
దిస్‌పూర్: అస్సాంలోని టీ తోటల ప్రాంతాల్లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు యువకులపై 50 మంది గుంపు విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. తీవ్ర గాయాలతో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. జోర్హాత్ జిల్లాలో శనివారం ఈ ఘటన జరిగింది. టూరిస్టు ప్రాంతం గభోరు పర్బాత్‌కు వెళ్లిన ఇద్దరు స్నేహితులు దేవాశిష్ గొగోయ్ (23), ఆదిత్యదాస్ శనివారం సాయంత్రం బైక్‌పై ఇంటికి తిరుగుపయనమయ్యారు.
మరియాణి పట్టణానికి సమీపాన ఉన్న టీ ప్యాక్టరీ వద్దకు చేరుకున్న క్రమంలో దారిగుండా వెళ్తున్నఇద్దరు మహిళలను వారి ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దాంతో 50 మంది గుంపు వారిపై ఒక్కసారిగా దాడికి దిగింది. మహిళలకు పెద్దగా గాయాలు కాలేదని, ప్రమాదానికి సంబంధించి ఎలాంటి వాదనలు లేకుండానే యువకులను గుంపులోనివారు చావబాదారని స్థానికులు తెలిపారు. ఇక దేవావిష్ తండ్రి, సోదరి హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని నచ్చజెప్పినా వారు వినిపించుకోలేదని పోలీసులు వెల్లడించారు. యువకులను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించినప్పటకీ ఫలితం లేకపోయిందని చెప్పారు. దేవాశిష్ ప్రాణాలు విడువగా.. ఆదిత్యదాస్ చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేశామని, నలుగురిని అరెస్టు చేశామని వెల్లడించారు.
(చదవండి: మానవత్వాన్ని చాటుకున్న మిజోలు)
Comments
Please login to add a commentAdd a comment