ఖరీదైన పీసీయే కావాలి..!! | Younger Millennials: The Pro-PC Generation | Sakshi
Sakshi News home page

ఖరీదైన పీసీయే కావాలి..!!

Published Fri, Jul 29 2016 6:28 AM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

ఖరీదైన పీసీయే కావాలి..!!

ఖరీదైన పీసీయే కావాలి..!!

స్టైల్, అధిక ఫీచర్లకే యువత మొగ్గు
‘మిలీనియల్స్’ అభిరుచులకు అనుగుణంగా మోడళ్లు
మార్చి త్రైమాసికంలో పీసీల్లో వీటి వాటాయే 30%
అమ్మకాలు తగ్గుతున్నా.. ప్రీమియం మోడల్స్‌లో వృద్ధి

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : చేతిలో స్మార్ట్‌ఫోనే కాదు. భుజానికుండే ల్యాప్‌టాప్ కూడా ఖరీదైనదే కావాలట!!. ఇదీ నేటి కుర్రకారు ట్రెండ్. పర్సనల్ కంప్యూటర్‌ను కూడా స్టేటస్ సింబల్‌గా భావించే వారు పెరుగుతున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి. స్టైలిష్‌గా... ఎక్కువ ఫీచర్లతో ఉండే ల్యాప్‌టాప్‌లనే యువత ఇష్టపడుతున్నారని, వీటిని నలుగురిలోనూ చూపించడాన్ని స్టైల్ స్టేటస్‌గా భావిస్తున్నారని గణాం కాలు చెబుతున్నాయి. నిజానికి పీసీ మార్కెట్ వృద్ధి రేటు అంతకంతకూ తగ్గుతుండగా ప్రీమియం ఉత్పత్తులు మాత్రం 25-30% వృద్ధిని నమోదు చేస్తున్నాయి. పీసీలను వాడుతున్నవారు హై ఎండ్ మోడళ్లకు అప్‌గ్రేడ్ అవుతుండడమే ఇందుకు కారణ మని చెబుతున్న కంపెనీలు... వీటిపై దృష్టిపెట్టాయి. ప్రీమియం మోడళ్లను తీసుకొస్తున్నాయి.

కొద్ది రోజుల వరకు డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లు నలుపు రంగులోనే వచ్చేవి. ఇప్పుడు పరిస్థితి మారి కలర్‌ఫుల్ కంప్యూటర్లు వచ్చేశాయి. మినీ నోట్‌బుక్స్, అల్ట్రా పోర్టబుల్ ట్యాబ్లెట్స్ వంటి పేర్లతో హల్‌చల్ చేస్తున్నాయి. డెస్క్‌టాప్‌లైతే పెద్ద స్క్రీన్‌తో టూ ఇన్ వన్‌ల రూపాన్ని సంతరించుకున్నాయి. కొన్ని కంపెనీలైతే ల్యాప్‌టాప్‌లను ట్యాబ్లెట్‌గా కూడా వాడుకునేలా తయారు చేస్తున్నాయి. 10.4 మిల్లీమీటర్ల మందంతో ప్రపంచంలో అతి పలుచని ల్యాప్‌టాప్‌ను హెచ్‌పీ రూపొందించింది. వినియోగదార్లు వినూత్న డిజైన్, తక్కువ బరువు, అధిక మెమరీ, గట్టిదనం వంటి ఫీచర్లు కోరుకుంటున్నారు. మెట్రోల్లో ఈ ట్రెండ్ అధికం. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఇప్పుడిప్పుడే ప్రీమియం ఉత్పత్తుల పట్ల ఆసక్తి కనబరుస్తున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి.

 యువత అభిరుచే ప్రధానం
కంపెనీల నోట ఇప్పుడు మిలీనియల్స్ మాట వినపడుతోంది. 18 నుంచి 34 ఏళ్ల వయసున్న కుర్రకారుకు కంపెనీలు పెట్టుకున్న ముద్దుపేరే మిలీనియల్స్. వీరే కొత్తదనాన్ని కోరుకుంటున్నారని హెచ్‌పీ ఇండియా కన్సూమర్ పర్సనల్ సిస్టమ్స్ విభాగం అధిపతి అనురాగ్ అరోరా చెప్పారు. కంప్యూటర్ అక్షరాస్యతతో పాటు వీరికి కొనుగోలు శక్తి కూడా ఉందని చెప్పారాయన. ‘‘భారత్‌లో పీసీల మార్కెట్ గతేడాదితో పోలిస్తే 2016 మార్చి త్రైమాసికంలో 7.4% తిరోగమనం చెందింది.

మార్కెట్ ఇప్పుడిప్పుడే మళ్లీ గాడిలో పడి స్థిరపడుతోంది. కాకపోతే రూ.50 వేలు ఆపైన ఉన్న ప్రీమియం విభాగం మాత్రం 25-30 శాతం చొప్పున వృద్ధి చెందుతోంది. ఇప్పటిదాకా బేసిక్ మోడళ్లు వాడినవారు ప్రీమియం మోడళ్లకు అప్‌గ్రేడ్ అవుతున్నారు’’ అని అరోరా వెల్లడించారు. సగటు ల్యాప్‌టాప్ ధర రూ.35 వేల నుంచి రూ.38 వేలకు ఎగసినట్లు తెలియజేశారు. కాగా గేమింగ్ డెస్క్‌టాప్‌ల రంగంలో తమ కంపెనీ అగ్ర స్థానంలో ఉన్నట్టు ఆసస్ సంస్థ దక్షిణాసియా హెడ్ పీటర్ చాంగ్ చెప్పారు.  రిపబ్లిక్ ఆఫ్ గేమర్స్ పేరుతో భారత్‌లో తాము ఎక్స్‌క్లూజివ్ స్టోర్లను ప్రారంభించనున్నట్లు కూడా ఆయన తెలియజేశారు.

ఇదీ పీసీ మార్కెట్...
జనవరి - మార్చి మధ్య దేశంలో అమ్ముడైన డెస్క్‌టాప్,
ల్యాప్‌టాప్‌లు..  20 లక్షలు.
వీటిలో ప్రీమియం పీసీల వాటా 30 శాతం... అంటే 60 వేలు
గేమింగ్ ల్యాప్‌టాప్‌ల అమ్మకాలు - నెలకు 2-3వేలు
గేమింగ్ పీసీల మార్కెట్లో అగ్రస్థానం - అసస్ 30 శాతం.

 అగ్రస్థానంలో హెచ్‌పీ: గార్ట్‌నర్
పీసీ వాడకంలో వ్యక్తిగత వినియోగదార్ల వాటా 45%కాగా మిగిలిన 55% ఎంటర్‌ప్రైజెస్ వాటా. పరిశ్రమలో 25% వాటాతో హెచ్‌పీదే అగ్రస్థానం. ఆన్‌లైన్‌లోనూ ఈ కంపెనీదే పెత్తనం. డెల్ 23.5%, లెనోవో 19.4% వాటాలు ఉన్నాయి. ఏసర్ వాటాను 10.5 నుంచి 12.2 శాతానికి చేరినట్లు గార్ట్‌నర్ నివేదిక పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement