
సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ : భార్య వస్తువు కాదని.. ఇష్టం ఉన్నా, లేకున్నా ఆమెను బలవంతంగా భర్త తన దగ్గరే ఉండాలనడం సరైన పద్ధతి కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇష్టం లేదని ఎంత మొత్తుకున్నా తన ఇంట్లోనే, తన దగ్గరే ఉండాలని భర్త క్రూరమైన చర్యలకు దిగుతున్నాడంటూ ఓ వివాహిత సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. భర్తపై వేసిన క్రిమినల్ కేసు పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం బాధితురాలకి బాసటగా నిలిచేలా తీర్పు వెల్లడించింది.
‘భార్యేం వస్తువు కాదు. నీతో ఉండాలని భార్యను బలవంతం చేయవద్దు. ఆమె నీ వద్ద ఉండాలని కోరుకోవడం లేదు. నీ ఇంట్లోనే, నీతోనే ఉండాలని నువ్వు ఎందుకు ఒత్తిడి తీసుకొస్తున్నావంటూ’ మదన్ బి లోకూర్, దీపక్ గుప్తా ధర్మాసనం ఆ వివాహిత భర్తను ప్రశ్నించింది. భార్య తనతోనే ఉండాలన్న నిర్ణయాన్ని మరోసారి ఆలోచించుకోవాలని, ఆమె ఒప్పుకుంటే ఎలాంటి సమస్య ఉండదని అభిప్రాయపడ్డారు. కానీ మహిళకు ఇష్టం లేని పక్షంలో ఆమె కోరుకున్న చోట ఉండే స్వేచ్ఛ ఎప్పుడు ఉంటుందని చెప్పారు. ఆగస్ట్ 8న మరోసారి విచారణకు రానుంది.
మహిళ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ‘భర్త చిత్రహింసలు తట్టుకోలేక విడాకులు తీసుకోవాలని భావిస్తోంది. అయినా భర్తను క్షమించి కేసు వెనక్కి తీసుకోవాలని చూస్తున్నాం. అయితే భర్త నుంచి ఆమె వేరుగా ఉండాలని తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు సమర్థించిందని’ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment