వాట్స్ యాప్ ఇక ఫేస్‌బుక్ | WhatsApp buyout to help Facebook expand presence in India | Sakshi
Sakshi News home page

వాట్స్ యాప్ ఇక ఫేస్‌బుక్

Published Fri, Feb 21 2014 2:13 AM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM

వాట్స్ యాప్ ఇక ఫేస్‌బుక్ - Sakshi

వాట్స్ యాప్ ఇక ఫేస్‌బుక్

 ఫేస్‌బుక్ చేతికి వాట్స్‌యాప్;
 డీల్ విలువ రూ. 1.18 లక్షల కోట్లు
 నగదు, షేర్ల రూపంలో చెల్లించేందుకు ఓకే...
 ఫేస్‌బుక్ చరిత్రలో అతిపెద్ద టేకోవర్...
 ఇన్‌స్టంట్ మెసేజింగ్‌లో వాట్స్‌యాప్ దూకుడు..
 ప్రపంచవ్యాప్తంగా యూజర్లు 45 కోట్ల మందికిపైనే

 
 న్యూయార్క్: ప్రపంచ సోషల్ నెట్‌వర్కింగ్ రారాజుగా వెలుగొందుతున్న ఫేస్‌బుక్... ప్రపంచమంతా నివ్వెరపోయే షాపింగ్ చేసింది. ఇన్‌స్టంట్ మెసేజింగ్ సర్వీసెస్‌లో విశేష ప్రాచుర్యం లోకి వచ్చిన వాట్స్‌యాప్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి ఎంతమొత్తం చెల్లిస్తోందో తెలుసా? ఏకంగా 19 బిలియన్ డాలర్లు. మన కరెన్సీలో ఈ మొత్తం అక్షరాలా రూ.1.18 లక్షల కోట్లు. ఫేస్‌బుక్ ప్రస్థానంలో అతిపెద్ద కొనుగోలు ఒప్పందంగా..శరవేగంగా వెలుగులోకి వచ్చిన ఇంటర్నెట్ టెక్నాలజీ స్టార్టప్‌ల టేకోవర్లకు సంబంధించి కొత్త అధ్యాయానికి ఈ డీల్  తెరతీసింది.
 
 ఒప్పందం స్వరూపం ఇదీ...
 
 ఈ భారీ కొనుగోలు ఒప్పందాన్ని ఫేస్‌బుక్ షేర్లు, నగదు రూపంలో పూర్తి చేయనుంది. 16 బిలియన్ డాలర్ల విలువైన ఫేస్‌బుక్ షేర్లను, మరో 3 బిలియన్ డాలర్ల నియంత్రిత స్టాక్ యూనిట్లను వాట్స్‌యాప్ యాజమాన్యానికి, సిబ్బందికి ఇవ్వనుంది. దీంతోపాటు 4 బిలియన్ డాలర్ల మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించనుంది. ఈ ప్రతిపాదిత డీల్‌తో ఫేస్‌బుక్, వాట్స్‌యాప్‌ల మధ్య మరింత అనుసంధానాన్ని తీసుకురావడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను మరింత సమర్ధంగా చౌకగా అందించేందుకు వీలవుతుందని ఫేస్‌బుక్ ఒక ప్రకటనలో పేర్కొంది. వాట్స్‌యాప్ స్వతంత్ర సంస్థగానే కొనసాగుతుందని   స్పష్టం చేసింది. ‘అనతికాలంలోనే వంద కోట్ల మంది ప్రజలను కనెక్ట్ చేయనున్న సాధనంగా యాట్స్‌యాప్ దూసు కెళ్తోంది. ఇంత గొప్ప మైలురాయిని చేరనుండం విలువపరంగా గొప్పవిషయం. వాట్సాయాప్ జాన్ కౌమ్(వ్యవస్థాపకుల్లో ఒకరు, ప్రస్తుత సీఈఓ) నాకు చాలా కాలంగా తెలుసు. ఆయన, ఆ సంస్థ బృందం భాగస్వామ్యంతో ప్రపంచాన్ని మరింత అనుసంధానం చేయడంలో మేం పాలుపంచుకోనుండం పట్ల నేను చాలా ఉద్విగ్నానికి లోనవువుతున్నా’ అని ఫేస్‌బుక్ సహ-వ్యవస్థాపకుడు, చైర్మన్-సీఈఓ మార్క్ జుకెర్‌బర్గ్ వ్యాఖ్యానించారు. కాగా, ఫేస్‌బుక్  డెరైక్టర్ల బోర్డులో కౌమ్‌కు చోటు దక్కనుంది. ‘ఫేస్‌బుక్‌తో కలసి ప్రయాణించడం ద్వారా వాట్స్‌యాప్‌ను మరింత విస్తరించే అవకాశం లభించనుంది. ఈ భాగస్వామ్యం ఇరు కంపెనీలకూ ఎంతో ప్రయోజనకరం’ అని కౌమ్ బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కొన్నారు.
 
 డీల్ రద్దయితే 2 బిలియన్ డాలర్ల చెల్లింపు...
 
 ఒక వేళ ఏదైనా నియంత్రణపరమైన అడ్డంకులు ఇతరత్రా సమస్యలతో ఈ ఒప్పందం రద్దయినా కూడా వాట్స్‌యాప్ యాజమానుల పంట పండినట్లే. ఇదే జరిగితే ఫేస్‌బుక్... వాట్స్‌యాప్‌కు బిలియన్ డాలర్ల నగదును, ఇంతే మొత్తానికి సమానమైన ఫేస్‌బుక్ షేర్లు కూడా లభించనున్నాయి. అంటే రెండు బిలియన్ డాలర్లు(దాదాపు రూ.12,500 కోట్లు) వాట్స్‌యాప్‌కు లభిస్తాయన్నమాట.
 
 అతిపెద్ద తాజా టెక్ డీల్స్‌లో కొన్ని...
 
     2011లో స్కైప్(వీడియో చాటింగ్)ను 8.5 బిలియన్ డాలర్లకు, గతేడాది నోకియాను 7.2 బి. డాలర్లకు మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది.
     గూగుల్‌కు చెందిన మోటరోలా మొబైల్ బిజినెస్‌ను గత నెలలోనే చైనా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం 2.9 బిలియన్ డాలర్లకు చేజిక్కించుకుంది.
 
 వాట్స్‌యాప్ సంగతిదీ...
 
     ఇన్‌స్టంట్ మెసేజింగ్ సేవలకు సంబంధించి ఇది ఒక అప్లికేషన్(యాప్). దీనిద్వారా మొబైల్ ఫోన్ వినియోగదారులు చాలా సులువుగా టెక్స్ట్, వాయిస్ మెసేజ్‌లతో పాటు వీడియోలు, ఫొటోలు ఏవైనా సరే షేర్ చేసుకునేందుకు ఈ యాప్ వీలుకల్పిస్తుంది.
     దీనికి టెలిఫోన్ ఆపరేటర్ల నుంచి ఎలాంటి చార్జీలు ఉండవు. స్మార్ట్, ఫీచర్ ఫోన్లు అన్నింటిలోనూ(గూగుల్ ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ ఓఎస్, యాపిల్ ఐఓఎస్; నోకియా ఆశా, విండోస్ ఫోన్ ఇతరత్రా) ఈ యాప్ ఫీచర్ లభిస్తోంది.
     ప్రపంచంలో ఏమూలనుంచైనా ఈ యాప్‌ను ఉపయోగించొచ్చు. కేవలం ఇంటర్నెట్ సదుపాయం ఫోన్/ట్యాబ్‌లో ఉంటే సరి. యూజర్ల మొబైల్ నంబర్ల ఆధారంగా అనుసంధానమవుతుంది.
     డౌన్‌లోడ్ చేసుకున్న తొలి ఏడాది పాటు ఈ యాప్‌ను ఉచితంగానే వాడుకోవచ్చు. ఆతర్వాత మాత్రం ఏడాదికి ఒక డాలరు(దాదాపు రూ.62) చొప్పున ఫీజు చెల్లించాలని వాట్స్‌యాప్ చెబుతోంది.
     ప్రసుత్తం ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల మందికి పైగా యూజర్లు ప్రతినెలా వాట్స్‌యాప్‌ను వినియోగిస్తున్నారు. రోజుకు 10 లక్షల మంది కొత్త యూజర్లు జతవుతున్నట్లు అంచనా.  అంతేకాదు వాట్స్‌యాప్ యూజర్లలో 70 శాతం మంది యాక్టివ్(రోజులో ఏదో ఒకసారి వినియోగం) కావడం విశేషం.
     రోజుకు 50 కోట్ల ఫొటోలు, 1,000 కోట్లకు పైగా మెసేజ్‌లు దీనిద్వారా షేర్ అవుతున్నట్లు అంచనా.
     2009లో అమెరికాకు చెందిన జాన్ కౌమ్, బ్రియాన్ యాక్టన్‌లు వాట్స్‌యాప్ ఇన్‌కార్పొరేటెడ్‌ను నెలకొల్పారు. వీళ్లిద్దరూ యాహూలో మాజీ ఉద్యోగులు కావడం గమనార్హం. ఫేస్‌బుక్, వాట్స్‌యాప్‌లు రెండూ అమెరికా కంపెనీలే.
 
 ఫేస్‌బుక్‌కు లాభమా.. నష్టమా..?
 
     సోషల్ నెట్‌వర్కింగ్‌లో దూసుకుపోతున్న ఫేస్‌బుక్.. ఇకపై మొబైల్ కమ్యూనికేషన్స్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడమే లక్ష్యంగా ఈ డీల్‌ను కుదుర్చుకుందని విశ్లేషకులు చెబుతున్నారు.
     ఫేస్‌బుక్ తన వెబ్‌సైట్లో ఇప్పటికే యాడ్‌ల రూపంలో ఆదాయాన్ని భారీగా పెంచుకోగలిగింది. ఇప్పుడు వాట్స్‌యాప్ ద్వారా సబ్‌స్క్రిప్షన్ ఆదాయం కూడా పెంచుకోవడానికి వీలవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.
     ఇప్పుడున్న దాదాపు 45 కోట్ల మంది వాట్స్‌యాప్ యూజర్లు పెయిడ్(ఏడాదికి డాలరు) యూజర్లుగా మారితే వార్షిక ఆదాయం రూ. రూ.3,000 కోట్లు(ప్రస్తుత భారత కరెన్సీ ప్రకారం) లభిస్తుంది. యూజర్ల సంఖ్య శరవేగంగా పెరుగుతుండటంతో ఈ మొత్తం కూడా ఎగబాకేందుకు వీలవుతుంది.
     వాట్స్‌యాప్‌ను ఉపయోగిస్తున్నవారిలో అత్యధికులు యువతే కావడం కూడా ఫేస్‌బుక్ భవిష్యత్ వృద్ధి ప్రణాళికలకు దోహదపడే అంశం.
     అయితే, ప్రపంచంలో ఇతరదేశాల్లో జోరుగా వినియోగంలో ఉన్న వాట్స్‌యాప్‌కు అమెరికాలో పెద్దగా ప్రాచుర్యం లేదు. దీంతో వాట్స్‌యాప్ డీల్‌కు ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించడంపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
     ఫోటో షేరింగ్ సేవలందించే ‘ఇన్‌స్టాగ్రామ్’ను ఫేస్‌బుక్ బిలియన్ డాలర్లు(దాదాపు రూ.6,200 కోట్లు) వెచ్చించి 2012లో సొంతం చేసుకుంది. దీనికే ఎక్కువ చెల్లించిందంటూ అప్పట్లో విమర్శలొచ్చాయి.
     వాట్స్‌యాప్ లాంటి సేవలందించే మరో ఇన్‌స్టెంగ్ మెసేజింగ్ యాప్ ‘స్నాప్ చాట్’ను కొనుగోలు చేయడానికి గతేడాది ఫేస్‌బుక్ ప్రయత్నం ఫలించలేదు. ఇందుకు 3 బిలియన్ డాలర్లను(రూ. 18,500 కోట్లు) ఆఫర్ చేసింది.
     స్వల్పకాలంలోనే వాట్స్‌యాప్ యూజర్ల సంఖ్య 100 కోట్ల మైలురాయిని అధిగమించనుందని... దీన్ని చేజిక్కించుకోవడం వల్ల మొబైల్ కమ్యూనికేషన్లలో ఫేస్‌బుక్‌కు రెండో ప్రత్నామ్నాయంగా ఉపయోగపడుతుందనేది ట్రా(గతంలో ట్రస్ట్ రీసెర్చ్ అడ్వైజరీ) సీఈఓ ఎన్. చంద్రమౌళి అభిప్రాయపడ్డారు. అన్నింటికంటే ముఖ్యంగా వాట్స్‌యాప్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు జాన్ కౌమ్ మేథోసంపత్తి కూడా ఫేస్‌బుక్‌కు ప్లస్ అనేది ఆయన విశ్లేషణ.
     2004లో ప్రారంభమైన ఫేస్‌బుక్... 2012లో పబ్లిక్ ఆఫర్ ద్వారా(16 బిలియన్ డాలర్లు) అమెరికా స్టాక్ మార్కెట్లో లిస్టయిన సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం దీని మార్కెట్ విలువ170 బిలియన్ డాలర్లు(రూ.10.5 లక్షల కోట్లు). వాట్స్‌యాప్ కోసం వినియోగిస్తున్న మొత్తం మార్కెట్ క్యాప్‌లో దాదాపు 9 శాతం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement