
నాటింగ్‌హామ్: గతంలో వన్డేల్లో 300 పరుగులను చేధించడమంటే చాలా కష్టంగా ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం 300 లక్ష్యం అనేది చాలా చిన్న విషయంలా మారిపోయింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన నాలుగో వన్డేలో పాకిస్తాన్ నిర్ధేశించిన 341 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ అలవోకగా సాధించింది. మూడు రోజుల వ్యవధిలో 340 అంతకంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని రెండు సార్లు చేధించిన జట్టుగా ఇంగ్లండ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. దీంతో వన్డేల్లో 340 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని అత్యధికంగా నాలుగుసార్లు ఛేదించిన తొలి జట్టుగా నిలిచింది. గతంలో భారత్ మూడుసార్లు ఈ ఘనత సాధించగా అది కాస్త ఇప్పుడు కనుమరుగైంది.