భారత్లో వ్యాపారం కష్టమే..: ఎయిర్ ఏషియా
కానీ ఇక్కడి మార్కెట్లో కొనసాగుతామని స్పష్టీకరణ
న్యూఢిలీ: భారత్‌లో అనుసరించే రక్షణాత్మక ఆర్థిక విధానాలు, స్వార్థ ప్రయోజనాల కారణంగా ఇక్కడి మార్కెట్లో వ్యాపార నిర్వహణ కష్టతరమని మలేసియన్ ఎయిర్‌లైన్ సంస్థ ఎయిర్ ఏషియా చీఫ్ టోనీ ఫెర్నాండెజ్ తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. ఈ విధమైన విధానాలను విడిచిపెట్టేందుకు మోదీ సర్కారు ధైర్యంగా ముందుకు వెళ్లాల్సి ఉందన్నారు. టాటాలతో తమ భాగస్వామ్య సంస్థ ‘ఎయిర్ ఏషియా ఇండియా’ ప్రధానంగా దూర ప్రాంత సర్వీసుల కోసం ఉద్దేశించినదిగా చెప్పారు. ఎయిర్ ఏషియా ఇండియా దూకుడుగా వెళ్లకుండా వృద్ధి వైపు నిదానంగా అడుగులు వేస్తున్న తీరుపై మాట్లాడుతూ...
ఇక్కడి విమానయాన రంగం సుదీర్ఘ పరుగు పందెం వంటిందన్నారు. విజయ్‌మాల్యా వలే తుఫాను వేగంతో వెళ్లి సమస్యల్లో చిక్కుకోవాలని లేదని ‘కింగ్‌ఫిషర్స్ ఎయిర్‌లైన్స్’ ఉదంతాన్ని పరోక్షంగా గుర్తు చేశారు. ఇంతకుముందు విమానయాన పాలసీపై స్పష్టత లేదని, అందుకే తాము విస్తరణ విషయంలో ఆచితూచి అడుగులు వేశామని వివరించారు. ఇకపై తాము ఏం చేయాలన్న దానిపై స్పష్టతతో ఉన్నామని ఫెర్నాండెజ్ చెప్పారు. ఈ మేరకు టోనీ ఫెర్నాండెజ్ కంపెనీ వృద్ధి ప్రణాళికలపై పీటీఐ సంస్థతో మాట్లాడారు.
ఎయిర్‌లైన్స్‌ను కాపాడాల్సిన పనిలేదు..
విమానయాన రంగంలో భారత సర్కారు రక్షణాత్మక విధానాలను విమర్శించడానికి మాటలు చాలవన్న ఆయన... దేశీయ ఎయిర్‌లైన్ సంస్థలు అంతర్జాతీయ సర్వీసులను నడిపే విషయంలో నిబంధన (5/20)ను మార్చడంపై సంతోషం వ్యక్తం చేశారు. ‘మలేసియాలో 2 విమానాలతో సేవలు ప్రారంభిం చాం. అక్కడ 5/20 నిబంధన లేదు. కోర్టులతో పని పడలేదు. మా వెనుక నరేష్ గోయల్ లేడు. భారత్‌లో రెండేళ్లుగానే ఉన్నాం. ఓపిక పట్టాలి. కంగారొద్దు’ అని ఫెర్నాండెజ్ అన్నారు. ‘ఎయిర్‌లైన్ సంస్థలను కాపాడే ప్రయత్నం చేయవద్దు. మరిన్ని విమానయాన సర్వీసులకు వీలు కల్పించాలి. మరింత మంది పర్యాటకులు భారత్‌కు రావాలి. దీంతో మరిన్ని ఉద్యోగాల సృష్టి జరగాలి’ అని అభిప్రాయపడ్డారు.