ఈపీఎఫ్ సహకారాన్ని తగ్గించబోతున్న కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ : టేక్-హోమ్ శాలరీ చాలా తక్కువగా వస్తోందని బాధపడుతున్నారా? అయితే ఇక ఆ దిగులును ప్రభుత్వం కాస్త తగ్గించబోతుంది. ఉద్యోగుల టేక్-హోమ్ శాలరీని పెంచాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. దీని కోసం ఉద్యోగుల వేతనాల్లోంచి తీసుకునే సామాజిక భద్రత సహకారం(సోషల్ సెక్యురిటీ కాంట్రిబ్యూషన్)ను తగ్గించేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తోంది. దేశంలో ఉన్న ఉద్యోగులందరికీ ఒకే విధమైన సామాజిక భద్రత సహకారం ఉండేలా కార్మిక మంత్రిత్వ శాఖ కమిటీ పనిచేస్తుందని.. ప్రస్తుతమున్న సీలింగ్ 24 శాతాన్ని, 2 శాతం తగ్గించాలని ప్రభుత్వం ప్రతిపాదనలను తయారు చేస్తుందని ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు.
ప్రస్తుతం ఉద్యోగుల సహకారం కింద వారి బేసిక్ వేతనం నుంచి 12 శాతాన్ని ఈపీఎఫ్‌కి అందిస్తున్నారు. అంతేకాక ఆర్గనైజేషన్స్ కూడా ఉద్యోగుల బేసిక్ వేతనం నుంచి 3.67 శాతాన్ని తమ సహకారం కింద ఈపీఎఫ్‌లో క్రెడిట్ చేస్తున్నాయి. ఈపీఎస్ లేదా ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ కింద 8.33 శాతం మైనస్ అవుతుంది. ఇవన్నీ కలిపి మొత్తంగా 24 శాతం ఉద్యోగుల బేసిక్ వేతనం నుంచి కట్ అవుతుంది.
తాజాగా ఉద్యోగుల ఈపీఎఫ్ సహకారాన్ని 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం చూస్తోంది. దీంతో ఉద్యోగుల టేక్-హోమ్ శాలరీ పెరగబోతుంది. ప్రస్తుతం 20 మంది కంటే తక్కువ ఉద్యోగులున్న సంస్థలకు కేవలం 10 శాతం మాత్రమే ఈపీఎఫ్ సహకారం ఉంది. ఇదే విధానాన్ని అన్ని ఆర్గనైజేషన్లకు అమలు చేయాలని ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు రూపొందిస్తోంది. దీంతో 10 కోట్ల మంది ఈపీఎఫ్‌ఓ సబ్‌స్క్రైబర్లకు లబ్ది చేకూరనుంది. ఒక్కసారి కార్మిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ ఈ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఆ మంత్రిత్వ శాఖ వాటాదారులతో సంప్రదింపులు జరుపుతుంది. ప్రస్తుతం సామాజిక భద్రత స్కీమ్ కింద 10 కోట్ల మంది ఉద్యోగులున్నారు. వీరిని 5 రెట్లు అంటే 50 కోట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సామాజిక భద్రత సహకారం తగ్గితే, ఇటు ఉద్యోగులు, అటు ఆర్గనైజేషన్లకు రెండింటికీ ప్రయోజనం చేకూరనుందని ప్రభుత్వ అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment