సాక్షి, గన్నవరం: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామం వద్ద అక్రమంగా కారులో తరలిస్తున్న 450 కిలోల గంజాయిని శనివారం రాత్రి ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా నుంచి తమిళనాడుకు కారులో అక్రమంగా తరలిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖకు సమాచారం అందడంతో ఆత్కూరు జాతీయ రహదారి ఉన్న వంతెన వద్ద ఎక్సైజ్ శాఖ స్టేట్ టాస్క్‌ఫోర్స్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ నేతృత్వంలో గన్నవరం ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది గంజాయిని తరలిస్తున్న కారుని అడ్డుకున్నారు.
ఆదివారం విజయవాడ ఎక్సైజ్ ఏసీపీ శ్రీనివాస్ మీడియాకు వివరాలు వెల్లడించారు. 450 కేజీలు గంజాయి, కారు స్వాధీనం చేసుకున్నామని.. గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు పరారైనట్లు తెలిపారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తుల వద్ద బలమైన ఇనుపరాడ్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నిందితులు పలు గంజాయి కేసుల్లో పాడేరు కోర్టుకు హాజరై వస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. ఆధార్ కార్డుతో పాటు పలు ఆధారాలు లభించాయని ఏసీపీ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment