బంగారం ఎక్కువగా కొనేది వీరేనట!
బంగారానికి భారత్ లో ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. పట్టణ, గ్రామీణ ప్రాంతం వారు అనే తేడా లేకుండా బంగారం కొనుగోళ్లను భారీగా చేపడతారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్టు ప్రకారం 2017 తొలి క్వార్టర్ లో ప్రపంచవ్యాప్తంగా బంగారానికున్న డిమాండ్ కు, భారత్ గోల్డ్ డిమాండే మద్దతిచ్చిందని తెలిసింది. భారతీయుల బంగార ఆభరణాల కొనుగోళ్లు ప్రపంచ జువెల్లరీ డిమాండ్ లో ఐదవ స్థానంలో ఉన్నట్టు తేలింది. 2017 తొలి త్రైమాసికంలో భారత్ లో బంగారు జువెల్లరీ డిమాండ్ 92.3 టన్నులు కాగ, అమెరికాలో ఈ డిమాండ్ 22.9 టన్నులుగానే ఉంది. బంగారంలో పెట్టుబడులు కూడా భారీగానే పెరుగుతున్నాయి. కానీ ఏ రాష్ట్రంలో బంగారాన్ని ఎక్కువగా కొనుగోలుచేస్తున్నారో తెలుసుకోవాలని ఉందా? అక్షరాస్యతలో అన్ని రాష్ట్రాల కంటే ఎంతో ముందున్న కేరళ, బంగారం కొనుగోళ్లలోనూ ముందంజలో ఉందట. నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీసు డేటా ఆధారంగా నెలవారీ తలసరి వ్యయంలో బంగారు ఆభరణాలపై కేరళ ఎక్కువగా వెచ్చిస్తుందని తేలింది.
2011-12లో వివిధ రాష్ట్రాలు వస్తువులు, సర్వీసులపై ఏ మేరకు గృహ వినియోగం చేపడుతున్నారో తెలుసుకునేందుకు ఈ సర్వే చేపట్టారు. కేవలం రాష్ట్రాల ఆధారితంగానే ఈ డేటాను రూపొందించారు. రూరల్ కేరళ కేవలం బంగారం కొనుగోళ్లపై ఎక్కువగా వెచ్చించడమే కాకుండా.. తలసరి వ్యయాన్ని కూడా ఆరు రెట్లు పెంచుకుంది. ఈ ర్యాంకింగ్స్ లో గోవా రెండో స్థానంలో నిలిచింది. నేషనల్ శాంపుల్ సర్వే నివేదించిన ఆరు రాష్ట్రాల డేటాలో కూడా కేరళ చాలా ఎక్కువగా బంగారం కొనుగోళ్లను చేపట్టింది.
అర్బన్ ఇండియాలో మాత్రమే ఎక్కువగా బంగారు ఆభరణాలు కొనుగోళ్లు చేపడుతున్నారనే డేటాలకు విభిన్నంగా కేరళలో బంగారు కొనుగోళ్లు జరుగుతున్నాయి. పట్టణ ప్రాంతాల వారి కంటే కూడా ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల వారే కేరళలో బంగారు ఆభరణాలు కొనుగోళ్లు చేపడుతున్నారు. మిగతా రాష్ట్రాల్లో మాత్రం అర్బన్ ప్రాంతం వారు ఎక్కువగా ఈ కొనుగోళ్లు చేశారు. ఈ నేపథ్యంలో బంగారంపై జీఎస్టీ రేటు తక్కువగా ఉండాలని కేరళ ముఖ్యమంత్రి కోరడంలో ఎలాంటి ఆశ్చర్యం అవసరం లేదని పలువురంటున్నారు. బంగారంపై ఇంకా జీఎస్టీ రేటును నిర్ణయించలేదు. అయితే బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో తక్కువ తలసరి బంగారం వినియోగం నమోదైంది.