పసిడి పెట్టుబడికి... పంచ సూత్రాలు | With schemes Impressive jewelery companies | Sakshi
Sakshi News home page

పసిడి పెట్టుబడికి... పంచ సూత్రాలు

Published Mon, Jul 13 2015 12:50 AM | Last Updated on Sun, Sep 3 2017 5:23 AM

పసిడి పెట్టుబడికి... పంచ సూత్రాలు

పసిడి పెట్టుబడికి... పంచ సూత్రాలు

- రాబడి ప్రకారం చూస్తే ఈ-గోల్డ్ ఉత్తమం
- అందుబాటులో గోల్డ్ ఈటీఎఫ్‌లు, ఫండ్లు
- పథకాలతో ఆకట్టుకుంటున్న జ్యుయలరీ సంస్థలు

ప్రపంచంలో ఉత్పత్తయ్యే మొత్తం బంగారంలో దాదాపు 27 శాతాన్ని మనదేశం దిగుమతి చేసుకుంటోందంటేనే... ఇక్కడ బంగారానికున్న డిమాండు అర్థమవుతుంది. భారతీయులకు ముఖ్యంగా మహిళలకు బంగారంపై మక్కువ ఎక్కువ. అయితే ఇన్వెస్ట్‌మెంట్ సాధనంగా కూడా బంగారానిది రికార్డే. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఇతర ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలతో పోలిస్తే బంగారం మంచి రాబడినే ఇచ్చింది. అందుకే ప్రతి ఇన్వెస్టరు పోర్ట్‌ఫోలియోలో బంగారం కచ్చితంగా ఉంటుంది. ఉండాలి కూడా. బంగారంలో భౌతికంగా నాణేలు, కడ్డీలు, ఆభరణాల రూపంలోనూ, గోల్డ్ ఈటీఎఫ్ వంటి ఎలక్ట్రానిక్ రూపంలోనూ ఇన్వెస్ట్ చేయొచ్చు. అవేంటో ఒకసారి చూద్దాం...
 
గోల్డ్ సేవింగ్ పథకాలు
పలు జ్యుయలరీ సంస్థలు రెండు రకాల గోల్డ్ సేవింగ్ పథకాలను అందిస్తున్నాయి. తొలి రకం పథకంలో ప్రతి నెలా నిర్ణీత మొత్తం, నిర్ణీత కాలం వరకు చెల్లించాలి. జ్యుయలరీ సంస్థలు పథకం కాల పరిమితి ముగిసిన తర్వాత ఒక నెల మొత్తాన్ని బోనస్‌గా ఇస్తాయి. వాయిదాలు సక్రమంగా చెల్లించినవారికే కొన్ని సంస్థలు ఈ బోనస్‌ను ఇస్తున్నాయి. ఉదాహరణకు ఒక సంస్థ 11 నెలల కాలపరిమితితో ఈ పథకాన్ని అందిస్తోందని అనుకుంటే... మీరు చెల్లించే వాయిదా  రూ.2,000 అయితే మీరు మీ పథకం కాలపరిమితిలోపు సంస్థకు రూ.22,000 చెల్లిస్తారు. దీనికి సదరు సంస్థ మరో రూ.2,000 అదనంగా అందిస్తుంది. అప్పుడు  మొత్తం రూ.24,000 విలువైన ఆభరణాలను కొనుగోలు చేయొచ్చు.     
 
రెండవ రకం పథకం లోనూ నిర్ణీత మొత్తం, నిర్ణీత కాలం వరకు ప్రతినెలా వాయిదా పద్ధతిలో చెల్లించాలి. ఇక్కడ మనం చెల్లించే నెలవారి మొత్తంతో ఆ నెల్లోనే బంగారాన్ని కొని మన ఖాతాలో జమచేస్తారు. పథకం కాలపరిమితి ముగిశాక మన ఖాతాలో ఎంత బంగారం ఉంటుందో దానిని మనకిస్తారు. ఈ విధానంలో బోనస్ అంటూ ఏమీ ఉండదు.
 
కస్టమర్లు ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్త పాటించాలి. ఎందుకంటే ఈ జ్యుయలరీ సంస్థలపై బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్ తదితర వాటిపై ఉన్నట్లుగా ప్రభుత్వ సంస్థల అజమాయిషీ ఉండదు. వారు బోర్డు తిప్పేస్తే ఎవరు ఏమీ చేయలేరు. 2003లో ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. గతేడాది ఏప్రిల్  నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టం ప్రకారం జ్యుయలరీ సంస్థలు వినియోగదారులకు ఎట్టి పరిస్థితుల్లోను 12 శాతానికి మించి రాబడినివ్వకూడదు.
 
గోల్డ్ ఈటీఎఫ్...
గోల్డ్ ఈటీఎఫ్ మార్గంలో కూడా బంగారంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. గోల్డ్ సేవింగ్ పథకాలతో పోలిస్తే గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్‌మెంట్ మంచిది. ఎందుకంటే మనం ఇన్వెస్ట్‌చేసే డబ్బుకు రాబడి, రక్షణ రెండూ ఉంటాయి. గోల్డ్ సేవింగ్ పథకాల మాదిరే దీన్లోనూ రాబడి ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ గోల్డ్ ఈటీఎఫ్ మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లలో లిస్టవుతాయి కూడా. మనం మన షేర్లను ఏ విధంగా విక్రయిస్తామో... అలాగే వీటిని కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు విక్రయించవచ్చు. అంటే లిక్విడిటీ ఉంటుందన్న మాట. సాధారణంగా ఒక యూనిట్ గోల్డ్ ఈటీఎఫ్ ఒక గ్రాము బంగారానికి సమానం. కొన్ని సంస్థలు అరగ్రామును కూడా యూనిట్‌గా పరిగణిస్తున్నాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లు దీర్ఘకాలంలో సగటున 13 శాతం వరకు రాబడినిస్తున్నాయి.
 
బంగారాన్ని భౌతిక రూపంలో కొంటే తయారీ చార్జీలుంటాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లలో అయితే అవేవీ ఉండవు. బంగారం ధర ప్రాంతాన్ని బట్టి మారుతుంది కానీ...  ఈటీఎఫ్‌లలో దేశవ్యాప్తంగా ఒకే ధర ఉంటుంది. బంగారాన్ని విక్రయించేటప్పుడు తరుగుదల తీసేస్తారు. గోల్డ్ ఈటీఎఫ్‌లలో అయితే ఇలాంటివి ఉండవు. అలాగే గోల్డ్ ఈటీఎఫ్‌లపై వ్యాట్, సంపద పన్ను, ఎస్‌టీటీ వంటి పన్నులుండవు. బ్రోకరేజ్ చార్జీలు మాత్రం ఉంటాయి.
- గోల్డ్ ఈటీఎఫ్ పథకాలనందిస్తున్న సంస్థలు
- ఎస్‌బీఐ గోల్డ్ ఈటీఎఫ్
- యూటీఐ గోల్డ్ ఈటీఎఫ్
- రిలయన్స్ గోల్డ్ ఈటీఎఫ్
- కొటక్ గోల్డ్ ఈటీఎఫ్
- హెచ్‌డీఎఫ్‌సీ గోల్డ్ ఈటీ ఎఫ్
- యాక్సిస్ గోల్డ్ ఈటీఎఫ్
- ఐడీబీఐ గోల్డ్ ఎక్స్చేంజ్
- జీఎస్ గోల్డ్ పథకం
- బిర్లా సన్‌లైఫ్ గోల్డ్ ఈటీఎఫ్
- రెలిగేర్ గోల్డ్ ఈటీఎఫ్
 
ఈ-గోల్డ్
ఈ-గోల్డ్ పథకాన్ని నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఈటీ) అందిస్తోంది. గోల్డ్ ఈటీఎఫ్‌లతో పోలిస్తే ఈ-గోల్డ్ రాబడి ఇంకాస్త ఎక్కువ. 2012లో గోల్డ్ ఈటీఎఫ్‌లు సగటున 11 శాతం రాబడినిస్తే.. ఈ-గోల్డ్ 16 శాతం రాబడిని అందించింది. గోల్డ్ ఈటీఎఫ్‌లతో పోలిస్తే ఈ-గోల్డ్‌లో బ్రోకరేజ్ చార్జీలు తక్కువ. సంపద పన్ను వర్తిస్తుంది. గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఏడాది కాలాన్ని దీర్ఘకాలంగా పరిగణిస్తే.. ఈ-గోల్డ్‌లో మూడేళ్లను దీర్ఘకాలంగా పరిగణి స్తారు. అంటే మూడేళ్లు సేవింగ్ చేస్తేనే పన్ను మినహాయింపులు వర్తిస్తాయి.
 
గోల్డ్ ఫండ్స్, ఫండ్ ఆఫ్ ఫండ్స్
మ్యూచువల్ ఫండ్స్‌లానే వివిధ ఫండ్ హౌస్‌లు గోల్డ్ ఫండ్స్‌నూ వినియోగదారులకు ఆఫర్ చేస్తున్నాయి. గోల్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి డీమ్యాట్ ఖాతా తప్పనిసరి కాదు. ఈ-గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్ లావాదేవీలు మాత్రం డిమ్యాట్ ఖాతా ద్వారానే జరుగుతాయి. గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ద్వారా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు.
 
గోల్డ్ బాండ్లు
కేంద్రం గోల్డ్ బాండ్లను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ఇంకా దీని విధివిధానాలు ఖరారు కాలేదు. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ బాండ్లను...  2,5 నుంచి 10 గ్రాము ల వరకూ వివిధ పరిమాణాల్లో కేంద్రం జారీ చేస్తుంది. వీటి కాలపరిమితి 5-7 సంవత్సరాల దాకా ఉంటుంది. 50 టన్నుల పసిడికి సమానమైన గోల్డ్ బాండ్లను జారీచేసి రూ.13,500 కోట్లను సమీకరించాలని కేంద్రం భావిస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement