
భూపాలపల్లి: ఏడేళ్ల బాలిక హత్యకు గురై పుట్టినరోజు నాడే మృతదేహంగా కనిపించిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి(గోరి)లో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన ఈర్ల రాజు, ప్రవళికకు కుమార్తె రేష్మ(7) ఓ ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ చదువుతోంది. ఆదివారం రాత్రి గ్రామంలో డీజే సౌండ్ సిస్టమ్, కళాకారులు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. శబ్దాన్ని విన్న రేష్మ ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత తల్లి వచ్చి చూడగా బాలిక కనిపించలేదు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు రేష్మ కోసం వెతికారు.
రాత్రి ఒంటిగంట వరకు వెతికినా ఆచూకీ తెలియలేదు. ఈ క్రమంలో రేగొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం రాజు బంధువులు గ్రామంతోపాటు గ్రామ పరిసరాల్లో గాలించారు. రాజు సోదరుడు సదయ్య ఓ గడ్డివాములో రేష్మ మృతదేహం గుర్తించి సమాచారం అందించాడు. బాలికపై అత్యాచారం చేసి.. హత్య చేసినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. సోమవారం రేష్మ పుట్టిన రోజు కాగా ఆదివారం తల్లి ప్రవళిక, రేష్మ పరకాలకు వెళ్లి కొత్త దుస్తులు, కేక్‌ను తీసుకొచ్చారు. పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాల్సిన రోజునే రేష్మ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment