పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. సోమవారం రాత్రి కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎన్నికల నిర్వహణపై ఆయన మాట్లాడారు. ఇప్పటికే కమిషనరేట్ పరిధిలో రూ.1.23 కోట్ల విలువైన విదేశీ, దేశీయ మద్యం, బెల్లం, గంజాయిని సీజ్ చేసినట్లు తెలిపారు.
ఎన్నికల నిబంధనల ప్రకారం.. నిషేధితాలను, అనుమానం ఉన్న అన్నింటినీ సీజ్ చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు రూ.50 వేలకు మించి వెంట ఉంచుకోరాదని, నగదును దగ్గర ఉంచుకుంటే దానికి సంబంధించి తగిన ఆధారాలు కలిగి ఉండాలని లేదంటే డబ్బులను ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు సీజ్ చేస్తారని తెలిపారు.
10 డైనమిక్ చెక్‌పోస్ట్‌లు..
ఎన్నికల సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించి కమిషనరేట్ పరిధిలో 10 డైనమిక్ చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. ఈ చెక్‌పోస్ట్‌లు ప్రతిరోజూ ఒక చోటి నుంచి మరో చోటికి మారుతాయని, దీని వల్ల మద్యం డబ్బులతో పాటు ఇతర వస్తువులు సరఫరా చేసే వ్యక్తులను సులభంగా పట్టుకోవచ్చని పేర్కొన్నారు.
ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేలా వివిధ పార్టీల నేతలు నిబంధనలకు విరుద్ధంగా పంపిణీ చేస్తే ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు సీజ్ చేస్తాయన్నారు. ఎన్నికల నిర్వహణ బందోబస్తు కోసం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు ప్రత్యేకంగా 6 పారామిలటరీ కంపెనీలు వస్తున్నాయని పేర్కొన్నారు.
వాహనాలకు జీపీఎస్, కెమెరాలు
డబ్బు, మద్యం, ఇతరత్రా నజరానాలతో ఓటర్లను ప్రభావితం చేయకుండా నియంత్రించడానికి ఏడు ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈబృందాల్లో పోలీస్ అధికారి నోడల్ ఆఫీసర్‌గా ఉంటారని పేర్కొన్నారు.
పోలీసు వాహనాలకు జీపీఎస్ అనుసంధానం చేయడంతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ వాహనాలకు కెమెరాలు కూడా అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఫిర్యాదులు, సమాచారాన్ని 1950 నంబర్ ద్వారా తెలియజేయాలని కోరారు. తుపాకీ లైసెన్స్ కలిగిన వ్యక్తులు వాటిని పోలీస్‌స్టేషన్‌లో డిపాజిట్ చేసేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
మావోయిస్టులపై నిఘా..
ప్రస్తుతం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మావోయిస్టుల ప్రాబల్యం లేనప్పటికీ నిఘా మాత్రం కొనసాగుతోందని సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి పథకాలు అందాయని, గతంతో పోలిస్తే ప్రస్తుతం మావోయిస్టుల ఉనికి లేదని పేర్కొన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా పోలీస్ నిఘా కొనసాగుతుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment