పసిడిపై సుంకం 4%కి తగ్గించాలి | Gems & jewellery sector seeks cut in gold import duty to 4% | Sakshi
Sakshi News home page

పసిడిపై సుంకం 4%కి తగ్గించాలి

Published Wed, Jan 30 2019 12:34 AM | Last Updated on Wed, Jan 30 2019 12:34 AM

 Gems & jewellery sector seeks cut in gold import duty to 4% - Sakshi

ముంబై: నోట్ల రద్దు, జీఎస్టీ తాలూకూ ప్రభావాలను ఇంకా ఎదుర్కొంటున్నామని, ఈ నేపథ్యంలో బంగారంపై దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 4 శాతానికి తగ్గించాలని రత్నాభరణాల పరిశ్రమ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కట్, పాలిష్డ్‌ వజ్రాలు, కట్, పాలిష్డ్‌ రత్నాలపై పన్నును ప్రస్తుతమున్న 7.5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించాలని, వీటికి అదనంగా రుణ నిబంధనలను సరళతరం చేయాలని ఈ పరిశ్రమ కేంద్ర ఆర్థిక శాఖకు రాసిన లేఖలో పేర్కొంది. వచ్చే శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి పార్లమెంట్‌కు బడ్జెట్‌ సమర్పించనున్న నేపథ్యంలో తమ డిమాండ్లను అఖిల భారత జెమ్స్, జ్యుయలరీ కౌన్సిల్‌ చైర్మన్‌ అనంత పద్మనాభన్‌ లేఖ రూపంలో తెలియజేశారు. ‘‘కరెంటు ఖాతా లోటు అధికంగా ఉన్నప్పుడు దానికి కళ్లెం వేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం బంగారం దిగుమతులపై సుంకాన్ని 10 శాతానికి పెంచింది. నాటి నుంచి వాణిజ్య లోటు తగ్గడంతో కరెంటు ఖాతా లోటు నియంత్రణలోకి వచ్చింది. అయితే, బంగారంపై అధిక దిగుమతి సుంకాలతో ఈ లోహం దొంగ రవాణా పెరిగేందుకు దారితీస్తుంది. దీంతో సంబంధిత లక్ష్యాలు నెరవేరవు’’ అని పద్మనాభన్‌ పేర్కొన్నారు.

బడ్జెట్‌లో పరిశ్రమ ఆశిస్తున్నవి ఇవే... 
బంగారు ఆభరణాల కొనుగోళ్ల సమయంలో విలువ రూ.2 లక్షలు, అంతకుమించి ఉంటే పాన్‌ నంబర్‌ సమర్పించాలన్న నిబంధనను సడలించాలి. రూ.5 లక్షలకు పెంచాలి. దేశంలో 50 శాతం మందికి పాన్‌ లేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల వారికి ఇబ్బంది అవుతోంది.  ప్రత్యేకంగా గుర్తించిన జోన్ల ద్వారా ముడి వజ్రాలను విదేశీ మైనింగ్‌ కంపెనీలు విక్రయించేందుకు ఆదాయపన్ను నిబంధనల్లో మార్పులు చేయాలి.ఇన్‌పుట్‌ సేవలపై 0.25 జీఎస్టీ ఉండాలి. మూలధన అవసరాల కోసం రుణాలను సులభంగా పొందేందుకు నిబంధనలు సడలించాలి.రత్నాభరణాల ఎగుమతులకు సంబంధించి తీసుకునే రుణాలపై 5 శాతం వడ్డీ రాయితీని తిరిగి ప్రవేశపెట్టాలి.కమోడిటీ ట్రేడింగ్‌ ట్యాక్స్‌ ఎత్తివేయాలి.

ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమ డిమాండ్లు..
దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులపై సుంకాలు పెంచడంతోపాటు, వీటికి సంబంధించిన విడిభాగాల దిగుమతులపై మాత్రం సుంకాలు తగ్గించాలని కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ అప్లయన్సెస్‌ తయారీ దారుల సంఘం (సీఈఏఎంఏ) కోరింది.

∙టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషీన్లు వంటి పూర్తి స్థాయి ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలు పెంచాలి. వాస్తవానికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల వీటి దిగుమతులపై సుంకాలు విడిభాగాల కంటే తక్కుగా ఉంటున్నాయి. 

∙కంప్రెషర్లు, ఓపెన్‌ సెల్, డిస్‌ప్లే ప్యానెళ్లపై ప్రస్తుతమున్న 10 శాతం సుంకాన్ని 5 శాతానికి తగ్గించాలి. దీనివల్ల దేశీయ తయారీకి ప్రోత్సాహం లభిస్తుంది. ధరల పరంగా స్థానిక కంపెనీలు పోటీ పడగలుగుతాయి. ఓపెన్‌ సెల్స్, డిస్‌ప్లే ప్యా నెళ్లు, కంప్రెషర్లను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవడం వల్ల, అధిక సుంకాల కారణంగా దేశీయ పరిశ్రమలో రెండేళ్లుగా వృద్ధి ఉండటం లేదు. 

∙దేశీయంగా తయారయ్యే విడిభాగాలు, ఉత్పత్తులకు సబ్సిడీలు ఇవ్వడం వల్ల స్థానిక తయారీ పెరుగుతుంది.

∙భారీగా దిగుమతి అవుతున్న సెక్యూరిటీ, నిఘా కెమెరాల విషయమై దృష్టి సారించాలి. వీటిపై దిగుమతి సుంకాన్ని 15% నుంచి 20 శాతానికి పెంచాలి. దిగుమతులను నిరుత్సాహపరిచి, స్థాని క తయారీని ప్రోత్సహించేందుకు ఇది అవసరం.

ఎగుమతులను పెంచేందుకు ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం
ఎగుమతిదారుల సమాఖ్య ‘ఎఫ్‌ఐఈవో’ 

న్యూఢిల్లీ: నత్తనడకన ఉన్న దేశీయ ఎగుమతుల వృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వపరంగా బడ్జెట్‌లో ప్రోత్సాహం అవసరమని భారతీయ ఎగుమతిదారుల సమాఖ్య (ఎఫ్‌ఐఈవో) పేర్కొంది. గడిచిన 2–3 నెలల్లో ఎగుమతుల వృద్ధి  నామమాత్రంగానే ఉందని, ఇది ఆందోళనకరమని ఎఫ్‌ఐఈవో ప్రెసిడెంట్‌ గణేశ్‌ కుమార్‌ అన్నారు. ‘‘రానున్నది మధ్యంతర బడ్జెటే అయినా కొన్ని ప్రోత్సాహకాలు, ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈ రంగానికి, పరిశోధన, అభివృద్ధికి ఇవ్వాల్సి ఉంది. ఇది ఎగుమతులను పెంచడంతోపాటు తయారీ, ఉద్యోగాల కల్పనకు ఊతమిస్తుంది’’ అని  కుమార్‌ పేర్కొన్నారు. 2018 నవంబర్‌లో ఎగుమతుల వృద్ధి 0.8 శాతం, డిసెంబర్‌లో 0.34 శాతంగా ఉంటే, గడచిన ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు 10.18 శాతం పెరుగుదలతో 245 బిలియన్‌ డాలర్ల మేర ఉండటం గమనార్హం. పెట్రోలియం, విద్యుత్‌పై పన్నుతోపాటు రాష్ట్రాల పన్నులను తిరిగి ఇచ్చేయాలని కోరారు. ఉద్యోగాలను కల్పించే యూనిట్లకు పన్ను రాయితీలు ఇవ్వాలని. ఎగుమతి ప్రోత్సాహక నిధి ఏర్పాటుకు సైతం డిమాండ్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement