
కస్టమర్లకు చెల్లింపు సేవల్లో ఊరట కల్పించిన యస్ బ్యాంక్
ముంబై : సంక్షోభంలో కూరుకుపోయిన ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ మంగళవారం కస్టమర్లకు ఊరట కల్పించింది. ఖాతాదారులు నెఫ్ట్‌తో పాటు ఇమిడియట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) ద్వారా చెల్లింపులు చేపట్టవచ్చని బ్యాంక్ ట్వీట్ చేసింది. కస్టమర్లు తమ క్రెడిట్ కార్డు బకాయిలను, ఇతర బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను నెఫ్ట్, ఐఎంపీఎస్ ద్వారా చెల్లించవచ్చని పేర్కొంది. యస్ బ్యాంక్ బోర్డును ఆర్బీఐ ఇటీవల రద్దు చేసి, బ్యాంకు నుంచి విత్‌డ్రాయల్స్‌కు పరిమితులు విధించిన సంగీతి తెలిసిందే. ఆర్బీఐ నియంత్రణతో ఖాతాదారుల్లో ఆందోళన వ్యక్తమవుతుండగా ఎస్బీఐ యస్ బ్యాంక్ వాటాను కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం, క్రమంగా బ్యాంకు లావాదేవీలపై నియంత్రణలను సడలిస్తుండటంతో ఖాతాదారుల్లో విశ్వాసం వ్యక్తమవుతోంది.మరోవైపు బ్యాంకు వ్యవస్ధాపకుడు రాణా కపూర్ ఆయన కుటుంబ సభ్యుల చుట్టూ దర్యాప్తు సంస్థలు ఉచ్చు బిగించాయి.