తక్కువ వ్యయాల తో స్పైస్‌జెట్ కు లాభాలు
న్యూఢిల్లీ : స్పైస్‌జెట్ విమానయాన సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలానికి రూ.72 కోట్ల నికర లాభం సాధించింది. సీట్ల అక్యుపెన్సీ అధికంగా ఉండడం, వ్యయాలు 42 శాతం తగ్గడం వల్ల ఈ స్థాయిలో లాభాలు సాధించామని స్పైస్‌జెట్ తెలిపింది. ఇంకా అధికంగా లాభాలు వచ్చేవని, అయితే ఎయిర్‌బస్ విమానాలను వెట్-లీజ్‌కు తీసుకున్నందున లాభం తగ్గిందని కంపెనీ చీప్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కిరణ్ కోటేశ్వర్ చెప్పారు. సంప్రదాయ లీజ్‌లతో పోల్చితే ఈ వెట్-లీజ్ ఖరీదైనదని, రూపాయి బలహీనపడడం వల్ల కూడా నికర లాభం తగ్గిందని వివరించారు.
గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు రూ.124 కోట్ల నష్టాలు వచ్చాయని పేర్కొన్నారు. వరుసగా ఏడు క్వార్టర్ల నష్టాలకు అడ్డుకట్ట వేస్తూ గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.22 కోట్ల నికర లాభం ఆర్జించామని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో కూడా లాభాల బాట పట్టడంతో వరుసగా రెండు క్వార్టర్లలోనూ లాభాలు సాధించామని వివరించారు. అయితే అమ్మకాలు మాత్రం 34 శాతం క్షీణించి రూ.1,106 కోట్లకు తగ్గాయని పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడినట్లేనని వ్యాఖ్యానించారు.