీనం ద్వారా ఆవిర్భవించే కొత్త కంపెనీకి 10 బిలియన్ డాలర్ల మేర విలువ చేకూరుతుంది. వొడాఫోన్, ఆదిత్య బిర్లా గ్రూపుల నుంచి చెరో ముగ్గురు ప్రతినిధులు బోర్డులో ఉంటారు. ఇరు బ్రాండ్‌ల పటిష్టతల దృష్ట్యా విడివిడిగానే కొనసాగుతాయి. విలీన ప్రక్రియలో కొత్తగా పన్ను సంబంధ వివాదాలు తలెత్తే అవకాశం లేదు.
– విటోరియో కొలావో, వొడాఫోన్ గ్రూప్ సీఈఓ
ఈ విలీనం ఇరు గ్రూప్‌ల వాటాదారుల విలువ పెంచేందుకు దోహదం చేస్తుంది. డీల్‌లో భాగంగా వొడాఫోన్ నుంచి రూ.3,874 కోట్ల మొత్తానికి గాను 4.9 శాతం వాటాను ప్రమోటర్లు(ఆదిత్య బిర్లా గ్రూప్) కొనుగోలు చేస్తారు. ఐడియా దీనికి ఎలాంటి చెల్లిం పులూ చేయదు. అదేవిధంగా విలీనం తర్వాత ఐడియాలో ప్రమోటర్ల వాటాను తగ్గించుకునే ప్రసక్తే లేదు.
– కుమార మంగళం బిర్లా, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్