సాక్షి, బెంగళూరు: ముంబైలో పబ్‌లో అగ్నిప్రమాదం జరిగి 14 మంది మృతి చెంది పదిరోజులైనా కాకముందే మరో మహానగరంలోనూ బార్ అండ్ రెస్టారెంట్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు కలాసిపాళ్యలోని కైలాస్ బార్ అండ్ రెస్టారెంట్‌లో సోమవారం తెల్లవారుజామున చెలరేగిన మంటల కారణంగా అందులో పనిచేసే ఐదుగురు కార్మికులు దుర్మరణం చెందారు. మృతులను తుమకూరుకు చెందిన స్వామి, ప్రసాద్, మహేష్, హాసన్‌కు చెందిన మంజునాథ్, మండ్యకు చెందిన కీర్తిగా గుర్తించారు.
నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో, ఇరుకైన ద్వారంతో ఈ బార్ ఉంది. తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో మంటలు చెలరేగగా అక్కడే నిద్రిస్తున్న ఐదుగురు బయటకు వెళ్లలేక బాత్‌రూమ్‌లో దాక్కున్నారు. పొగకు ఊపిరాడక వారంతా ప్రాణాలు విడిచినట్లుగా భావిస్తున్నామనీ, పోస్ట్‌మార్టమ్ నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ప్రమాదం జరిగిన వెంటనే బార్ యజమాని వీఆర్ దయాశంకర్‌ను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment