న్యూఢిల్లీ: రాయితీలు బకాయిపడిందంటూ భారత్‌కు వ్యతిరేకంగా జపాన్ ఆటోమొబైల్ కంపెనీ నిస్సాన్ తాజాగా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించింది. ప్లాంటు పెడితే ఇస్తామన్న ప్రోత్సాహకాలు, పరిహారాలు, వడ్డీ వ్యయాలూ అన్నీ కలిపి దాదాపు రూ.5,000 కోట్ల మేర బకాయి ఉండిపోయాయని, వీటిని తక్షణం చెల్లించేలా చూడాలంటే వివాద పరిష్కారం కోసం కంపెనీ ఆర్బిట్రేషన్ చర్యలు ప్రారంభించినట్లు తెలిసింది.
ఈ బకాయిలపై కంపెనీ గతేడాదే ప్రధాని నరేంద్ర మోదీకి లీగల్ నోటీసు కూడా పంపింది. కంపెనీ వర్గాలు ఈ అంశాలను ఖండించకపోవడం ఆర్బిట్రేషన్ చర్యల వార్తలకు ఊతమిచ్చినట్లయింది. వివరాల్లోకి వెడితే.. తమిళనాడులో ఏర్పాటు చేసిన తయారీ ప్లాంటుపై నిస్సాన్ ఇప్పటిదాకా దాదాపు రూ.6,100 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఈ ప్లాంటుకి ఏటా 4.8 లక్షల కార్ల తయారీ సామర్థ్యం ఉంది. ప్లాంటు ఏర్పాటు కోసం అప్పట్లో తమిళనాడు ప్రభుత్వం నిస్సాన్‌కి పలు ప్రోత్సాహకాలతో పాటు పన్నులపరమైన రాయితీలు కూడా కల్పిస్తామంటూ హామీ ఇచ్చింది. అయితే, 2015లో అందజేయాల్సిన రాయితీలను తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికీ చెల్లించలేదు. దీంతో నిస్సాన్ ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లింది.
సమస్య పరిష్కారానికే మొగ్గు..: తమిళనాడు ప్రభుత్వం బకాయిపడిన రాయితీల చెల్లింపు వివాద పరిష్కారం కోసం భారత ప్రభుత్వంతో కలసి పనిచేస్తామని నిస్సాన్ పేర్కొంది. ప్రతిష్టాత్మక మేకిన్ ఇండియా కార్యక్రమంలో తాము కూడా భాగస్వాములుగా ఉన్నామని.. భారత్‌లో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 40,000 పైగా ఉద్యోగాల కల్పన చేశామని సంస్థ ప్రతినిధి తెలిపారు. దాదాపు బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులతో తమిళనాడు ఆర్థిక వృద్ధికి కూడా తోడ్పాటు అందించామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment