
న్యూఢిల్లీ: బోనస్ ఇష్యూ ప్రతిపాదనకు, అధీకృత మూలధనం పెంపునకు మెజారిటీ వాటాదారులు ఆమోదం తెలిపినట్టు విప్రో తెలిపింది. వాటాదారుల వద్దనున్న ప్రతి మూడు షేర్లకు (ముఖ విలువ రూ.2) ఒక షేరును బోనస్‌గా ఇవ్వడానికి విప్రో బోర్డు జనవరిలో నిర్ణయించిన విషయం గమనార్హం. ఫిబ్రవరి 22 గడువు నాటికి అవసరమైన మెజారిటీ వాటాదారులు బోర్డు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్టు విప్రో స్టాక్ ఎక్సే్చంజ్‌లకు సమాచారం ఇచ్చింది.
అధీకృత మూలధనం పెంపునకు 98.82 శాతం, బోనస్ షేర్ల జారీకి 99.81 శాతం మంది వాటాదారుల ఆమోదం లభించినట్టు వెల్లడించింది. బోనస్ షేర్ల జారీ ద్వారా కంపెనీ అధీకృత మూలధనం రూ.1,126.50 కోట్ల నుంచి రూ.2,526.50 కోట్లకు పెరగనుంది.