సాక్షి, సత్తుపల్లి : ఆనందంగా ఆడుకుంటున్న చిన్నారికి ఊయలే ఉరి తాడైంది. పట్టణంలోని ఎన్‌వీఆర్ కాంప్లెక్స్ రోడ్‌లో నివాసం ఉంటున్న వలపర్ల రవికుమార్, కవితలకు స్వర్ణిక, సాత్విక ఇద్దరు కుమార్తెలున్నారు. దివ్యాంగుడైన రవికుమార్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట బడ్డీకొట్టు, స్వర్ణిక జిరాక్స్‌సెంటర్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరిది కల్లూరులోని అంబేడ్కర్‌నగర్. గురువారం మధ్యాహ్నం పిల్లలకు భోజనం తినిపించి తల్లిదండ్రులు ఇంట్లో భోజనం చేస్తున్నారు. ఆ సమయంలో వరండాలో చీరతో కట్టిన ఊయలలో పెద్దకుమార్తె స్వర్ణిక(7) కూర్చొని గుండ్రంగా తిరుగుతూ ఆడుకుంటుంది. ఈ క్రమంలో ఊయల ఆమె మెడకు చుట్టుకొని బిగుసుకుపోయి తల వేలాడుతుంది.
అదే సమయంలో ఆ వీధిలో వెళ్తున్నవారు చిన్నారి వేలాడుతున్న విషయాన్ని గమనించి తల్లిదండ్రులను పిలిచారు. ఊయలలో నుంచి చిన్నారి స్వర్ణికను దింపి చూడగా.. కదలికలు లేకపోవడంతో చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. హెడ్‌కానిస్టేబుల్ ప్రతాప్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి స్వర్ణిక మృతదేహం వద్ద తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండడంతో చూపరులను కంటతడి పెట్టించింది.
Comments
Please login to add a commentAdd a comment