
100 కోట్ల పెట్టుబడులతో వీసీలు రెడీ: విన్ విజన్
హైదరాబాద్‌లో విన్ విజన్ ఐ కేర్ ఆసుపత్రి ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విన్ విజన్ పేరుతో నగరంలో మరో కంటి ఆసుపత్రి ప్రారంభమైంది. మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జే రామేశ్వర్ రావు మంగళవారమిక్కడ ఆసుపత్రి లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి జాయింట్ డెరైక్టర్ ఎన్‌వీ రత్నం చౌదరి మాట్లాడుతూ.. రూ.12.5 కోట్ల పెట్టుబడులతో 12 వేల చ.అ.ల్లో పర్యాటక భవనం సమీపంలో విన్ విజన్ కంటి ఆసుపత్రిని ప్రారంభించామని చెప్పారు.
ఇందులో 80 శాతం నిధులను పరికరాల కోసం, మిగతా వాటిని ఆసుపత్రి ఇంటీరియర్ కోసం వినియోగించామని పేర్కొన్నారు. విన్ విజన్‌లో కాటరాక్ట్, లాసిక్, రెటీనా, గ్లుకోమా, పీడియాట్రిక్ ఆప్తమాలజీ, అకులోప్లాస్టీ తదితర సేవలన్నీ అందుబాటు ధరల్లోనే ఉంటాయని పేర్కొన్నారు. ఐదేళ్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటుగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు 20 సెంటర్లలో విన్ విజన్ ఆసుపత్రులను ప్రారంభిస్తామని చెప్పారు.
ఇందుకు గాను రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలువురు వెంచర్ కేపిటలిస్ట్‌లు (వీసీలు), బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. నాలుగు రాష్ట్రాల్లో నాలుగు ప్రధాన సెంటర్లుంటాయని.. మిగతా వాటిలో క్లినిక్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కో ప్రధాన సెంటర్‌లో రూ.12.5 కోట్లు, క్లినిక్స్‌లో రూ.4 కోట్ల పెట్టుబడులు పెడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విన్ విజన్ ఐ కేర్ చైర్మన్ డాక్టర్ సతీష్ గుప్తా, ఎండీ డాక్టర్ శ్రీలక్ష్మి నిమ్మగడ్డ తదితరులు పాల్గొన్నారు.