పరదేశీనాయుడు (ఫైల్)
మహబూబ్‌నగర్ క్రైం : ఉమ్మడి రాష్ట్రంలోనే పెనుసంచలనం సృష్టించిన సోమశిల మందుపాతర దాడి ఘటనకు నేటితో 24ఏళ్లు పూర్తవుతున్నాయి. అప్పట్లో నల్లమల పరిసర ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు, కార్యక్రమాలు ఎక్కువగా ఉండేవి. ఈ క్రమంలో 14 నవంబర్ 1993న మావోయిస్టులు (అప్పటి పీపుల్స్‌వార్) కొల్లాపూర్ మండలం సోమశిలలో ఓ అతిథి గృహానికి నిప్పు పెట్టారు. ఆర్టీసీ బస్సును ధ్వంసం చేశారు. ఈ మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించడానికి ఓ ప్రైవేట్ బస్సులో అప్పటి ఉమ్మడి జిల్లా ఎస్పీ పరదేశీనాయుడుతో పాటు ఎస్సైలు శివప్రసాద్, టి.కిషోర్, ఏఆర్ హెచ్‌సీ రంగారెడ్డి, కానిస్టేబుళ్లు వై.వీ.ఎన్ ప్రసాద్, జయరాములు, షేక్ హైదర్, ఎస్.సుభాన్, జోహెబ్ ఎక్బాల్ సోమశిలకు చేరుకున్నారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించి తిరిగి జిల్లా కేంద్రానికి వస్తున్న క్రమంలో కొల్లాపూర్–సోమశిల మధ్య ఘాట్ రోడ్డులో బస్సును పేల్చారు. ఈ ఘటనలో కొందరు అక్కడికక్కడే మృతిచెందారు. రెండు కాళ్లు తెగిపోయి తీవ్రంగా గాయపడినప్పటికీ ఎస్పీ పరదేశీనాయుడు, ఇతర సిబ్బంది విరోచితంగా కాల్పులు జరిపి మావోయిస్టులను ఎదుర్కొన్నారు. దీంతో బస్సులో భారీ స్థాయిలో పోలీసు శాఖకు సంబంధించిన ఆయుధాలను వారికి చిక్కకుండా కాపాడారు. అయితే, ఎదురుకాల్పులు ముగిసిన తర్వాత ఎస్పీ సంఘటన స్థలంలోనే మృతి చెందారు. ఆయనతో పాటు 9మంది వీరమరణం పొందారు. అయితే ఒక ఎస్పీ స్థాయి అధికారి మృతి చెందడం అదే తొలిసారి.
నేడు వర్ధంతి సభ
మావోయిస్టుల కాల్పులలో వీరమరణం పొంది న పరదేశినాయుడు వర్ధంతిని మంగళవారం నిర్వహిస్తున్నట్లు మహబూబ్‌నగర్ ఎస్పీ బి.అనురాధ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10గంటలకు పట్టణంలోని వన్‌టౌన్ చౌరస్తాలో ఉన్న పరదేశినాయుడు విగ్రహం వద్ద సాయుధ బలగాలు నివాళులర్పించే కార్యక్ర మం ఉంటుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment