రెడ్‌మి నోట్ 3 విడుదల
చవక ధరలకే స్మార్ట్ ఫోన్లు అందిస్తూ భారతీయ మార్కెట్లోకి చొచ్చుకొచ్చిన చైనా కంపెనీ షియోమి తాజాగా తన రెడ్‌మి నోట్ 3ని విడుదల చేసింది. తొలిసారిగా అత్యంత శక్తిమంతమైన స్నాప్‌డ్రాగన్ 650 ప్రాసెసర్ ఉండటం దీని ప్రత్యేకత. మెటల్ బాడీతో పాటు ఎక్కువ సేపు బ్యాటరీ బ్యాకప్ వచ్చేందుకు వీలుగా 4050 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో ఇచ్చారు. దీని ధర రూ. 9,999 అని రెడ్‌మి సంస్థ ప్రకటించింది. దానివల్ల ఈ నోట్3ని ఒకసారి చార్జి చేస్తే రోజంతా పూర్తిగా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ సదుపాయాలతో పాటు తొలిసారిగా షియోమి నుంచి ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో వచ్చిన ఫోన్ కూడా ఇదే.
ఈ ఫోన్ 164 గ్రాముల బరువు ఉన్నా, మందం మాత్రం 8.65 మిల్లీమీటర్లు మాత్రమే. 5వి/2ఎ క్వాల్‌కామ్ క్విక్‌చార్జి టెక్నాలజీని కూడా సపోర్ట్ చేస్తుందని, దానివల్ల గంటలోనే 50 శాతం చార్జింగ్ పూర్తవుతుందని, పూర్తిస్థాయిలో చార్జింగ్ అవ్వాలంటే మాత్రం 3 గంటల సమయం పడుతుందని అంటున్నారు. దీనికి 16 మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉంది. అత్యాధునిక క్వాల్‌కామ్ అడ్రెనో 510 జీపీయూ కూడా ఉండటంతో గేమ్స్ కోసం మంచి గ్రాఫిక్స్ పెర్ఫార్మెన్సు కూడా ఉంటుందట.