
ఎంఎస్‌ఎంఈలతో స్థిరమైన వృద్ధి
ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ముంద్రా
పుణే : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రుణ మంజూరు మెరుగుదలపై బ్యాంకులు మరింత దృష్టి కేంద్రీకరించాలని ఆర్‌బీఐ తెలిపిం ది. పెద్ద కంపెనీలతో పోలిస్తే చిన్న పరిశ్రమల వల్ల బ్యాంకులకు కలిగే రిస్క్ తక్కువని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో రుణ వృద్ధిని సాధించాలంటే.. ఎంఎస్‌ఎంఈ రంగంతోనే సాధ్యమవుతుందని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్.ఎస్. ముంద్రా చెప్పారు. ఇక్కడ జరిగిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఫైనాన్సింగ్ కార్యక్ర మంలో మాట్లాడారు. పెద్ద కంపెనీలతో పోలిస్తే ఎంఎస్‌ఎంఈల స్థూల ఎన్‌పీఏలు అధికంగా ఉన్నప్పటికీ.. రుణ పునర్‌వ్యవస్థీకరణ చా లా తక్కువ స్థాయిలో ఉంటుందన్నారు.
బ్యాంకులు వాటి రుణ నాణ్యత విషయంలో ఆందోళనలో ఉన్నాయని తెలిపారు. కేవైసీ, రికవరీ సంబంధిత అంశాల కారణంగా ఎంఎస్‌ఎంఈలకు రుణాల మంజూరులో బ్యాంకులు వెనకడుగు వేస్తున్నాయని పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఈ రంగంతోనే స్థిరమైన వృద్ధి నమోదౌతుందని ధీమా వ్యక్తంచేశారు. ప్రస్తుతం ‘ట్రేడ్ రిసీవబుల్ డిస్కౌంటింగ్ సిస్టమ్’కు సంబంధించి ఏడు దరఖాస్తులు అందాయని తెలిపారు.