యూపీలోని అయోధ్యలో జనవరి 22న నూతన రామాలయంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరగనుంది. సరిగ్గా అదే సమయానికి మధ్యప్రదేశ్ ఆర్థిక రాజధాని ఇండోర్‌లో స్థానికులు 1.11 కోట్ల దీపాలను వెలిగించనున్నారు.
రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ జరగనున్న సందర్భంగా స్థానికంగా నిర్వహించబోయే కార్యక్రమాల గురించి రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కైలాష్ విజయవర్గీయ విలేకరులకు తెలియజేశారు. అయోధ్య రామాలయంలో శ్రీరాముని ప్రతిష్ఠాపన సందర్భంగా జనవరి 22న ఇండోర్‌లో 1.11 కోట్ల దీపాలు వెలిగించనున్నామన్నారు. ప్రజాప్రతినిధులతోపాటు సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారన్నారు.
అయోధ్యలో ఉత్సవాల సందర్భంగా ఇండోర్ నగరంలోని 31 వేల మంది పాఠశాలల విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించి, గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఈ ఘనత నమోదు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. రామునితో పాటు అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయం ఇతివృత్తం ఆధారంగా ఈ పెయింటింగ్ పోటీ ఉంటుందని తెలిపారు. ఇదిలావుండగా అయోధ్యలోని నూతన రామాలయ ప్రాంగణాన్ని అలంకరించేందుకు భోపాల్ నుంచి ప్రత్యేక రకాల పూలను తరలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment