మగువలూ.. మీకోసమే..! | Women's Day: Jet, GoAir offer discount, AI all-women crew flight | Sakshi
Sakshi News home page

మగువలూ.. మీకోసమే..!

Published Sat, Mar 8 2014 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 4:27 AM

మగువలూ.. మీకోసమే..!

మగువలూ.. మీకోసమే..!

న్యూఢిల్లీ/ముంబై: అంతర్జాతీయ మహిళా దినోత్సవం (శనివారం) సందర్భంగా వివిధ కంపెనీలు వివిధ ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. టాటా మోటార్స్, ముత్తూట్ ఫైనాన్స్, గూగుల్‌తో పాటు  దేశీయ విమానయాన సంస్థలు మహిళల కోసం ఆకర్షణీయ ఆఫర్లను, డిస్కౌంట్లను అందిస్తున్నాయి.
 
 జెట్.. డిస్కౌంట్ ఆఫర్
 మహిళలకు విమాన టికెట్లపై డిస్కౌంట్లనందిస్తోంది. ఈ నెల 8 నుంచి మే 8  మధ్య బుక్ చేసుకునే టికెట్లకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. ఈ టికెట్ల వ్యాలిడిటీ 11 నెలలు. ఈ ఆఫర్‌లో భాగంగా అంతర్జాతీయ రూట్లలో బేసిక్ చార్జీల్లో 10% డిస్కౌంట్ పొందొచ్చు. దేశీ రూట్లలోనైతే ఫ్యూయల్ సర్‌చార్జీపై 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ జెట్ ఎయిర్‌వేస్, జెట్ కనెక్ట్ కంపెనీలకు కూడా వర్తిస్తుంది. కాగా గో ఎయిర్ కూడా మహిళా ప్రయాణికుల కోసం రూ.999కే బిజినెస్ క్లాస్‌కు అప్‌గ్రేడ్ అయ్యే స్కీమ్‌ను ఆఫర్ చేయడం తెలిసిందే.
 
 ఎయిరిండియా ‘మహిళా’ ఫ్లైట్‌లు...
 మహిళా దినోత్సవం సందర్భంగా గతంలో అంతా మహిళా సిబ్బంది  ఉండే విమానాలను ఈ సంస్థ నడిపింది. ఈ ఏడా ది కూడా అలా చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. విమానాలు నడపడం వంటి కష్టసాధ్యమైన పనులను చేయడంలో మహిళలు పురుషులకు ఏ మాత్రం తీసిపోరనే సందేశాన్నివ్వడం కోసం ఇలా చేస్తున్నామని ఎయిరిండియా పేర్కొంది.
 
 గూగుల్... రూ.6 కోట్లు
 టెక్నాలజీ రంగంలో మరింత మంది మహిళలకు ఆసక్తి కలిగించేందుకు ఇంటర్నెట్ సెర్చిం జన్ దిగ్గజం గూగుల్ నడుంబిగిస్తోంది. ఇందుకోసం రూ. 6 కోట్ల వరకూ పెట్టుబడులు పెడుతోంది. గూగుల్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా ‘షార్ప్ 40 ఫార్వార్డ్’ పేరుతో గూగుల్ ఈ ప్రయత్నాలు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 40 సంస్థలను ఎంపిక చేసి, మహిళా ఎంటర్‌ప్రెన్యూర్లకు మరింత ప్రోత్సాహాన్నిచ్చే దిశగా ఈ ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొంది. భారత్ నుంచి నాస్కామ్ 10,000 స్టార్టప్స్, జాగృతి యాత్ర సంస్థలు ఎంపికయ్యాయి.
 
 న్యూ ఇండియా ‘ఆశా కిరణ్’ ఆరోగ్య బీమా...
 మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వరంగ సాధారణ బీమా కంపెనీ న్యూ ఇండియా అష్యూరెన్స్ ‘ఆశా కిరణ్’ పేరుతో ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. కేవలం అమ్మాయిలు పిల్లలుగా ఉన్న కుటుంబాల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు కంపెనీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇలాంటి పిల్లల పేరుమీద పాలసీలు తీసుకుంటే ప్రీమియంలో 50 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు న్యూ ఇండియా సీఎండీ జి.శ్రీనివాసన్ తెలిపారు. తల్లిదండ్రులకు ఏమైనా ప్రమాదం జరిగితే బీమా మొత్తాన్ని పిల్లల పేరు మీద డిపాజిట్ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
 
 మహిళా బ్యాంక్- టాటా రుణాలు
 మహిళా వినియోగదారులకు వాహన రుణాలివ్వడం కోసం భారతీయ మహిళా బ్యాంక్‌తో టాటా మోటార్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా అర్హులైన మహిళా వినియోగదారులకు టాటా కార్లు, యుటిలిటి వాహనాల కొనుగోళ్ల కోసం భారతీయ మహిళా బ్యాంక్ 10.5 శాతం వడ్డీరేటుకే రుణాలందిస్తుందని టాటా మోటార్స్ పేర్కొంది. రుణ కాలపరిమితి ఏడేళ్ల వరకూ ఉంటుందని, వాహనం విలువలో గరిష్ట మొత్తం బ్యాంక్ రుణంగా అందించగలదని, దేశవ్యాప్తంగా ఉన్న 12 భారతీయ మహిళా బ్యాంక్ బ్రాంచీల్లో ఈ రుణాలు అందుబాటులో ఉంటాయని వివరించింది.  ప్రస్తుతం తమ మొత్తం వినియోగదారుల్లో మహిళల సంఖ్య 11 శాతంగా ఉందని, ఈ తాజా ఒప్పందంతో ఈ సంఖ్య మరింతగా పెరగగలదని టాటా మోటార్స్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ ఒప్పందం బ్యాంక్‌కు, టాటా మోటార్స్ కంపెనీకి కూడా ప్రయోజనకరమేనని భారతీయ మహిళా బ్యాంక్ సీఎండీ ఉషా అనంతసుబ్రమణ్యన్ వ్యాఖ్యానించారు.
 
 తక్కువ రేట్లకే ముత్తూట్ రుణాలు
 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు తక్కువ రేట్లకే రుణాలిస్తామని ముత్తూట్ ఫైనాన్స్ పేర్కొంది. బంగారం తనఖాగా  ఏడాది కాలానికి రూ.50 వేల లోపు రుణాలను 12% వడ్డీకే అందిస్తామని పేర్కొంది. సాధారణంగా రూ.50 వేల లోపు రుణాలకు 14% వడ్డీరేటు వసూలు చేస్తామని, మహిళా దినోత్సవం సందర్భంగా 2% తక్కువకే ఈ రుణాలిస్తున్నట్లు పేర్కొంది. బంగారం విలువలో 71% వరకూ రుణమిస్తామని తెలిపింది. దేశవ్యాప్తంగా తమ 3,829 బ్రాంచీల్లో ఈ నెల 15 వరకూ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement